.
తెలంగాణ పోలీసు విభాగంలో కీలక విభాగాలకు మహిళా ఐపీఎస్‌ల సారథ్యం… జైళ్ల శాఖ, ఎస్ఐబి, ఎసిబి, సిఐడి, విజిలెన్స్, పోలీసు అకాడమీ, ఆర్మ్‌డ్ రిజర్వ్, సిసిఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు బాసులు మహిళా అధికారులు… గత ప్రభుత్వంలో మహిళా ఐపిఎస్‌లకు మొండిచేయి… దక్కని ప్రాధాన్యం…
సీపీఐ పత్రిక ప్రజాపక్షంలో కనిపించిన ఈ కథనం ఆసక్తికరంగా ఉంది… దాని సారాంశం ఏమిటంటే..?
Ads
.
ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన అధికారుల కృషిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపిఎస్ అధికారులకు మంచి పోస్టింగులు ఇచ్చింది… కీలక విభాగాలలో మహిళా ఐపిఎస్‌ల నియామకాలతో పరిపాలనలో కొత్త ఉత్సాహం నెలకొంది…
ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీలలో అనుభవజ్ఞులైన, నిబద్ధత గల అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం, కృషికి విలువ ఇచ్చే ప్రభుత్వం తన వైఖరిని మరోసారి చాటిచెప్పింది… ప్రజల సేవలో ముందుండే అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రజలలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది…
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళా ఐపీఎస్ అధికారులు ప్రజాసేవలో, తమ విధుల్లో మరింత చురుకుగా వ్యవహరించాలని తెలంగాణ సమాజం ఆకాంక్ష… ఒక ఐపిఎస్ మహిళ ఒక విభాగం చూడాలంటేనే తలకు మించిన భారం… అలాంటిది రెండేసి కీలక విభాగాలను సైతం సమర్ధవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపిఎస్‌లు తెలంగాణలో ఉండడం విశేషమే…
పోలీసు శాఖకే మణిహారం తెలంగాణ పోలీసు అకాడమీ. దీనికి అధిపతి డిజి అభిలాష బిస్త్… ఇక్కడ కానిస్టేబుల్ నుంచి డిఎస్పి స్థాయి వరకు శిక్షణ ఇస్తారు… అలాగే ఫైర్, ఫోరెన్సిక్ సైన్స్, తదితర విభాగాలకు చెందిన అధికారులు కూడా ఇక్కడే శిక్షణ పొందాల్సి ఉంటుంది…
తెలంగాణ జైళ్ల శాఖ కూడా కీలకమైన విభాగమే… ఈ విభాగానికి డిజి సౌమ్య మిశ్రా సారధ్యం… రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అవినీతిపై దృష్టి సారించే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధిపతిగా కూడా డిజి స్థాయి మహిళా అధికారి శిఖా గోయల్…
ఈమె మరో కీలక విభాగమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కూడా డైరెక్టర్… ప్రభుత్వ ఉద్యోగుల అవినీతితో పాటు ప్రభుత్వ ధనాన్ని దోచుకునే బడా నేరస్తుల భరతం పట్టే అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి ఇన్చార్జ్ చీఫ్ గా, మరోవైపు రాష్ట్రంలో జరిగే బడా కేసుల భరతం పడుతున్న సిఐడి చీఫ్ చారు సిన్హా… ఒక మహిళా అధికారికి కీలకమైన ఎసిబి, సిఐడి విభాగాలను అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం…
ఇక మావోయిస్టులు, ఉగ్రవాదులను అరికట్టేందుకు వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టే ఎస్ఐబి చీఫ్ బి.సుమతి … ఇదీ కీలకమైన విభాగమే… ఇక రాష్ట్రంలోని హోంగార్జుల యోగక్షేమాలు చూసుకునే పోస్టులో మహిళా సీనియర్ ఐపీఎస్ స్వాతి లక్రా…
రాష్ట్రంలోనే అతిపెద్ద కమిషనరేట్‌గా ఉన్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మహిళా ఐపిఎస్‌ల హవా గతంలోకంటే ఈసారి రెట్టింపు… హైదరాబాద్ పోలీసు పరిపాలన విభాగానికి మహిళా ఐపిఎస్ అధికారి నూతన పరిమళ బాస్…
హైదరాబాద్‌లో ఎక్కడ అల్లర్లు జరిగినా, రాజకీయ బహిరంగ సభలు జరిగినా, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు జరిగినా క్షణాల్లో సిబ్బందిని బందోబస్తుకు తరలించాల్సిన సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ చీఫ్ గా రక్షిత కృష్ణమూర్తి … నిఘా వర్గాల్లో కీలకమైన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ విభాగం బాస్ కూడా మహిళా ఐపిఎస్ అధికారి… అపూర్వ రావు….
బడా నేరస్తులు, బడా చీటింగ్ నిందితులు భరతం పట్టే సిసిఎస్ డిసిపిగా శ్వేతారెడ్డి… రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్ అరికట్టే సైబర్ క్రైమ్ విభాగం చీఫ్ డిసీపిగా డి.కవిత…
పోలీసు శాఖలోని ఈ కీలక విభాగాలలోనే కాకుండా శాంతి భద్రతల విభాగంలో కూడా మహిళా ఐపిఎస్ అధి కారులకు కీలక బాధ్యతలు… హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డిసిపిలుగా ఏడుగురు మహిళా అధికారులే… రాచకొండలో నాలుగు జోన్లలో మూడు, హైదరాబాద్‌లో మూడు జోన్లలో, సైబరాబాద్ ఒక జోన్‌లో మహిళా ఐపిఎస్‌లు…
హైదరాబాద్‌లో సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి, నార్త్ జోన్ డిసిపి ఎస్. రష్మీ పెరుముల, సౌత్ జోన్ డిసిపి స్నేహా మెహ్రా, రాచకొండలో ఎల్బినగర్ డిసిపి బి. అనురాధ, మల్కాజిగిరి డిసిపి పివి. పద్మజ, మహేశ్వరం డిసిపి డి.సునితారెడ్డి, రాచకొండ సైబర్ క్రైమ్ చీఫ్ ఎస్ వి.నాగలక్ష్మి, రాచకొండ అడ్మిన్ డిసిపి పి. ఇందిర…
సైబరాబాద్‌లో మాదాపూర్ డిసిపి రితి రాజ్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపి సాయిశ్రీ, సైబరాబాద్ మహిళా భద్రత విభాగం డిసిపి కె.సృజన కర్ణం… వీళ్లే కాదు… రైల్వే పోలీసు ఎస్పీగా మహిళా ఐపిఎస్ అధికారి చందనా దీప్తి … జాతీయ పోలీసు అకాడమీలో కూడా తెలంగాణ సీనియర్ ఐపిఎస్ అధికారి రోహిణి ప్రియదర్శిని… ఇక జిల్లాల్లో ఎస్పీలు ఎవరంటే… నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల, మహబూబ్‌నగర్ ఎస్పీ జానకీ ధరావత్… ఇంట్రస్టింగ్ స్టోరీ… సౌజన్యం :: ప్రజాపక్షం… (బిరుదరాజు వాసుదేవరాజు)…
Share this Article