.
సూపర్ స్టార్ కృష్ణ… తన పెద్ద కొడుకు రమేష్‌ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, చేయని ప్రయోగం లేదు… కానీ అందులో మాత్రం ఫెయిల్…
చిన్న కొడుకు సూపర్ స్టార్ అయ్యాడు, అది వేరే సంగతి… కానీ ఎంతకూ క్లిక్ కాకపోవడంతో ఇక సినిమాలు మానేద్దామని రమేష్ ఓ నిర్ణయానికొచ్చేశాడు… కృష్ణ కూడా ఓ చివరి ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు…
Ads
తనే ఓ సినిమా తీస్తూ, తను కూడా నటిస్తూ… శంకర్ దర్శకత్వంలో ఓ విప్లవవాదుల కథను రమేష్‌తో ఓ ప్రధాన పాత్రగా చేయించాలని నిర్ణయించాడు… ఆ సినిమా పేరు ఎన్‌కౌంటర్…!
ఈ కథ ఎందుకు చెప్పుకోవడం అంటే… ఈమధ్య రాజకీయ కీలకనేతలు, సినిమా ప్రముఖుల బంధాలు, రాగద్వేషాలు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి కదా… కానీ ఓ దశలో రాజకీయ విభేదాలు పక్కకు పెట్టి, మరీ సినిమాల కోసం ఎలా సదవగాహనను కనబరిచేవారో చెప్పడం కోసం…
ఒకప్పుడు కృష్ణకూ ఎన్టీయార్‌కూ పడేది కాదు… ఎన్టీయార్‌కు పోటీ సినిమాలే కదాు, ఎన్టీయార్‌ను విమర్శిస్తూ కూడా కృష్ణ పొలిటికల్ సినిమాలు తీశాడు… కృష్ణ కుటుంబం తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాస్త కాంగ్రెస్ వైపు మొగ్గేది… అలాంటిది ఎన్‌కౌంటర్ సినిమా కోసం కృష్ణ తనే స్వయంగా చంద్రబాబును కలిశాడు… అదీ విశేషం…
అది తన పెద్ద కొడుకు రమేష్ బాబు కెరీర్ కోసం చివరి క్షణంలో పడిన ఆరాటం… శంకర్ చెప్పిన ఎన్‌కౌంటర్ కథ కృష్ణకు నచ్చింది… సో, అందులో ఓ కీలకపాత్రకు రమేష్ బాబు పేరును తనే సూచించాడు… దర్శకుడితో ఆయన ఏమన్నారంటే…
“రమేష్ సినిమాలు వదిలేయాలని అనుకుంటున్నాడు… ఈ ‘ఎన్‌కౌంటర్’ అతనికి లాస్ట్ మూవీ అయితే బావుంటుందని నా ఫీలింగ్… ఒకవేళ ఈ మూవీ సూపర్ హిట్ అయితే… రమేష్ మళ్లీ సినిమాలు తిరిగి ప్రారంభిస్తాడేమో… అప్పుడు ఇంకా హ్యాపీ…!”
రమేష్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోవడంతో కృష్ణలో పట్టలేని సంతోషం కనిపించిందని దర్శకుడు శంకర్ గుర్తుచేసుకున్నాడు ఏదో ఇంటర్వ్యూలో…
సీఎం వరకు వెళ్లిన ‘ఎన్‌కౌంటర్’ కథ!
ఈ సినిమా షూటింగ్ కూడా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో, ప్రధానంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో జరిగింది… వికారాబాద్, హార్సిలీ హిల్స్, భద్రాచలం వంటి నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ జరగడంతో అసలు సమస్య మొదలైంది…
1997 ప్రాంతంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండడంతో… సినిమా యూనిట్‌పై ఇంటెలిజెన్స్, పోలీసులు నిఘా పెట్టారు… నిజానికి అవసరం లేదు, కానీ పోలిసుల ఓవరాక్షన్ అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం కదా…
డ్రామా: షూటింగ్‌కి వెళ్తున్న రమేష్ కారును ఒకసారి పోలీసులు ఆపేశారు… నటీనటుల వివరాలు ప్రతిరోజూ డీజీపీ టేబుల్‌పైకి వెళ్లేవి… ఈ పరిణామాలు తెలుసుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఎంతో ఆవేదనకు గురయ్యాడు… కొడుకు సినిమా సవ్యంగా పూర్తయ్యేలా చూడాలని… నేరుగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశాడు..!
చంద్రబాబు భరోసా!
కృష్ణ తమ సినిమా షూటింగ్‌పై ఇంటెలిజెన్స్ నిఘా, పోలీసుల ఆటంకాల గురించి చంద్రబాబుకు వివరించాడు… దానికి చంద్రబాబు స్పందిస్తూ… “అదేం పర్వాలేదు సర్… మీరు హ్యాపీగా షూటింగ్ చేసుకోండి… అధికారులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు… మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా నేను వాళ్లకు చెబుతాను…” అని కృష్ణకు భరోసా ఇచ్చాడు…
సీఎం ఇచ్చిన హామీతో ‘ఎన్‌కౌంటర్’ షూటింగ్ తరువాత ఏ ఆటంకాలూ లేకుండా పూర్తయింది… 1997లో విడుదలైన ఈ చిత్రం… రమేష్ కెరీర్‌కు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేకపోయింది… కృష్ణ పడ్డ ఆఖరి ప్రయత్నం కూడా ఫలితం ఇవ్వకపోవడంతో, రమేష్ ఆ తర్వాత మళ్లీ నటించలేదు…
Share this Article