.
Subramanyam Dogiparthi ……. 1987వ సంవత్సరం రాజేంద్రప్రసాద్ కెరీరుకు అచ్చొచ్చిన సంవత్సరం . సెకండ్ హీరో స్థాయి నుండి ఫస్ట్ హీరో స్థాయికి , ఆ తర్వాత సోలో హీరో స్థాయికి ఎదిగిన సంవత్సరం . లేడీస్ టైలర్ వంటి హిట్ సినిమాలు అతన్ని మెయిన్ ట్రాక్కులో పడేసాయి .
1987 సెప్టెంబరులో వచ్చిన ఈ మదనగోపాలుడు ఎబౌ ఏవరేజ్ పిక్చరుగా నమోదయి అతనికి మంచి పేరే తెచ్చింది . బుధ్ధిమంతుడు సినిమాలో గోపాలాచార్యులు పాత్రలో నాగేశ్వరరావు లాగానే పట్నంలో చదువు పేరుతో సకల కళా వల్లభుడుగా , కోతలరాయుడుగా విరాజిల్లుతూ ఉంటాడు రాజేంద్రప్రసాద్ .
Ads
మందు , పొందే తన జీవితాశయం అని మిత్రులకు ఉద్భోదిస్తూ ఉంటాడు కూడా . తండ్రి గ్రామంలో పూజారిగా నిష్టాగరిష్టుడు . కుమార రత్నం పట్నంలో రాత్రింబవళ్లు చదువుకుంటూ యూనివర్శిటీ ఫస్ట్ కోసం కృషి చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు .
తల్లి అంత్యక్రియలకు కూడా అందుబాటులో ఉండకుండా గాలికి తిరుగుతూ ఉన్న కుమార రత్నం నిజరూపం తెలుసుకొని ఇంటికి తెచ్చేసుకుంటాడు . అదృష్టవశాత్తూ అతనిలో మార్పు వచ్చి బుద్దిమంతుడు అవుతాడు . ఇంతలో అతని పూర్వాశ్రమ స్నేహితులు వచ్చి మళ్ళా పాత రొంపిలోకి లాగుతారు .
మరోసారి దారి తప్పుతాడు . తండ్రిని కోల్పోతాడు . మరోసారి భ్రష్టుడవుతాడు . వివాదాలలో ఇరుక్కుంటాడు . ఆ సమయంలో పడవ పిల్ల వెంట ఉండి దారిలోకి తెచ్చుకుంటుంది . కులాల తేడాతో గ్రామస్తులు గ్రామ బహిష్కరణ చేస్తామని చెపుతారు . అయినా ధైర్యంగా నిలబడి తన మీద వచ్చిన నిందలను తొలగించుకుని పడవ పిల్లను పెళ్లి చేసుకోవటంతో శుభం కార్డు పడుతుంది .
హీరోగా రాజేంద్రప్రసాద్ బాగా నటించాడు . జులాయిగా , బుధ్ధిమంతుడిగా బాగా నటించాడు . హీరోయిన్ పడవ పిల్లగా రమ్యకృష్ణ చాలా బాగా పరిణత కలిగిన నటిగా నటించింది . డ్యూయెట్లలో డాన్సుల్ని చాలా బాగా చేసింది . సినిమాకు హైలైటే .
ఇతర ప్రధాన పాత్రల్లో జె వి సోమయాజులు , డబ్బింగ్ జానకి , మమత , రాజ్యలక్ష్మి , బాలాజీ , గొల్లపూడి , రాధాకుమారి , పుచ్చా పూర్ణానందం , హేమసుందర్ , చాలామంది అమ్మాయిలు నటించారు . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది సుత్తి వీరభద్రరావు గురించి . తల్లీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు . ఆ నలుగురి కామెడీ ట్రాక్ బాగానే ఉంటుంది .
శివాజీ రాజా సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారి పాటలు బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , మాధవపెద్ది రమేష్ , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర , వాణీజయరాం , శైలజలు పాటల్ని పాడారు . కొండవాగై పాడినాది , వానా వచ్చింది వయసుకు వరదొచ్చింది వాన పాట డ్యూయెట్లు హాటుగా , అందంగా ఉంటాయి . రమ్యకృష్ణ బాగా డాన్సించింది . మదన గోపాలుడు మకాం పెట్టాడు మీ ఊళ్ళో అంటూ సాగే పాట రాజేంద్రప్రసాద్ , అతని గర్ల్ ఫ్రెండ్సుతో హుషారుగా ఉంటుంది .
ప్రమిదెల ఆశల సుందర రూపం కార్తీక దీపం పాటను దర్శకుడు కృష్ణమోహన్ రెడ్డి చాలా బాగా చిత్రీకరించారు . రమ్యకృష్ణ , రాజేంద్రప్రసాదుల మీద విషాద , విచార గీతం బతకటం నీకెంత కష్టమయినా చావటం నీ ఇష్టమయినా ఆయుషు ఉన్నన్నాళ్ళు చావలేవు చావాలన్నా అని ఆత్రేయ గారు అద్భుతంగా వ్రాసారు . అంతే బాగా తెరకు ఎక్కించారు దర్శకుడు .
ఔట్ డోర్ షూటింగ్ అంతా అమరావతి పుణ్యక్షేత్రం , ధరణికోట , గుంటూరు చుట్టుపక్కల చేసారు . టైటిల్సులోనే ఇదంతా ప్రత్యేకంగా చెప్పారు . తోటకూర ఆశాలత నేసిన కధకు మధు సంభాషణలను అందించారు .
ఓవరాల్ సినిమా చూడబులే . యూట్యూబులో ఉంది . రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణ అభిమానులు అయితే తప్పక చూడవచ్చు . ఇతరులకు చూడబులే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article