.
ఊరించే ఒక విజయం… కష్టపడాలి, అదృష్టం తోడవ్వాలి… నమ్మిన దేవుడూ కరుణించాలి… అదేకాదు, ఏదో ఓ ప్రేరణ కావాలి… గెలుపు కోసం పరుగులు పెట్టించే ఆ కోరిక జ్వలించేలా ఆ ప్రేరణ ఉండాలి… అదెలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు…
మొన్నటి గాళ్స్ వరల్డ్ కప్ గెలుపే తీసుకొండి… సెమీస్ దాకా పడుతూ లేస్తూ వచ్చారు… సెమీస్‌లో పెద్ద అడ్డంకి ఆస్ట్రేలియా, చివరి బంతి వరకూ, చివరి వికెట్ వరకూ పోరాడే టెంపర్ ఉన్న జట్టు అది… ఏ దశలోనూ గివప్ మాటే ఉండని ప్రొఫెషనల్స్…
Ads
అది దాటాలి… ఎలా… జెమీమా జేసస్‌ను ప్రార్థించినట్టే… హర్మన్ ప్రీత్ కౌర్ తను నమ్మిన గురువును ధ్యానించినట్టే… క్రాంతి గౌడ్ తదితరులు దగ్గరలోని ఏదో గుడికి వెళ్లారు… ప్రదక్షిణలు చేస్తున్నారు… అక్కడ ఓ తల్లి కనిపించింది… ప్రార్థన చేసుకుంటోంది…
ఆమె ఒడిలో నాలుగు నెలల ఓ పసిపాప… ఆమె వీళ్లను చూసి నవ్వింది… వీళ్లు ఆగారు, ఎందుకాగారో వీళ్లకూ తెలియదు… ఏదో అనిర్వచనీయ భావన ఆపేసింది… ఆ తల్లి తన పసిపాపను ఇచ్చింది ఎత్తుకొమ్మని… ఎత్తుకుంది క్రాంతి…
ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ క్రాంతి చెబుతోంది… ‘‘అప్రయత్నంగానే ఎత్తుకున్నాను… ఆ తల్లి నన్ను, మా జట్టును మనస్పూర్తిగా ఆశీర్వదించింది… ఆమె ‘మీరు తప్పకుండా వరల్డ్ కప్ గెలిచి తీరుతారు’ అని దీవించింది…”
నా బిడ్డ కూడా పెరిగాక మీలాగే క్రికెటర్ అవుతుంది అని మరోసారి నవ్వింది ఆమె… ఏదో చెప్పలేని ఉద్వేగం… “ఆ తల్లి ఆశీర్వచనం, ఆ పసిపాపను పట్టుకున్న ఏదో ఆ అనుభూతి… మా టీమ్‌కు గొప్ప అదృష్టాన్ని, అదనపు ప్రేరణను ఇచ్చింది… సాయంత్రం టీమ్ సభ్యుల నడుమ ఇదే ప్రస్తావన…
ఆ పసిపాప రూపంలో దేవుడే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడా..? ఏమైనా కానియ్, ఎందరో తల్లులు తమ బిడ్డలు, తమ కలల కోసమైనా మనం గెలవాలని బలంగా కోరుకుంటున్నారు… ఎక్సట్రా ఎఫర్ట్ ఎంతైనా పెడదాం, సర్వ శక్తులూ పణంగా పెడదాం, గెలుద్దాం’’ అని చేతులు కలిపారు…
వాళ్లకు ఓ ఫైర్ లభించింది… తెల్లారి గెలుపూ దొరికింది… అదే ఊపుతో ఫైన్సల్ కూడా దాటేశారు… ఓ చరిత్ర… ఇక్కడ హేతువు గురించిన చర్చ అనవసరం… ప్లేయర్ల నమ్మకాలు, ఉద్వేగాలు వాళ్లకు ఓ భరోసానిస్తాయి… కొన్ని అనూహ్య సంఘటనలు ఏదో ప్రేరణనిస్తాయి… అదే ఇది…
ఒకరికి బెంగాల్ ప్రభుత్వం డీఎస్పీ కొలువు ఇచ్చింది… ఆల్రెడీ ఇద్దరు డీఎస్పీలున్నాయి జట్టులో… బహుశా ఏపీ ప్రభుత్వం కూడా డీఎస్పీ కొలువు ఇస్తుందేమో శ్రీచరణికి, గ్రూప్-1 కొలువు ప్రామిస్ చేశాడు చంద్రబాబు… ఇదే క్రాంతి గౌడ్‌కు మరో కానుక… అది కాస్త భిన్నమైంది…
ఎప్పుడో 2012లో… క్రాంతి తండ్రి మున్నాసింగ్ గౌడ్ కానిస్టేబుల్… ఎన్నికల విధుల్లో ఏవో పొరపాటు, నిర్లక్ష్యం కారణాలతో తనను కొలువు నుంచి తొలగించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం… వరల్డ్ కప్ విజయం తరువాత క్రాంతికి భోపాల్‌లో ప్రభుత్వం సన్మానం చేసింది…
తిరిగి ఆయన్ని పోలీసు కొలువులోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి ఆమెకు ఆ సభలో హామీ ఇచ్చాడు… ఆమె కన్నీటిపర్యంతమైంది… మరో ఉద్వేగం… ‘‘ఆయన ఉద్యోగం పోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది… కొన్నిసార్లు భోజనం కోసం ఇరుగుపొరుగు వారిపై ఆధారపడేవాళ్లం… మా నాన్న మళ్లీ యూనిఫామ్ వేసుకుని, గౌరవంగా రిటైర్ కావడాన్ని చూడాలని అనుకుంటున్నాను..,’’
క్రాంతి స్వస్థలం ఛతార్‌పూర్‌లో ఓ వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం, ఆమె విజయానికి గుర్తుగా నవంబరు 15న ట్రైబల్ ప్రైడ్ డే ఘనంగా జరుపుతాం అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించాడు… ఒక గెలుపు ఎన్నెన్నో ఫలాలను మోసుకొస్తుంది… ఇదీ అలాంటిదే…!
22 ఏళ్ల క్రాంతి గౌడ్… 8వ తరగతి డ్రాపవుట్… బుందేల్‌ఖండ్‌కు చెందిన గోండ్ ట్రైబ్… లోకల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లలో బాల్ బాయ్ పాత్ర నుంచి వరల్డ్ కప్ విజేత జట్టు మెంబర్ దాకా అనూహ్య ప్రస్థానం ఆమెది…!!
Share this Article