.
మావోయిస్టుల సాయుధ పోరాట విరమణ విస్తరిస్తోంది… వచ్చే మార్చికి ఒక్క నక్సలైట్ కూడా ఉండడు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే ఉరుముతున్నాడు కదా…
మరోవైపు మావోయిస్టు పార్టీలోనే అంతర్గతంగా ఆత్మమథనం సాగుతోంది… పార్టీ ప్రస్థానం, భవిష్యత్తు, సాయుధ పోరాట ఫలితాల మీద నమ్మకం కోల్పోయిన అగ్రనేతలే రిట్రీట్ జపం పఠిస్తున్నారు…
Ads
ఇంకా ఇంకా మిలిటెంట్లను కోల్పోకముందే కళ్లు తెరుద్దామని మల్లోజుల తదితరులు బహిరంగ చర్చనే పెట్టారు కదా.., ఆ భావన మావోయిస్టు పార్టీ పలు దశల్లోనూ చర్చనీయాంశం అవుతోంది… మల్లోజుల బాటలోనే ఇప్పుడు మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న 70 మంది వివిధ స్థాయిల కేడర్‌తో ఆయుధాలతోసహా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి…
మల్లోజుల, తక్కళ్లపల్లి ఇద్దరూ తెలంగాణే… అసలు మావోయిస్టు నాయకత్వంలో మెజారిటీ తెలంగాణవాళ్లే… ఇప్పుడిక ఆశన్న కూడా లొంగిపోతే మావోయిస్టు పోరాటానికి పెద్ద దెబ్బ… పైగా ఇదిక్కడ ఆగిపోకపోవచ్చు… వివిధ జోన్ల కేడర్ కూడా లొంగుబాట వైపు ప్రయాణిస్తారు…
ఆశన్న పార్టీలో పొలిటికల్, సైనిక వ్యూహకర్త… తనది చాలా కీలకమైన పాత్ర పార్టీలో… అలాంటిది తనే లొంగిపోవడం అంటే… ఇక మావోయిస్టు పార్టీ మనుగడపైనే సందేహమేఘాలు కమ్ముకున్నట్టే… ఆపరేషన్ కగార్ ఈరకంగా విజయవంతమవుతున్నట్టా..?
ఆశన్నతోపాటు దండకారణ్య ప్రాంత ముఖ్యమైన మావోయిస్టులు, ప్లాటూన్ కమాండర్లు సైతం లొంగిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది… యూనిఫామ్, తుపాకులతోసహా మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజులపై రెనిగేడ్ (విప్లవద్రోహి) ముద్ర వేసి నక్సల్ సానుభూతిపరులు విమర్శలు చేస్తున్నారు…
ఇక ఆశన్న లొంగిపోతే..? బయట ఉన్నవాళ్లు ఎంతైనా చెప్పవచ్చుగాక… సెంట్రల్ కమిటీ సభ్యులకు తెలియదా..? పోరాటం కొనసాగింపా..? యుద్ధవిరమణా..? చాన్నాళ్లుగా రక్షణ కోసమే మావోయిస్టు దళాల పోరాటం సాగుతోంది… పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు… ఏళ్లకేళ్లు ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ తుపాకులకు తెలియదా ఏం చేయాలో..? లొంగుబాటలో మావోయిస్టు పార్టీ..!!
Share this Article