ఒక రతన్ టాటా పేరు గానీ… ఒక అజీం ప్రేమ్‌జీ పేరు గానీ….. ఈ ఫోర్బ్స్ జాబితాల్లో, అత్యంత ధనికుల జాబితాల్లో గానీ ఎందుకు కనిపించవు..? చాలామందికి ఓ ప్రశ్నే ఇది… వాళ్లు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ప్రజల కోసం వెచ్చిస్తూనే ఉండి, తమ జీవితాల్ని అక్షరాలా సార్థకం చేసుకుంటారు,.. విలువలతో కూడిన జీవితాలు వాళ్లవి… ఈ శుష్క డప్పుల మీద వాళ్లకు ఆసక్తి ఉండదు అని ఓ మిత్రుడు వ్యాఖ్యానించాడు…
నిజమే… ప్రత్యేకించి కరోనా అనే ఓ మహావిపత్తు చుట్టుముట్టి, తీవ్ర సంక్షోభం నుంచి ప్రయాణిస్తున్న వేళ… వాళ్ల విరాళాలు, ఔదార్యం వర్ణించలేం… ఈరోజుకూ టాటా వాళ్లు వేల టన్నుల ఆక్సిజన్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తూనే ఉన్నారు… సరే, ఆయా కంపెనీల కరోనా సాయాల గురించి సరే… వాళ్ల సొంత కంపెనీల ఉద్యోగుల గురించి ఏం చేస్తున్నయ్… ఇదీ ప్రశ్నే…
ఇతర ప్రాంతాలు, ఇతర కంపెనీల మాట అటుంచితే… తెలుగునాట అనేక కంపెనీలు మూసేశారు, ఉద్యోగుల్ని బజార్న పడేశారు, జీతాలు కత్తిరించేశారు… తెల్లారిలేస్తే లక్ష నీతులు వల్లెవేసే ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా తమ ఉద్యోగుల ఉసురుపోసుకున్నయ్… లేఆఫ్స్, జీతాల కత్తిరింపులు, కొలువుల కోతలు… అవన్నీ చూశాం, చూస్తూనే ఉన్నాం…
Ads
తమ సంస్థల్లోని ఉద్యోగులకు సరైన ఆరోగ్య బీమాను కూడా ఇవ్వలేనివి బోలెడు… కరోనా వస్తే, మరణిస్తే, ఆ కుటుంబాలకు కాస్త సాయం కూడా విదల్చని మహా దానకర్ణులు… వాళ్ల ఆదాయం కోసం చెమటను, రక్తాన్ని, బతుకును, ఆయుష్షును కూడా అర్పిస్తే అదీ ఆయా సంస్థల ఔదార్యం… హక్కుల పోరాటాలు చేసే వామపక్ష మీడియా సంస్థలు కూడా సేమ్… మరి టాటా వాళ్లు కూడా అంతేనా..? వాస్తవంగా టాటా సంస్థల్లో కొలువు దొరికితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం దొరికినట్టే అంటుంటారు… అంటే ఉద్యోగుల్ని ఓన్ చేసుకుంటారు… చీట్ చేయరు… ఇప్పుడు కూడా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నది టాటా స్టీల్…
దాదాపు 30 వేలకు పైగా ఉంటారు వాళ్ల ఉద్యోగులు… కేవలం టాటా స్టీల్‌లోనే… తాజాగా కంపెనీ ప్రకటన ఏమిటంటే..?
‘‘ఎవరైనా కరోనాతో మరణిస్తే, వాళ్లు చివరగా తీసుకున్న జీతాన్ని అలాగే ఆ కుటుంబానికి చెల్లిస్తాం… అరవై ఏళ్లకు రిటైర్‌మెంట్ కదా, మరణించిన ఉద్యోగి బతికి ఉన్నట్టుగానే పరిగణించి, 60 ఏళ్లు నిండేవరకూ జీతాలు ఇస్తాం… అంతేకాదు, సదరు ఉద్యోగి కుటుంబానికి హౌజింగ్, మెడికల్ ఫెసిలిటీస్, బెనిఫిట్స్ ఎప్పట్లాగే కొనసాగిస్తాం… ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ గనుక మరణిస్తే వాళ్ల పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు చదివించే బాధ్యత కంపెనీదే…’’
ఇదీ ఆ ప్రకటన… ఎవరో సోషల్ మీడియాలో పెడితే నమ్మబుద్ధి కాలేదు… వాళ్ల అఫిషియల్ ట్విట్టర్ ఖాతాను చెక్ చేస్తే నిజమే అని తేలింది… వావ్… ఎంత గొప్ప భరోసా… స్టీల్ లైక్ సెక్యూరిటీ… రతన్ టాటా వంటి వ్యక్తులు మళ్లీ మళ్లీ పుట్టరు… ఇప్పుడే చప్పట్లతో మొక్కాలి… మరీ అతిశయోక్తిగా ఉన్నట్టు అనిపించిందా..? ఎంతమాత్రమూ కాదు… ఇలాంటి నిర్ణయాల్లోని మానవీయ స్పర్శ (హ్యూమన్ టచ్) అందరికీ అర్థం కాకపోవచ్చు… కరోనాతో ఓ కుటుంబ పెద్దను కోల్పోయిన ప్రతి కుటుంబానికి తెలుసు… ఇదెంత గొప్ప నిర్ణయమో…!! (2021 మే 24 నాటి కథనం)
Share this Article