.
డిజిటల్ ప్రపంచం నడుస్తోంది డేటా సెంటర్లపై… ప్రతి మెసేజ్, వీడియో, సర్వర్‌కి వెనుక ఉన్న శక్తి అదే… అయితే ఈ డిజిటల్ గుండె కొట్టుకోవాలంటే — విద్యుత్, నీరు, భూమి అనే మూడు ప్రధాన వనరులు కావాలి…
ఇవి ఎక్కడినుండి వస్తాయనే దానిపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ…
విశాఖలో లక్షన్నర కోట్ల భారీ డేటా సెంటర్… లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ఉపాధి… అనేక ఇతర కంపెనీలకూ తోడ్పాటు…. వంటి ప్రచారాలు ఊదరగొడుతున్నారు… అంతగా ఉపాధికి పెద్ద చాన్సేమీ లేదు గానీ… అసలు ప్రపంచం డేటా సెంటర్లకు సంబంధించి ఏం పాఠాలు చెబుతున్నదో ముందు తెలుసుకోవాలి… తద్వారా భారత, ఏపీ ప్రభుత్వాలు ఏం చేయాలో… ప్రజావ్యతిరేకత రాకుండా ఏ జాగ్రత్తలు అవసరమో తెలుస్తుంది…
Ads
ప్రపంచం చెప్పిన హెచ్చరికలు
ఐర్లాండ్ ఉదాహరణ: గూగుల్ అక్కడ పెద్ద డేటా సెంటర్ నిర్మించాలని ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది — “మీ ఒక్క సెంటర్‌కి ఇంత పవర్ ఇస్తే, మా దేశ ప్రజలందరికీ కొరత వస్తుంది…” దాంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది…
నెదర్లాండ్స్ ఉదాహరణ: మెటా (ఫేస్‌బుక్) భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పెట్టాలని అనుకుంది… కానీ ప్రజలే వ్యతిరేకించారు — “మాకు గ్రీన్ ఎనర్జీ కావాలి, ఈ సెంటర్ కాదు.” ఫలితం? ప్రభుత్వం అప్లికేషన్ తిరస్కరించింది… తరువాత నేరుగా చట్టం చేసింది — “ఇకపై దేశంలో పెద్ద స్థాయి డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వము…”
అమెరికాలోని వర్జీనియా: “డేటా సెంటర్ల కాపిటల్” అని పిలిచే ఈ ప్రాంతంలో ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోంది… అక్కడి ప్రజలు చెబుతున్నారు — “మేము డిజిటల్ హబ్‌గా మారినా, విద్యుత్ బిల్లులు పెరిగాయి, గ్రీన్ కవరేజీ తగ్గింది…”
విశాఖలో గూగుల్ అడుగులు
- విశాఖపట్నం — గూగుల్ కొత్త డేటా సెంటర్ కోసం ఎంపిక చేసిన ప్రాంతంగా వార్తల్లోకి వచ్చింది… నగరం తీరప్రాంతంలో ఉంది, లాజిస్టికల్ కనెక్టివిటీ ఉంది, ఫైబర్ నెట్‌వర్క్ పుష్కలంగా ఉంది… ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను ఆహ్వానించడం సహజమే… కానీ ప్రపంచం నేర్పిన పాఠాలు మనం కూడా గుర్తుంచుకోవాలి…
వ్యతిరేకత అవసరం లేని సందర్భాలు
సమతుల ప్రణాళిక ఉంటే…. విద్యుత్, నీరు, భూమి వినియోగం ముందే అంచనా వేసి, నగర అభివృద్ధి ప్లాన్‌లో కలిపి చేస్తే… APIIC లేదా రాష్ట్ర IT శాఖతో సమన్వయం ఉంటే, ఇది స్థానిక అవసరాలకూ ఉపయోగపడుతుంది…
పునరుత్పత్తి శక్తి (Green Power) ఆధారంగా ఉంటే… గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే “carbon-neutral data centers” వైపు వెళ్తున్నాయి… విశాఖ సెంటర్ కూడా విండ్ లేదా సోలార్ ఎనర్జీపై ఆధారపడాలి… లేదా సరిపడా పవర్ జనరేషన్ సొంతంగా చేసుకోవాలి…
నీటి రీసైక్లింగ్, ఎయిర్ కూలింగ్ టెక్నాలజీలు వాడితే… పాత సిస్టమ్స్‌లో నీటి వినియోగం ఎక్కువగా ఉండేది… కానీ ఆధునిక సెంటర్లు “air-cooled” లేదా “liquid loop” టెక్నాలజీ వాడి నీటి వినియోగాన్ని తగ్గిస్తున్నాయి…. విశాఖ డేటా సెంటర్‌కూ అది తప్పనిసరి చేయాలి… సముద్రపు నీటిని తన అవసరానికి అనుకూలంగా ఫిల్టర్ చేసుకునే ప్లాంట్ సొంతంగా పెట్టుకోవాలి…
సరైన స్థల ఎంపిక ఉంటే…. తీరప్రాంతం ఎకోసిస్టమ్‌కు హాని చేయకుండా, ఇప్పటికే ఉన్న ఇండస్ట్రియల్ జోన్‌లో సెంటర్ వేస్తే — పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు… విశాఖలో పరమానందపురం IT పార్క్ లేదా గాజువాక ఎట్సెట్రా ఇందుకు తగినవే అంటారు మరి…
వ్యతిరేకత వచ్చే ప్రమాదాలు
-
డేటా సెంటర్ కోసం విద్యుత్ కేటాయింపులు పబ్లిక్ అవసరాలను తగ్గిస్తే…
-
ఎకోసెన్సిటివ్, తీరప్రాంత రక్షిత ప్రాంతాల్లో నిర్మాణం చేస్తే…
-
పర్యావరణ అనుమతులు లేకుండా లేదా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మాణం మొదలుపెడితే…
-
స్థానిక నీటి వనరులు పరిమితమైనప్పటికీ, పెద్ద స్థాయిలో వినియోగిస్తే…
గూగుల్ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు
1️⃣ స్పష్టమైన పారదర్శక పర్యావరణ నివేదిక – వినియోగం, ఉద్గారాలు, పునరుత్పత్తి ప్రణాళిక…
2️⃣ స్థానిక సమాజ భాగస్వామ్యం – పాఠశాలలు, కాలేజీలు, స్థానిక వ్యాపారాలకి స్కిల్, జాబ్ లింకేజ్ ప్రోగ్రామ్స్…
3️⃣ గ్రీన్ ఎనర్జీ ఒప్పందాలు – రాష్ట్ర విద్యుత్ బోర్డుతో పునరుత్పత్తి శక్తి సరఫరా కాంట్రాక్టులు…
4️⃣ నీటి రీసైక్లింగ్ ప్లాంట్ – సముద్రజలాన్ని ట్రీట్ చేసి వినియోగించే విధానం…
ముగింపు...
ప్రపంచం ఇప్పటికే డేటా సెంటర్ల ప్రభావం గురించి ఆలోచించింది…
కొన్ని దేశాలు ఆంక్షలు పెట్టాయి, కొన్ని నిబంధనలు కఠినం చేశాయి…
విశాఖ ఇప్పుడు అదే దారిలో — కానీ తెలివిగా — ముందడుగు వేయాలి…
వ్యతిరేకత కాదు, వివేకం కావాలి… గూగుల్ డేటా సెంటర్ వంటివి వస్తే — వనరులను కాపాడుతూ, సాంకేతిక శక్తిని ఉపయోగించే “సమతుల నమూనా”గా నిలవాలి… ఊకదంపుడు ప్రచారాలు కాదు..!!
Share this Article