.
( రమణ కొంటికర్ల
) …. ఆమె ఒకనాడు ఐశ్వర్యారాయ్ అందానికే సవాల్ విసురుతూ మిస్ ఇండియా పోటీల్లో నిల్చింది. కానీ, బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్స్ అందుకునే సమయంలో… ఆ అద్దాల మేడలు వదిలి, హిమాలయ పర్వతాల బాట పట్టింది. నాడో నటి.. నేడో సన్యాసి., ఎవరామె..?
మెరుపులు, వలపులు, తళుకులు.. అంతకుమించిన అభిమానగణాలు… ఒక్కసారి అడుగు పెట్టాక ఎవరు మాత్రం బాలీవుడ్ వంటి ఇండస్ట్రీని కాదనుకుంటారు. అయితే అలాంటి పైపై మెరుపులను కూడా కాదనుకుని తానెవ్వరో తెలుసుకోవాలనే జీవితసత్యం కోసం అన్వేషించేవారూ అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే బర్ఖా మదన్.
Ads
ఆ ఆకర్షణీయమైన రంగురంగుల జీవనవిధానం తృణప్రాయంగా వదిలేసి ఆ అమ్మడు.. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్నెంచుకుంది. ఒకనాడు రెడ్ కార్పెట్ మీద నడిచిన నటి కాస్తా.. ఇప్పుడు నిశ్శబ్ద జీవితాన్ని గడుపుతూ జీవితాన్వేషణకై హిమాలయాల్లో బతుకుతోంది. చెప్పుకోవడానికి చాలా సులభమే కావచ్చుగానీ.. బర్ఖా మదన్ లాగా మారిపోవడం మాత్రం ముమ్మాటికీ అంత సులభం కాకపోవచ్చునేమో.
బాలీవుడ్ లో బర్ఖా మదన్ ప్రయాణమెలా ప్రారంభమైంది..?
ఒకప్పుడు సుస్మితాసేన్, ఐశ్వర్యారాయ్ వంటి అందగత్తెలతో పాటు.. మిస్ ఇండియా వేదికల్లో మెరిసింది బర్ఖా మదన్. ర్యాంప్ వాక్ చేసిన ఆ కాళ్లే ఇప్పుడు హిమాలయ సానువుల బాట పట్టాయి. ఆమె సన్యాసినిగానే కాదు.. నటిగా జీవితాన్ని ప్రారంభించిన్నాట్నుంచే ఆమెది అసాధారణమైన జీవన ప్రయాణం.
1994లో ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మిస్ టూరిజం ఇండియా టైటిల్ ను సొంతం చేసుకుంది. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీల్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె అప్పుడప్పుడే తెరపైకొస్తున్న ఓ ఆశావహ మాడల్. అంతకుమించి ఆత్మవిశ్వాసానికి కేరాఫ్.
బర్ఖా చేసిన సినిమాలు!
ర్యాంప్ వాక్ నుంచి అడ్వర్టైజింగ్ రంగం మీదుగా బర్ఖా మదన్ ప్రయాణం బాలీవుడ్ వైపు సాగింది. 1996లో సూపర్ హిట్ చిత్రం ఖిలాడియోంకా ఖిలాడీ సినిమాలో అక్షయ్ కుమార్, రేఖ, రవీనాటాండన్ తో కలిసి నటించింది. 2003లో రామ్ గోపాల్ వర్మ భూత్ అనే హర్రర్ సినిమాలో మంజీత్ అనే పాత్రతో ఆమె ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించింది.
టెలివిజన్ ప్రపంచంలోనూ మెరిసిన బర్ఖా.. న్యాయ్, 1857 క్రాంతి, సాత్ ఫేరే, వంటి ప్రసిద్ధ షోలల్లో నటించింది. 1857 క్రాంతి లో రాణీ లక్ష్మీభాయి పాత్రను పోషించింది బర్ఖా. అలా కెరీర్ ఎదుగుతున్న దశలో ఆమె మనసు ఎందుకో మారింది. ఆధ్యాత్మిక ప్రపంచంవైపు మళ్లింది.
బర్ఖా మార్గాన్ని మార్చిన అంతర్గత ఆలోచనలు!
అయితే, ఓవైపు బాలీవుడ్, మరోవైపు చిన్నితెరపైన విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే.. ఆమెలో మరోవైపు మనశ్శాంతి కరువైనట్టుగా కనిపించేంది. ఆ అశాంతే కారణమేమో బహుశా.. జీవితమంటే ఇంతేనా అనుకుంది. అదే ప్రశ్న పదే పదే ఎదురైన బర్ఖా… నక్షత్రాల హోటళ్లలో జీవిస్తున్నా ఎందుకో ఒంటరిగా ఫీలయ్యేదట.
కీర్తి, డబ్బు ఏవీ పూరించలేని శూన్యతేదో బర్ఖాను ఆవహించింది. అలాంటి సమయంలో బర్ఖా తన అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంది. అప్పటికే ఆధ్యాత్మిక మార్గంవైపు అడుగులేస్తూ దలైలామా బోధనలకు ప్రభావితమైన బర్ఖా.. క్రమంగా ఆధ్యాత్మిక పుస్తకాల్లో మునిగిపోయింది.
అలా ఆ చదువు, దలైలామా వంటివారి అనుగ్రహభాషణం వంటివాటితో.. అప్పటివరకూ తననుభవించిన రంగుల ప్రపంచానికి భిన్నమైన పరివర్తన చెందింది బర్ఖా.
సన్యాసి కావాలని నిర్ణయించుకున్నప్పుడు ఎదురైన సవాళ్లేంటి..?
2012లో బర్ఖా అప్పటివరకూ తను సాధించిన కలల ప్రపంచాన్ని వీడి బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంది. తన స్టార్ లైఫ్ ను, అప్పటివరకూ సాధించిన గుర్తింపును బట్టలు మార్చేసినంత సులువుగా వదిలేసి… ఆమె గ్యాల్టెన్ సామ్టెన్ అనే కొత్త పేరుతో డివోషనల్ ప్రపంచం తెరపైకొచ్చింది. అది పేరు మార్పే కాదు.. మొత్తంగా ఆమె జీవితమే మార్పు దిశగా పడిన అడుగు.
ఇప్పుడు బర్ఖా మదన్ హిమాలయ లోయల్లో చాలా ప్రశాంతంగా జీవిస్తోంది. గతంలోలా ఇప్పుడామెకు స్క్రిప్ట్స్ లేవు, కెమెరా ముందు యాక్షన్ అని చెప్పేవారు లేరు, సంభాషణలు చెప్పాల్సిన పన్లేదు, చుట్టూ సహనటులు లేరు, అభిమానులు లేరు.. ఇప్పుడున్నదంతా ధ్యానం, సేవ, తనను తాను తెలుసుకోవడం మాత్రమే.
ఇప్పుడు బర్ఖా దృష్టిలో అందానికి కొత్త నిర్వచనమేంటి..?
ఒకనాడు ర్యాంపుపై ఒక వెలుగు వెలిగి.. వెండితెరపై మెరుపులు మెరిపించిన స్త్రీ ఇప్పుడు బౌద్ధ సంప్రదాయంలో జీవిస్తోంది. నాటి బర్ఖా మదన్ ఇప్పుడు గ్యాల్ట్ సెన్ సామ్టెన్ గా సరళమైన జీవితాన్ని గడుపుతోంది.
ఒకప్పటి మేకప్, రంగురంగుల దుస్తులు, కావల్సినంత అనుభవించేందుకు అందుబాటులో ఉండే విలాసాలకు, ఆకర్షణీయమైన జీవనవిధానానికి భిన్నంగా.. బౌద్ధ దుస్తుల్లో కనిపిస్తోంది. అయితే, నాడు యాక్ట్రెస్ గా పనిచేస్తున్న రోజుల కంటే కూడా.. గ్యాల్ట్ సెన్ సామ్టెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా ప్రో యాక్టివ్ గా కనిపిస్తుంది.
అయితే, ఆమె బౌద్ధమతంపై అవగాహన కల్పించడం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తోంది. పలుమార్లు దలైలామాను కూడా కలిసిన నాటి బర్ఖా మదన్.. నేటి గ్యాల్ట్ సెన్ సామ్టెన్ జీవన విధానం అంతలోనే ఇంత మార్పుకు గురవ్వడమే ఇప్పుడామె గురించీ కాస్త చెప్పుకోవడానికి కారణం…
Share this Article