.
బలగం సినిమా మంచి సక్సెస్ తరువాత దర్శకుడు యెల్దండి వేణు తదుపరి ప్రాజెక్టు ఎల్లమ్మ ఈరోజుకూ పట్టాలెక్కలేదు సరికదా… నెలకో వార్త తెరపైకి వస్తూ వేణు దురదృష్టాన్ని చెబుతున్నాయి…
మొదట నాని అనుకున్నారు, కుదరదు అన్నాడు… తను పక్కా రొటీన్ ఫార్ములా ఇమేజ్ చట్రంలోకి జారిపోయిన చాన్నాళ్లయింది… సో, ఎల్లమ్మ వంటి సినిమాలు చేయడు… అసలు తనను అడగడమే వేస్ట్…
Ads
తరువాత నితిన్ వచ్చాడు వార్తల్లోకి… తమ్ముడు సినిమా మటాష్ అయ్యేసరికి దిల్ రాజు పునరాలోచనలో పడ్డాడు… నిజానికి నితిన్ ఆ కథను ఎలా అంగీకరించి చేశాడో తనకే తెలియాలి… అసలు తన కెరీర్ మాత్రం గాడితప్పటానికి ఇదుగో ఇలాంటి రాంగ్ స్టెప్సే కారణం…
సరే, నితిన్ వద్దనుకున్నారు, నెక్స్ట్… శర్వానంద్… మంచి చాయిస్… బాగా చేయగలడు… కానీ ఏమైందో ఏమో, అసలు తనను అడిగారో లేదో కూడా తెలియదు… కథ చెప్పారనీ, తను కూడా వోకే అన్నాడని వార్తలు కనిపించాయి…
కానీ ఆ పేరు కూడా మాయమైపోయి ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది… తను ఎల్లమ్మ తరహా కథకు ఆప్ట్ అవుతాడో లేదో ఇక దర్శకుడే చెప్పాలి… ఎల్లమ్మ సినిమా అంటే నాలుగు స్టెప్పులు, నాలుగు ఫైట్ల కథ కాదు కదా…
అసలు కథానాయకుడే ఫైనల్ కాలేదు కదా… ఎల్లమ్మ కాస్త వుమెన్ లీడ్ రోల్ సెంట్రిక్ కథ కదా… మొదట్లో సాయిపల్లవిని అనుకున్నారట… మంచి చాయిసే… కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్‌కే ప్రాధాన్యమిస్తోంది… రేంజ్ పెరిగింది… అందుబాటులో లేదు, రాదు…
కీర్తి సురేష్ అనుకున్నారు, తనూ మంచి చాయిసే… మళ్లీ ఆ పేరూ మాయం… అసలు ఎల్లమ్మ సినిమాకు వుమెన్ లీడ్ రోల్ ఎవరు అనేది కదా ముఖ్యం..? మరి కథానాయకుడి గురించి దేవులాట దేనికి..?
బలగంలో ఎవరున్నారని..? ప్రియదర్శి తప్ప మిగతావాళ్లంతా అంత పెద్ద పేరున్న నటులు కూడా కాదు కదా… వాళ్ల నుంచి మంచి నటన తీసుకుని, కథాబలంతో సినిమాను రక్తికట్టించాడు వేణు… అవును, తనకు కావల్సింది మంచి నటనను ఇవ్వగల నటులు, అంతే తప్ప స్టార్లు కాదు కదా…
స్టార్లు అయితే కథ మీద ప్రభావం ఉంటుంది, పొల్యూట్ అవుతుంది… చాలా రాజీలుపడాల్సి వస్తుంది… మరెందుకు ఈ జాప్యం..? అంతా దిల్ రాజు చేస్తున్న ఆలస్యమే… స్టార్ ఉంటే కమర్షియల్ ఈక్వేషన్లు వర్కవుట్ అవుతాయని తన ప్లానింగ్…
వెరసి ఏదీ తేలదు… సినిమా పట్టాలెక్కదు… నిజానికి దిల్ రాజు కెపాసిటీకి వేణుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకుంటే చాలు… అలా చేస్తే తను దిల్ రాజు ఎలా అవుతాడు..? అందుకే ఎల్లమ్మ ఎంతకీ రానంటోంది..!!
Share this Article