.
దర్శకుడు మారి సెల్వరాజ్ సినిమాలు ఎప్పుడూ కుల రాజకీయాలు, సామాజిక న్యాయం. వివక్ష, అణగారిన వర్గాల బాధలను చాలా పదునుగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించడానికి ప్రసిద్ధి…
ఆయన ప్రతి సినిమాలో ఒక సామాజిక ఇతివృత్తం, నిప్పులాంటి భావోద్వేగం ఖచ్చితంగా ఉంటాయి… ‘బైసన్’ సినిమా కూడా అలాంటిదే… ఇది అర్జున అవార్డు గ్రహీత, కబడ్డీ ఆటగాడు మణతి గణేశన్ జీవితం నుంచి ప్రేరణ పొంది, అణగారిన వర్గానికి చెందిన కిట్టయ్య (ధ్రువ్ విక్రమ్) అనే యువ కబడ్డీ ప్లేయర్ కథ…
Ads
కిట్టయ్యకు కబడ్డీ అంటే ప్రాణం. ఇండియా జట్టులో ఆడాలనేది అతని కల. కానీ, అతడు పుట్టిన సామాజిక నేపథ్యం, కుల వైరుధ్యాలు, రాజకీయ కక్షలు అతని కలను నెరవేరనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి… కులం ప్రభావం చూపని రంగమేముంది మన సమాజంలో..?!
కబడ్డీ కోర్టులో మాత్రమే కాదు, తన ఊరిలో, ఇంట్లో కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి… తన తండ్రి (పశుపతి) వ్యతిరేకత, అగ్రకుల నాయకుడి ప్రోత్సాహం, తన వర్గానికే చెందిన నాయకుడి పగ… వీటన్నిటి మధ్య కిట్టయ్య ఎలా నెగ్గుకొచ్చాడు? కబడ్డీ బైసన్‌గా అతనెలా మారాడు? అనేది సినిమా కథాంశం…
మెప్పించిన అంశాలు (Plus Points)…
ధ్రువ్ విక్రమ్…: కిట్టయ్య పాత్రలో ధ్రువ్ విక్రమ్ అద్భుతంగా ఒదిగిపోయాడు… కబడ్డీ ఆటగాడికి కావాల్సిన శారీరక రూపాంతరం (Physical Transformation), బాడీ లాంగ్వేజ్ మెస్మరైజ్ చేస్తాయి… ముఖ్యంగా, మాటల్లో చెప్పలేని ఆవేశం, బాధను కళ్ళల్లో చూపించడంలో ధ్రువ్ నటన ప్రశంసనీయం… (తండ్రి విక్రమ్‌కు తగిన కొడుకే)… (ధ్రువ్ పాటల రచయిత, గాయకుడు కూడా… ఈ సినిమాకు కాదు)…
పశుపతి నటన…: కిట్టయ్య తండ్రి పాత్రలో పశుపతి నటన సినిమాకు ఆత్మ (Soul) లాంటిది… కొడుకును కబడ్డీకి దూరంగా ఉంచాలని తపన పడే తండ్రి పాత్రలో ఆయన హావభావాలు హృదయాన్ని కదిలిస్తాయి… ధ్రువ్- పశుపతి మధ్య బంధం సినిమాకు బలమైన ఎమోషనల్ కోర్…
మారి సెల్వరాజ్ మార్క్: దర్శకుడి ముద్ర ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది… సామాజిక అసమానతలను, అణచివేతను కబడ్డీ ఆట ద్వారా ఒక రూపకంగా (Metaphor) చూపించిన తీరు ఆసక్తికరం… ఫస్ట్ హాఫ్ చాలా ఇంటెన్స్గా, గ్రిప్పింగ్‌గా ఉంటుంది…
సాంకేతిక విలువలు…: 90వ దశకం నాటి గ్రామీణ వాతావరణాన్ని ఎజిల్ అరసు K సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రస్టిక్‌గా చూపించింది… నివాస్ K. ప్రసన్న నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను ఎలివేట్ చేసింది…
నిరాశపరిచిన అంశాలు (Minus Points)…
నిడివి (Length): సినిమా రన్‌టైమ్ దాదాపు మూడు గంటలు ఉండటం వల్ల కొన్ని చోట్ల కథనం సాగదీసినట్టు అనిపిస్తుంది… ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు పునరావృతమైనట్లుగా అనిపిస్తాయి…
కథనంపై దృష్టి తగ్గడం: కబడ్డీ స్పోర్ట్స్ డ్రామాగా మొదలైనా, కబడ్డీ ఆట కంటే సామాజిక రాజకీయాలపై దృష్టి ఎక్కువగా ఉండటం వలన స్పోర్ట్స్ డ్రామా ఫీల్ కొంత తగ్గిపోయింది…
తెలుగు డబ్బింగ్: తెలుగు డబ్బింగ్‌లో స్థానికత (Localization) లోపించింది… తమిళ సైన్ బోర్డులు, పేపర్లు అలాగే చూపించడం, కొన్ని డైలాగ్‌లు సరిగా అనువదించకపోవడం ప్రేక్షకుడికి అసౌకర్యం కలిగిస్తుంది… (తెలుగులోకి డబ్ చేసే తమిళ సినిమాలన్నింటిలోనూ ఇదే నిర్లక్ష్యం)
పాత్రల పరిచయం: కొన్ని కీలక పాత్రలను సెకండాఫ్‌లో హడావిడిగా పరిచయం చేయడం వల్ల వారి ఎమోషన్ ప్రేక్షకుడికి పూర్తిస్థాయిలో కనెక్ట్ అవ్వదు… కథానాయిక అనుపమ పరమేశ్వరన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు… పాటల్ని దర్శకుడే రాసుకున్నాడు… కానీ అవి తెలుగులో పెద్ద ఇంప్రెసివ్ ఏమీ కావు…
ముగింపు… ‘బైసన్’ కేవలం ఒక స్పోర్ట్స్ సినిమా మాత్రమే కాదు, సామాజిక వివక్షపై ధ్రువ్ విక్రమ్ చేసిన ఒక భావోద్వేగ పోరాటం… మారి సెల్వరాజ్ తనదైన శైలిలో కొన్ని బలమైన అంశాలను, పదునైన సన్నివేశాలను తెరకెక్కించడంలో విజయం సాధించాడు… ధ్రువ్, పశుపతి నటన కోసం, సామాజిక ఇతివృత్తాన్ని ఇష్టపడేవారు ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామాను థియేటర్లో ఒక్కసారి చూడవచ్చు…
Share this Article