Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పాట పీక పిసికిన హంతకుడెవరు..? ఈమె ఎందుకు మూగబోయింది..!?

October 16, 2025 by M S R

.

#ఫెయిల్యూర్_స్టోరీ #నివాళి…. పాట మూగబోయిన వైనం

అలనాటి గాయని రావు బాల సరస్వతి గారు నిన్న అంతిమ శ్వాస విడిచారు. వారితో సరిగ్గా 21 ఏండ్ల కింద చేసిన ముఖాముఖీ ఇది. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో వారి అంతరంగాన్ని వినిపించిన ఫెయిల్యూర్ స్టోరీ…

Ads

వారు లేని ఈ వేళ… కన్నీటి నివాళిగా ఆ కథనం టైప్ చేసి పోస్టు చేస్తున్నాను. అప్పుడు పెట్టిన శీర్షిక కూడా ‘పాట మూగబోయిన వైనమే’… కందుకూరి రమేష్ బాబు

ఫస్ట్ రికార్డు పాడేటప్పటికి రావు బాల సరస్వతి గారి వయస్సు కేవలం ఆరేళ్ళు. ఆ వయసులో దక్షిణాదిన పాడిన మొదటి గాయని సరస్వతి గారే. ఇదొక్కటే కాదు, ఎన్నో ఘనతలు ఆమె సొంతం. తొలి గ్రామఫోన్ రికార్డు పాడింది ఆవిడే. తొలి ప్లేబ్యాక్ సింగర్ ఆవిడే. తొలిసారిగా లలిత సంగీతాన్ని ప్రారంభించింది కూడా ఆవిడే. ఇవన్నీ పదిహేనేళ్ళ వయస్సు లోపే సాధించారు. మరి ఆ తర్వాత ఏం చేశారు?

ఏమీ చేయలేకపోయారు.
ఆ తర్వాతి జీవితం శాపగ్రస్తగా గడిపారు. నిజం.
ఆవిడ ఇంట గెలవని సరస్వతి.

బాల సరస్వతిగా ఉన్నప్పుడు ఆవిడ ఆబాల గోపాలాన్ని అలరించారు. కానీ వైవాహిక జీవితం ప్రారంభంతోనే ఆమె పాట ఆగిపోయింది. ఆమె మెడలో ధరించిన మాంగల్యం ఆమె గొంతును మూగబోయేలా చేసింది. అదే ఆమె జీవితంలో తీరని విషాదం.

ఈ ఇంటర్వ్య్హూ చేసేటప్పటికి ఆవిడకు డెబ్బయ్ నాలుగేళ్ళు. తనను కలవడానికి వచ్చేవారితో ముచ్చటించేందుకు వీలుగా గాంధీనగర్ లోని ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

  • “అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన పాడనివ్వలేదని” అంటూ ఆమె తన విషాద నేపథ్యాన్ని చెప్పడానికి ఉపక్రమించారు. ఆవిడ వైపల్యగాథను వింటుంటే ఒక నేపథ్య గానం హృదయాన్ని కలచివేసినట్టయింది.

“అందరు అనడం ఏమిటంటే, నా పాట వినే ఆయన నన్ను కోరి చేసుకున్నారని. కానీ అది నిజం కాదు. నేను అతడి మూడో భార్యని. థర్డ్ వైఫ్” అన్నారు గాన సరస్వతి. ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె గొంతు కాసింత వణికింది.

“పిల్లల్లేరని చెప్పి నన్ను చేసుకున్నారు. వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం ఇష్టం లేక నన్ను కోరి చేసుకున్నారు. 1944 జూన్ 22 న నాకు మ్యారేజీ అయింది. మాది అరెంజ్డ్ మ్యారేజ్.”

“ఆయనకు సంగీతం ఇష్టమనే అప్పుడు చెప్పారు. ‘నువ్వు పాడుకోవచ్చు. నీకేం ఇబ్బంది లేదు. హాయిగా పాడుకోవచ్చు’ అన్నారు. అప్పుడు ఎంత సంతోషించానో చెప్పలేను.”

“మ్యారేజీ అయిన తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు. వారికి సంగీతం అంటే ఐడియా లేదు. రికార్డింగ్ తదితర తతంగం ఉంటుందనే సంగతి అస్సలు తెలియదు. ఒకట్రెండుసార్లు రికార్డింగ్ కు వెళ్లినప్పుడు అదెలా ఉంటుందో అర్థమైంది. దాంతో అడ్డు చెప్పడం ప్రారంభించారు. ఇది నేను ఊహించని పరిణామం.”

  • “మూడు నాలుగు సంఘటనల తర్వాత నా సంగీత ప్రపంచం కుప్పకూలింది.”

“ఒకసారి డ్యూయెట్ పాడాల్సి వచ్చింది. నా పక్కన ఘంటసాల కూచొని పాడారు. అది చూసి మా సర్వెంట్స్, కారు డ్రైవర్ నా పక్కన ఒకాయన కూచొని పాడుతున్నాడని మావారితో చెప్పారు. అది ఆయన భరించలేక పోయారు. చాలా తప్పు పట్టుకున్నారు. “ఎవడు వాడు. కూచొని పాడుతాడా? అన్నారు. “ఎంత తప్పది. అట్లా కూచోవచ్చా?” అంటూ “ఇక నువ్వు పాడకూడదు” అని హెచ్చరించారు. ఇది మొదటి సంఘటన.

***

ravu bala saraswathi

“తర్వాత మరొక సంఘటన జరిగింది. వాల్మీకి సినిమాకు సోలో సాంగ్స్ పాడుతున్నారు. నేను రికార్డింగ్ లో ఉండగా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. నన్నొకసారి ఇంటికి రమ్మనమని ఫోన్ చేశారు. కానీ ప్రొడక్షన్ మేనేజర్ బదులిస్తూ “ అమ్మగారు రికార్డింగ్ లో ఉన్నారు. మైక్ ముందు పాడుతున్నారు. పిలిస్తే మూడ్ చేంజ్ అవుతుంది. ఒక అరగంట ఆగి ఫోన్ చేయండి’ అన్నాడు.

అంతే. ఆయనకు కోపం వచ్చేసింది. “నేను ఫోన్ చేస్తే పిలవనని, అరగంట టైం తీసుకుని చేయమంటాడా? అసలు వాడెవడు?” అని మండి పడుతూ నేరుగా కారేసుకుని స్టూడియోకు వచ్చారు. నేనింకా మైక్ దగ్గరే ఉన్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయన వచ్చేసి ప్రొడక్షన్ మేనేజర్ పై కేకలేశారు. “నేనెవరో తెలుసా? నాతో అరగంట తర్వాత ఫోన్ చేయమంటావా?” అని అరిచారు. ఇంతలో నేనొచ్చాను. కారు డోరు తెరిచి ఉంచడంతో ఎక్కి కూచున్నాను. తిన్నగా బంగాళాకు వచ్చేశాం. “

“ప్రొడ్యూసర్ లబోదిబోమన్నాడు. నేను పాడకపోవడం వల్ల టెన్ థౌజెండ్ లాస్ వచ్చిందన్నాడు. అట్లా అనేటప్పటికి “నువ్వెంత, నీ స్థూడియో ఎంత” అంటూ ఆ మొత్తానికి చెక్ రాసి, విసిరి అతడి మొహమ్మీద కొట్టేశారు మావారు.”

***

డ్యూయెట్ పాడకూడదన్న తర్వాత మరొక సంఘటన జరిగింది. నేనూ, సాలూరు రాజేశ్వర రావు గారూ బాల్య స్నేహితులం. మేమిద్దరం చిన్నప్పటి నుంచే కలిసి పాడేవాళ్ళం. అప్పుడు నాకు పదకొండేళ్ళు. ఆయనకు పదహారేళ్ళు. మేమిద్దరం అట్లా కలిసి పాడటం మూలాన మాకు ఎంతో పేరు వచ్చింది. ఒక హాల్ కు వెళ్ళామంటే అది నిండి పోయేది. శ్రోతలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు.

ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగిందో పత్రికల్లో మరునాడు వచ్చేది. అటువంటి కార్యక్రమాల గురించి అచ్చైన వార్తలు చదివి మా వారికి కోపం వచ్చేది. ఒక రోజు బాగా కోపగించి, “నువ్విక అతడితో కూడా పాడకూడదు” అన్నారు. ఆ మాట పెద్ద దెబ్బలా తగిలింది. ఇక పాట ఆగిపోయింది… విచారంగా అన్నారు. “

“తర్వాత చాలామంది వచ్చి చెప్పారు. కానీ ఆయన వినలేదు. ఏదైనా తనమాటే గానీ రెండో మాట లేదు. ఎన్ని చెప్పినా వినలేదు. అట్లా నా పాట పోయింది” అని తన విషాదాన్ని పంచుకున్నారు బాల సరస్వతి గారు.

***

“తర్వాత రేడియోలో పాడుతూ వచ్చాను. ఓసారి సంగీత సమ్మేళనంలో పాల్గొన్నాను. అది తుని అనుకుంటాను. ఆయన కూడా నాతో వచ్చారు. రేడియోనే కదా అనుకున్నారాయన. కానీ వాళ్ళు ఓపెన్ ఎయిర్ లో సంగీత సమ్మేళనం నిర్వహించారు. సంగీత సమ్మేళనం కనుక ఊరు ఊరు నుంచి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పాడిస్తున్నారు.

ఆవేళ దాదాపు పది పదకొండు మంది పాడుతున్నారు. నన్ను పర్టిక్యులర్ గా మద్రాస్ నుంచి పిలిపించారు. నేను ఎప్పుడోగానీ రాను కదా. ఆ వేళ నేను వస్తున్నానని తెలిసి, నేనెట్లా ఉంటానో అని, ఎలా పాడుతానో చూద్దామని చాలామంది జనం వచ్చారు.”

రావు బాలసరస్వతి

“నేను నేరుగా వెళ్లి వేదిక మీద కుర్చీలో కూచున్నాను. ఇంతలో జనం ఆనందాతిశయంతో కేకలు “అమెనొక్కసారి లేచి నిలబడమనండి. ఆమెను చూడాలి” అని కేకలు పెట్టారు. ఆయనకు అర్థం కాలేదు. ‘ఏమిటి? వాళ్ళు ఈమె పాట వినడానికి వచ్చారా? ఈమెను చూడ్డానికి వచ్చారా? అనుకున్నారు. అయినా ఆమెను చూసేదేమిటి? పాటకదా వీళ్ళకు కావాల్సింది’ అని పరిపరివిధలా ఆలోచించారు. అంతే.

విసురుగా హోటల్ కి వెళ్ళిపోయారు. నేను పాట పాడేసి హోటల్ కు వెళ్లాను. వెళ్ళగానే చెప్పారు. ‘ఇంకా ఎప్పుడూ పాట పాడకూడదు” ఆ రోజు స్ట్రిక్ట్ గా చెప్పారు. ఆ సంఘటన తర్వాత పాడటం పూర్తిగా మానేశాను.”

  • “ఇది 1958లో జగిగింది. ఇక అప్పటి నుంచి అస్సలు పాడలేదు. తర్వాత 74లో అంటే ఇరవై ఎనిమిది సుదీర్ఘ సంవత్సరాల తర్వాత మొదటిసారి పాడాను. అదీ ఆయన పోయాక” ఒక్క క్షణం ఆగి చెప్పారు.

“ఆయన పోయిన వెంటనే నేను అదే ఏడాది మద్రాస్ వచ్చాను. అప్పుడు రమేష్ నాయుడు ‘సంఘం చెక్కిన శిల్పాలు’ సినిమా తీస్తున్నారు. అందులో ఒక్క పాటైనా పాడమని పట్టుబట్టి ఒక పాట పాడించారు. అదే చివరి పాట. దాని చరణం ‘పోయి రావమ్మ’. ఇక ఆ తర్వాత సినిమాలకు పాడలేదు.

“తర్వాత మీరా భజన్స్ రికార్డ్ చేశాను. అది గ్రామ ఫోన్ రికార్డు (ఎల్ పి). సి.నారాయణ రెడ్డి గారు రాసిన భజన పాటలవి. హెచ్.ఎం.వి. వాళ్ళ కోసం పాడాను. ఆ తర్వాత రేడియోలో పాడాను. నా పాటలను నేనే ట్యూన్ చేసుకుని నేరుగా రేడియో స్టేషన్ కు వెళ్లి పాడేసి వచ్చేదాన్ని. అట్లా పాడినదంతా లలిత సంగీతమే.”

***

  • “మీ జీవితంలో పాడకుండా ఉన్న కాలమే అధికం కదా! పాడనప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? అని అడిగితే, “పీక పిసికేసినట్టు ఉండేది” అని అనాలోచితంగా అనేశారు. ‘పాడకూడదు’ అనే నిర్ణయం నా జీవితంలో శాపంగా భావించాను” అని ఆలోచనా పూర్వకంగా అన్నారు.

“పాడని కాలమంతా గొంతొక్కటే కాదు మూగ బోయింది. నేను ఎవరినీ కలవడానికి లేదు. మ్యుజీషియన్స్ ను కూడా కలవనివ్వలేదు. నన్ను చూడటానికి వచ్చిన వారిని గేట్లోంచే వెళ్ళగొట్టేవారు. చాలా బాధేసింది. ఈ బాధకు తోడు, ఇంకెవరైనా పాడుతుంటే నాకు లోలోన ఆరాటంగా ఉండేది. ముఖ్యంగా వాళ్ళు సరిగ్గా పాడకపోతే ‘అయ్యో! ఇదిట్లా పాడొచ్చుగదా’ అనిపించి మనసు తల్లడిల్లేది” జ్ఞాపకం చేసుకున్నారు.

***

“…ఇలా జరుగుతుందని నేనెన్నడూ అనుకోలేదు. ఇంకా ఎంతో బాగా పాడొచ్చు కదా అనుకున్నాను. ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు అని కూడా అనుకున్నాను. ఉదాహరణకు ఎం.ఎస్.సుబ్బులక్ష్మినే చూడండి. ఆమె భర్త సదాశివం ప్రోత్సాహం గనుక లేకపోతే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదు. అంతగా ఆయన ప్రోత్సహించారు.

అంతకన్నా ఎక్కువ నేర్చుకోవాలని నేను కలలు కన్నాను. కానీ నా కలలన్నీ విఫలమయ్యాయి. నేను వెస్ట్రన్ మ్యూజిక్ తో సహా అన్నిటినీ నేర్చుకున్నాను. బాంబే వెళ్లి వసంత దేశాయ్ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాను. మద్రాస్ లో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఇన్ని నేర్చుకుని నేను ఎందుకూ పనికి రాకుండా పోవడం నన్ను అమితంగా బాధపెట్టింది.”

“ఆయన్ని ఎదురించలేకపోయరా?”అంటే “అప్పుడంత ధైర్యం, దమ్ము ఎక్కడిది?” అన్నారు.

  • “పెళ్ళయ్యే నాటికి నేను చిన్నపిల్లనే. నాకు పదిహేనేళ్ళ వయసు. ఆయనకు అప్పటికే ముప్పై ఇదు. మా ఇద్దరికీ ఇరవై ఏళ్ల గ్యాప్ ఉండేది. అందువల్ల ఆయన్ని ఎదురించే సాహసం చేయలేదు. అదీగాక, వాళ్ళ కుటుంబంలో సంగీతం లేదు. వాళ్లకి సంగీతం అంటే ఏమిటో తెలియదు. తెలియనప్పుడు ఎంత వాదించి మాత్రం ఏం ప్రయోజనం. కంఠశోష తప్ప! అందుకే అటువంటి ప్రయత్నమే చేయలేదు.”

“నాకు ఇద్దరు కొడుకులున్నారు. వద్దన్నా వినకుండా పాడితే, ఆ తర్వాత పిల్లలు ఏమనుకుంటారో అనుకున్నాను. వాళ్ళ నాన్న మాట ఎందుకు వినలేదంటారేమో అని కూడా భయపడ్డాను. అలా అలా నా పాట పోయింది” అన్నారావిడ.

“ఇంత వయసు గడిచాక… ఇప్పుడు పునరాలోచించుకుంటే ఏమనిపిస్తుంది?” అన్నప్పుడు “పాడలేకపోవడం దురదృష్టమే. నేను కంటిన్యూ చేసి ఉంటే ఎంతో బాగుండేదని అనిపిస్తుంది. అంత పేరు వచ్చిన తర్వాత మానేయడం వల్ల ఎంతో నష్టపోయాననే అనిపిస్తోంది.”

“పిల్లలు కూడా ఇప్పుడు ఫీలవుతున్నారు. ‘అయ్యో, కంటిన్యూ చేసి ఉండాల్సింది’ అంటున్నారు. కానీ వాళ్ళు నా పొజిషన్ లో ఉంటే ఆ పరిస్థితి తెలిసేది” అన్నారావిడ నొచ్చుకుంటూ.

***

  • “అన్నట్టు, మీ వారి పేరేమిటి? ఏం చేసేవారు?” అంటే, “ఆయన పేరు రాజారావ్ ప్రద్యుమ్నకృష్ణ సూర్యారావ్ బహుదూర్” అని నవ్వుతూ చెప్పారు.“ఆయన కోలంక జమిందార్. వేంకటగిరి రాజా గారికి ఆఖరి తమ్ముడని రాసుకోండి” అని కూడా అన్నారు.“వారు పోలో ప్లేయర్. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్. పోలో, గుర్రపు పందాలు – ఇట్లా గడిచి పోయేది ఆయన జీవితం. లక్షల రూపాయలు ఖర్చుపెట్టేవారు. అన్నే చేసేవారు. నేను బయటకు రావడం మాత్రం ఇష్టపడలేదు. అదొక్కటే!” బాధగా చెప్పారావిడ.

“పోనీ, మీ వారు పోయిన తర్వాత ఎందుకు పాడలేదు?” అని అడిగితే, “అప్పటికి మ్యూజిక్ వేరే అయిపోయింది. ట్రెండే మారి పోయింది. కొత్త తరం వచ్చేసింది. దాంతో నా వల్ల కాదనుకున్నాను. ఈ కేకలు, ఈ డ్రమ్స్, ఈ గోల –ఇదంతా నా వల్ల కాదు, నేను పాడలేనని నిర్ణయించు కున్నాను. అలా నా పాట పోయింది” అన్నారావిడ.

*ఉపసంహారం

“మీ జీవితంలో భర్తపరంగా ఎదురైనా ఆశాభంగం తప్పించి ఇతరత్రా విచారకరమైన అనుభవాలు ఎదురయ్యాయా?” అన్నప్పుడు అనే ఒక్క క్షణం ఆలోచించి, “ మన వద్ద కళాకారులను ఆనర్ చేయకపోవడం నన్ను బాధిస్తోంది” అన్నారు.

“మనవాళ్ళు మనని గౌరవించరు” అని కూడా ఒకింత ఆవేదనగా అన్నారు.

“నేను తెలుగులోనే కాదు, తమిళంలో పాడాను. సింహళంలో పాడాను. ఎన్నో భాషల్లో పాడాను. అందరి వద్దా పాడాను. అందరు మ్యూజిక్ డైరెక్టర్లూ నాకు జూనియర్సే. ఒక్క రాజేశ్వర రావు గారు తప్ప” అని గుర్తు చేసుకున్నారావిడ.

“ఆయనా నేను కలిసి 1940లోనే సంగీతాన్ని ప్రారంభించాం. ఇప్పటికీ అరవై నాలుగేళ్ళు గడిచాయి. అప్పట్నుంచి పాడుతున్నా ఇప్పటికీ ఆకాశవాణి వారు నాకు టాప్ గ్రేడ్ ఇవ్వలేదు. దీనికి ఎదో వంకలు చెబుతారు గానీ ఇదంతా ప్రొఫెషనల్ జెలసి వల్లే అనిపిస్తోంది. అది మారాలి” అన్నారు బాధగా.

“మనవాళ్ళు మనని గౌరవించరు” లోలోన అనుకున్నట్టే మళ్ళీ అన్నారావిడ, ఆవేదనగా…. (ఆదివారం ఆంధ్రజ్యోతి, 27 జూన్ 2004)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం మల్లోజుల… లొంగిపోయిన తుపాకీ అంటే అందరికీ అలుసే…
  • కన్నడ- తెలుగు సంకర భాష… తెలుగుకు ఇదోరకం చేతబడి…
  • ఊదు కాలదు, పీరు లేవదు… ఆ ఎల్లమ్మ కథ ఎటూ తేలదు…
  • మిత్రమండలి..! మనకు మనమే చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాల్సిందే..!!
  • ఈ సినిమా ఒకటి చేసినట్టు బహుశా చిరంజీవికీ గుర్తుండి ఉండదు..!!
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్… ప్రపంచం నేర్పిన పాఠాలు…
  • నాకు నువ్వు- నీకు నేను…!! బీజేపీ- బీఆర్ఎస్ రహస్య స్నేహం..?!
  • ఈ పాట పీక పిసికిన హంతకుడెవరు..? ఈమె ఎందుకు మూగబోయింది..!?
  • లొంగుబాటలో తుపాకీ..! మల్లోజుల బాటలోనే ఆశన్న… మరో దెబ్బ..!!
  • ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions