.
మిత్రమండలి… దీనిపై కాస్త ఆసక్తి కలగడానికి కారణం ప్రియదర్శి… తన కామెడీ టైమింగ్ బాగుంటుంది… వెన్నెల కిషోర్… ప్రతి సినిమాలోనూ ఉంటాడు, తనకు చేతనైనంత పర్‌ఫామెన్స్ ఇస్తాడు… ప్లస్ ఎన్ఎం నీహారిక…
ఈమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రసిద్ధి… ఎనర్జీ, ఈజ్, బడబడా ఇంగ్లిషు, మంచి టైమింగ్ ఉంటాయి ఆమె వీడియోల్లో… తెలుగు మూలాలుండి, చెన్నైలో పుట్టి, బెంగుళూరులో పెరిగిన అమ్మాయి… సినిమా ప్రమోషన్లలో దీన్ని మరో మ్యాడ్, మరో జాతిరత్నాలు అని చెప్పుకున్నారు…
Ads
అంటే ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ అని… మరి సినిమా ఎలా ఉంది…
సినిమా కథ తుట్టెకుల నారాయణ (VTV గణేష్) అనే కుల పిచ్చి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది… అతను తన కులాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగిస్తాడు, మరియు నాయకుడిగా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు…
విధివశాత్తూ, అతని కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్.ఎం.) ఖాళీగా ఉంటూ తన స్నేహితులతో బలాదూర్‌గా తిరిగే యువకుడు చైతన్య (ప్రియదర్శి) ను ప్రేమిస్తుంది… ఈ స్నేహితుల బృందాన్ని మిత్ర మండలి అని పిలుస్తారు…
చైతు, స్వేచ్ఛ ప్రేమకథ ఎలా ముగిసింది? వారి ప్రేమ కారణంగా తలెత్తే గందరగోళం మధ్య మిత్ర మండలికి ఏమి జరిగింది? అనేదే ఈ సినిమా యొక్క ప్రధాన కథాంశం…
ప్రియదర్శి ఈ పాత్రకు అతను సరిగ్గా సరిపోయాడు… గతంలో కూడా ఇలాంటి పాత్రలు చేసాడు కాబట్టి, అతని నటనలో పెద్దగా ఆశ్చర్యం లేదు… అతను చేయగలిగింది చేసాడు… సినిమాకు కాస్తో కూస్తో ఆకర్షణ తనే… కానీ సినిమా తీసికట్టుగా ఉన్నప్పుడు తనైనా ఏం చేయగలడు ఫాఫం…
నిహారిక ఎన్.ఎం పాత్ర కేరక్టరైజేషన్ సరిగ్గా లేదు, ఆమెను సరిగ్గా వాడుకోలేదు… పైగా ఆమె డైలాగ్స్ ఓ చికాకు… అన్నింటికీ మించి ప్రియదర్శితో కెమిస్ట్రీ నప్పలేదు… వెరసి ఆమెకు ఈ సినిమాతో ప్రయోజనం సున్నా… సినిమాకు ఆమె ప్రయోజనం మరో గుండుసున్నా…
మిగతా వాళ్లలో వెన్నెల కిషోర్, సత్య ముఖ్యులు… వీరి పాత్రలు కాస్త బెటర్… VTV గణేష్‌ది మరో ముఖ్యపాత్ర… వోకే వోకే… కొన్నిచోట్ల మాత్రం కాస్త అతి… విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన తొలి సినిమా కావచ్చు… ఫన్ ఓరియెంటెడ్ కథాకథనాలే ఐనా… అస్సలు నవ్వించలేకపోయాడు…
సినిమా ప్రారంభంలోనే ఇది కేవలం నవ్వుల కోసం, మీమ్ జనరేషన్ కోసం ఉద్దేశించినదని డిస్‌క్లెయిమర్ ఉంటుంది… అంతేకాక, “ఈ కథ లేని కథ” అనే సంభాషణ ద్వారా కథ లేదని పరోక్షంగా చెబుతారు… కొన్ని వన్-లైనర్లు, వెన్నెల కిషోర్ పరిచయం, లేదా ఫోన్ నంబర్ సన్నివేశం వంటి కొన్ని భాగాలలో మాత్రమే నవ్వు వస్తుంది… కానీ ప్రేమ ట్రాక్ అసలు పండలేదు….
గుడ్ పాయింట్ ఏమిటంటే… సినిమా తక్కువ నిడివి…! తరచూ యూట్యూబ్ వీడియోల్లో కనిపించే షార్ట్ ఫన్ ఫిలిమ్‌ను కాస్త ఫీచర్ ఫిలిమ్‌గా సాగదీస్తే దాని పేరు… మిత్రమండలి..! ప్రియదర్శీ… సినిమా నచ్చలేదు భాయ్..!! ఫాఫం నిహారిక.. బెటర్ లక్ నెక్స్ట్ మూవీ..!! (యూఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా...)
Share this Article