Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి స్వయంకృషి… తనలోని నటుడికి విశ్వనాథుడి పట్టాభిషేకం…

October 25, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ….. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూత్రాన్ని తన జీవితంలోనే , జీవితంతోనే నిరూపించిన చిరంజీవి కీర్తి కిరీటంలో కలికితురాయి ఈ స్వయంకృషి సినిమా .

ఫైట్లు , డాన్సులు మాత్రమే కాదు సాంబయ్య లాంటి ఉదాత్త పాత్రలను కూడా జనరంజకంగా పోషించగలనని చిరంజీవి చాటిచెప్పిన చిత్రం . చిరంజీవిని ఇలాంటి ఉదాత్త పాత్రల్లో ప్రేక్షకులు ఆదరించరని చాలామంది అంటూ ఉంటారు . ఆ అభిప్రాయానికి అడ్డుకట్టే స్వయంకృషి , ఆపద్భాందవుడు వంటి సినిమాలు .

26 కేంద్రాలలో వంద రోజులు ఆడటమే కాకుండా 1987 మాస్కో ఫిలిం ఫెస్టివల్లో , ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . చిరంజీవికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు , ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డులు వచ్చాయి .

Ads

ఈ సినిమాలో అద్భుతంగా నటించిన మరో వ్యక్తి విజయశాంతి . అట్టా సూడమాకయ్యా అంటూ వయ్యారాలు ఒలికిస్తూ , తాను ప్రేమించిన వ్యక్తి నమ్మకాన్ని పొందేందుకు పెళ్ళికి ముందే ట్యూబెక్టమీ చేయించుకునే పాత్రలో ఒదిగి , డి-గ్లామరస్ మేకప్పులో గ్లామర్ని కురిపించిన నటి విజయశాంతి . చిరంజీవితో పోటాపోటీగా నటించిన విజయశాంతికి ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డు వరించింది .

అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత మహదేవ . ఎన్ని సందేశాలు ఉన్నాయో ఈ సినిమాలో ! ఒకటి కృషితో నాస్తి దుర్భిక్షం . కష్టపడి శ్రమించేవాడికి కరువు ఉండదు , రాదు . రెండు ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరచిపోకూడదు .

రోడ్ పక్కన చెట్టు కింద చెప్పులు కుట్టుకునే సాంబయ్య స్వయంకృషితో పెద్ద చెప్పుల షాప్ అధినేత అయినా తన మూలలను మరచిపోకుండా ఉండేందుకు తన గుడిలో ఆ పనిముట్లని దేవుళ్ళలాగా పూజించటం . నడమంత్రపు గాళ్ళందరూ తెలుసుకోవలసిన సందేశం .

ఇలా ఎన్నో సందేశాల మణిహారం కళాతపస్వి విశ్వనాధ్ దర్శకత్వంలో , పూర్ణోదయ క్రియేషన్స్ బేనర్లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా వచ్చిన ఈ సందేశాత్మక చిత్రం స్వయంకృషి . ఇలాంటి శాకాహార సినిమాలు తీయాలంటే చాలా రిస్కుతో కూడుకుని ఉంటుంది . విశ్వనాధుడిని నమ్మి ప్రేక్షకులు పది కాలాలు గుర్తుంచుకునే సినిమాలను తీసిన ఏడిద నాగేశ్వరరావు గారిని తప్పక అభినందించవలసిందే .

ఈ సినిమాకు మరో విశేషం రమేష్ నాయుడి సంగీత దర్శకత్వం . విశ్వనాధ్ చాలా సినిమాలకు సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ కాకుండా రమేష్ నాయుడిని ఎందుకు పికప్ చేసారో తెలియదు . అయితే ఏం ! అత్యంత శ్రావ్యమైన పాటల్ని అందించారు . సి నారాయణరెడ్డి , సిరివెన్నెల శాస్త్రి కలాల నుండి జారిన చక్కని సాహిత్యానికి న్యాయం చేసారు బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజమ్మ .

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి , సిన్ని సిన్ని కోరికలడగ శీనినాసుడు నన్నడగ పాటలు ఎంత అందంగా , శ్రావ్యంగా ఉంటాయో ! పారాహుషార్ పాటలో చిరంజీవి నటన బ్రహ్మాండం . స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ గుర్తుకొస్తాడు . ఇద్దరు ఇద్దరే అనుకోండి . మరో డ్యూయెట్ హల్లో హల్లో డార్లింగ్ చిరంజీవి , విజయశాంతి మీద హుషారుగా ఉంటుంది .

ఇంకో రెండు పాటల గురించి వివరంగా చెప్పుకోవాలి . ఒకటి చిరంజీవి ఊహల్లో తాను మౌనంగా గాఢంగా ప్రేమించే సుమలతతో నృత్య గీతం . కాముడు కాముడు అంటూ సాగుతుంది . సుమలతను ఇంత అందంగా మరెవరూ ఏ పాట లోనూ చూపలేదేమో ! ఈ పాటలో విశ్వనాధుడిని వసంతుడు బాగా గోకినట్లుగా ఉంది . ప్రేయసిల రెవికలను కళ్ళకు గంతలు కట్టుకుని గుర్తించటం . కళాతపస్వికి ఇదెందుకు గుర్తుకు తెచ్చాడో తాపీ ధర్మారావు . అద్భుతః ఆలోచన .

మరొకటి క్షేత్రయ్య పదాలలో ఒకటయిన మంచి వెన్నెల ఇపుడు మగువ మనసు . మువ్వ గోపాల పదాలలో ఒకటయిన ఈ పదాన్ని ఒక నాట్యగత్తె మీద నెగటివ్ సీన్లో రక్తి కట్టించాలనే ఆలోచన విశ్వనాధుడికి ఎలా వచ్చిందో ! అందుకే చిరస్మరణీయుడు అయ్యాడు .

ఈ కల్ట్ క్లాసిక్ సినిమాలో మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన వారిలో చెప్పుకోవలసింది చరణ్ రాజ్ , మాస్టర్ అర్జున్ , యం వి యస్ హరనాధరావుల గురించి . ఎవరికి వారు గొప్పగా నటించారు . ఇంకా జె వి సోమయాజులు , బ్రహ్మానందం , పి జె శర్మ ప్రభృతులు నటించారు .

నర్తనశాల సినిమాలో బృహన్నల పాత్ర కొరకు యన్టీఆర్ తెల్లవారుజామున వెంపటి వారి వద్ద శాస్త్రీయ నృత్యం ప్రాక్టీస్ చేసారని విన్నాం . అలాగే ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టడం , రెండు పాదాల మధ్య చెప్పుని బిగించటం వంటివి నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చిరంజీవే చెప్పారు . కాబట్టే చిరంజీవి అయ్యాడు .

డైలాగులను వ్రాసిన సాయినాధ్ , డాన్సులను కంపోజ్ చేసిన శేషు , రఘు , తారలను పేరుపేరున అందరినీ మెచ్చుకోవలసిందే . ఈ చక్కటి సినిమా హిందీ లోకి ధర్మ యుధ్ధ్ అనే టైటిలుతో డబ్ చేయబడింది . కీర్తి , కనకం అన్నీ వచ్చాయి ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి వారికీ .

సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . నాకు చాలా ఇష్టమైన ఈ సినిమాను టివిలో వచ్చినప్పుడల్లా కాసేపయినా చూస్తుంటా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…
  • అసలే వాడు ట్రంపులమారి… మన రోతను అక్కడా వ్యాప్తి చేయకండి…
  • ఐదుగురు సీఎంలకు పట్టని ఓ మానవతాసాయం… రేవంత్ నెరవేర్చాడు..!!
  • భేష్ కేరళ సర్కార్..! పిచ్చి ఉచిత పథకాలు కాదు… ఇదీ నిజమైన తోడ్పాటు..!!
  • చిరంజీవి స్వయంకృషి… తనలోని నటుడికి విశ్వనాథుడి పట్టాభిషేకం…
  • బైసన్..! కబడ్డీ ఆట నేపథ్యంలో కుల వివక్షపై దర్శకుడి అస్త్రం…
  • ఇటు ఇండియా దెబ్బ..! అటు అఫ్ఘాన్ దెబ్బ..! పాకిస్థాన్‌ పెడబొబ్బ..!!
  • యాడ్ గురు… మన వాణిజ్య ప్రకటనల రంగంలో ఒక శకం సమాప్తం…
  • అదొక సెన్సేషనల్ వార్త… కానీ ధ్రువీకరణ ఎలా..? ఉత్కంఠ రేపే కథనం..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions