Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…

October 13, 2025 by M S R

.

దసరా, దీపావళి వస్తే ధమాకా సేల్స్ ప్రకటనలతో మీడియాకు పండగే పండగ. మామూలుగా కరువుకు బ్రాండ్ అంబాసిడర్లుగా బక్కచిక్కినట్లు ఉండే పేపర్లు దసరా, దీపావళుల్లో అదనపు పేజీలతో ఉబ్బి…ఒకచేత్తో పట్టుకోలేంతగా బరువెక్కి ఉంటాయి. చిత్ర, విచిత్ర ప్రకటనలమధ్య వార్తలెక్కడుంటాయో వెతుక్కోవడం పాఠకుల వంతు.

సాధారణంగా ప్రకటనలు ఎవరూ చదవరు కాబట్టి లోకం ఈమాత్రం బతికి బట్టకట్టగలుగుతోంది. జీవితబీమా ధీమా ఉన్నవారు, ప్రాణాలకు తెగించినవారు అప్పుడప్పుడు ప్రకటనలను చదవడానికి సాహసిస్తూ ఉంటారు. అలా సాహసించి చదివినా అర్థం కావు. అలా అర్థం కాకుండా రాయడం, యాడ్ ను ఇనుప గుగ్గిళ్లతో దుర్భేద్యమయిన విషయంగా తయారు చేయడం దానికదిగా ఒక విద్యలా ఉంది.

Ads

కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మంది మనసు గెలవాలని తయారుచేసే ప్రకటనల్లో అనువధ జరిగి పాఠకులకు కడుపులో ఎలా దేవినట్లు ఉంటుందో ప్రకటనకర్తలకు తెలియదు. లేక తెలిసినా పగబట్టి పాఠకులను హింసిస్తూ అజ్ఞానానందంలో మునిగితేలుతున్నారేమో మనకు తెలియదు.

ఒక్కో భాషకు ఒక్కో మాట్లాడే పధ్ధతి, రాసే పధ్ధతి ఉంటాయి. ఎన్నెన్ని వేనవేల కొత్తపదాలను ఇముడ్చుకున్నా ఆ వ్యాకరణ నియమాలు మారవు. అదే ఆ భాష ముద్ర, ప్రత్యేకత, అస్తిత్వం. అలా లేకపోతే ఆ భాష మనుగడే ప్రమాదంలో పడుతుంది. అలా వాణిజ్య ప్రకటనలవల్ల, చదువుకున్న తెలుగువారి ఇంగ్లిష్ వ్యామోహంవల్ల, సోషల్ మీడియా ఇన్ఫార్మల్ రాతలవల్ల తెలుగు భాష ప్రమాదంలో పడి…ఊపిరాడక విలవిలలాడుతోంది.

ఇదివరకు తెలుగులో ఒక తలకట్టు, దీర్ఘం తప్పు రాసినా, అక్షరానికి ఒక ఒత్తు తప్పుగా రాసినా అర మార్కు తీసి అయ్యవార్లు తెగ తిట్టేవారు. తప్పులు మరీ ఎక్కువైతే కొట్టేవారు. చెంపదెబ్బలతో బుగ్గల్లో బూరెలు పండించేవారు. గుంజిళ్ళు తీయించేవారు. తొడపాశం పెట్టి ఆ ఒత్తులు కలకాలం గుర్తుండేలా చేసేవారు. క్లాసు బయట ఎండలో నిలుచోబెట్టేవారు. మరుసటిరోజు ఆ మాటలను వందసార్లు రాసుకురమ్మని పనిష్మెంట్ ఇచ్చేవారు.

తెలుగు అయ్యవార్ల ఈ హింస భరించలేక లోకం సంస్కృతంవైపు మళ్ళింది. సంస్కృతాన్ని తెలుగులో రాసినా, ఇంగ్లిష్ లో రాసినా, పైశాచీలో రాసినా వందకు వంద మార్కులు గ్యారెంటీ. కాళిదాసును తోసిరాజని ఈ సంస్కృత విద్యార్థులు వందకు వంద మార్కులు ఎలా తెచ్చుకోగలుగుతున్నారని లోకం ఏనాడూ ఆలోచించలేదు.

బతికి ఉండగానే తెలుగుకు సమాధికట్టి సంస్కృతాన్ని మార్కుల వైతరణి దాటడానికి కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలా ప్రోత్సహించాయో ఎవరూ పట్టించుకోలేదు. స్కూల్లో, ఇంటర్లో సంస్కృతం తీసుకున్న ఈతరం పిల్లలకు ఆ సంస్కృతం ఎంత వచ్చో ఎవరూ అడగకూడని ప్రశ్న. ఆ గొడవ మనకెందుకు? మన దసరా, దీపావళి ప్రకటనల్లో తెలుగు దగ్గరికి వెళదాం.

ఇంగ్లిష్ లో ఎ, యాన్, ది (a, an and the) ఆర్టికల్స్. నిశ్చయార్థకాన్ని సూచిస్తాయి. ఎక్కడెక్కడ ఎ వస్తుంది, ఎక్కడ యాన్ వస్తుంది, ఏ మాటలముందు ది వస్తుంది అన్న ఇంగ్లిష్ వ్యాకరణ చర్చ ఇక్కడ అనవసరం. ఇంగ్లిష్ భాషలో తప్పనిసరి ఆర్టికల్స్ ఇంగ్లిష్ కే ఎందుకుండాలి? ఇంగ్లిష్ అంటే పడిచచ్చే తెలుగులో కూడా అవే ఆర్టికల్స్ ఎందుకుండకూడదు అని ఒక యాడ్ ఏజెన్సీవారు అనుకున్నట్లున్నారు.

telugu

“థ గ్రేట్ దీపావళి ఆఫర్” అని తెలుగులో తాటికాయంత అక్షరాలతో మొదటిపేజీ రంగుల ప్రకటనను తయారుచేశారు. ప్రచురణకు పంపారు. పత్రికల యాజమాన్యాలు కూడా మనలాగే ప్రకటనలను చదవకూడదు కాబట్టి యథాతథంగా ప్రచురిస్తాయి. రెండు, మూడు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించడానికి ఒక రోజుకే కోటి దాకా ఖర్చవుతుంది.

“ది గ్రేట్ దీపావళి ఆఫర్” అని రాసినా మాయాబజార్లో పింగళి ఘటోత్కచుడిచేత చెప్పించినట్లు పోతేపోనీ అని రెండు వీరతాళ్ళు వేయడానికి అవకాశం ఉండేది. “థ” ఎందుకొచ్చిందో! ఎలా వచ్చిందో! “థూ…థూ ” అని రాయబోయి “థ” రాశారేమో తెలియదు.

చాలా కాలంగా తెలుగు భాషలో కొత్త ప్రయోగాలు జరగక భాష మురుగుపట్టి కుళ్ళు కంపు కొడుతోంది. ఇలాంటి ప్రయోగాలతో భాషకు కొత్త జవసత్వాలు వస్తాయి. నూతనత్వం వస్తుంది. తెలుగులో చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని, బహుజనపల్లి సీతారామాచార్యుల ప్రౌఢవ్యాకరణాన్ని గుంతతీసి పూడ్చిపెట్టి…తెలుగుకు కూడా ఎంచక్కా ఇంగ్లిష్ వ్యాకరణాన్నే వాడుకోవచ్చు.

ఇంగ్లిష్ ఆర్టికల్స్ వ్యాకరణం అడుగుజాడల్లో ఇకపై మనం చదవబోయే తెలుగు ఇలా ఉండాలి:-

  • “దినదినమూ దిగులు పడకండి. ది అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీలో దిగి ది అనితరసాధ్య అనుభవాన్ని ద సొంతం చేసుకోండి. యాన్ అపార్ట్ మెంట్ మీకోసం ది వెదురుకర్రలతో యాన్ ఎదురు చేస్తోంది. ఎ జీవితకాలపు కలను యాన్ అడ్వెంచర్ గా మలుచుకోండి. ది బెస్ట్ ధర ఫార్ యాన్ అకేషన్. యాన్ అంచనా పట్టిక మీకోసం. ది అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇంగ్లిష్ పులుముకున్న తెలుగు పిలుస్తున్న”ది”. “ఎ” చివరి పిలుపు “యాన్” ఇబ్బంది ఇది!”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదే జగన్ ప్లేసులో తనుంటే… ఆ సీఎస్‌ను చంద్రబాబు ఏం చేసేవాడు..?
  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions