.
Ashok Kumar Vemulapalli …. పా.. పా (ఒక మంచి సినిమా )
ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది .. తల్లి వదిలేసి వెళ్లిన బిడ్డని ఎలా పెంచాలో తెలీక తండ్రి ఆ బిడ్డని అనాథాశ్రమంలో అప్పగిస్తాడు.. తనకు ఆ బిడ్డ చెత్త బుట్టలో దొరికాడని చెబుతాడు.. అనాథాశ్రమ నిర్వాహకురాలు అతన్ని అనుమానంగా చూసేలోపే .. వాష్ రూమ్ కి వెళ్లాలంటూ అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు ..
Ads
సగం దూరం వెళ్ళాక బిడ్డ మీద మమకారం గుర్తొచ్చి ఏడుస్తూ అదే ఆటోలో తిరిగి వచ్చి తన బిడ్డని తనకు ఇచ్చేయమని ప్రాధేయపడుతూ.. కన్నీళ్లతో ఆ అనాథాశ్రమ నిర్వాహకురాలి కాళ్ల మీద పడి ఏడ్చి తన బిడ్డని వెనక్కి తెచ్చుకుంటాడు . ఈ సీన్ నిజంగా మన కళ్లు చెమర్చేలా చేస్తాయి.. తండ్రి పాత్రలో కెవిన్ అద్భుతంగా నటిస్తాడు..
కెవిన్ హీరోగా నటించిన ‘పాపా’ (తమిళంలో ‘దాదా’) చిత్రం భావోద్వేగాల ప్రయాణం!
‘పాపా’ చిత్రం అనేది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, తండ్రి- కొడుకుల అనుబంధం జీవితంలో అనుకోని మలుపులు ఎదురైనప్పుడు ఒక యువకుడు తన బాధ్యతలను ఎలా స్వీకరించాడనే అంశాల చుట్టూ అల్లుకున్న ఒక ఫీల్- గుడ్ ఎమోషనల్ డ్రామా.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తల్లి దూరమైన తర్వాత సింగిల్ ఫాదర్‌గా హీరో (కెవిన్) తన బిడ్డను పెంచడానికి పడే కష్టం, అనుభూతి చెందే ప్రేమ ప్రతీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది. బిడ్డ కోసం అతను చేసే త్యాగాలు, పడే తపన… ఈ సన్నివేశాలు చూసేటప్పుడు గుండె బరువెక్కుతుంది.
తల్లికి దూరమైన బిడ్డని తండ్రి పెంచే విధానంఈ సినిమాలో ఈ అంశాన్ని చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా చూపించారు. పిల్లాడిని ఒంటరిగా పెంచే క్రమంలో తండ్రి ఎదుర్కొనే అడ్డంకులు, చిలిపి సంఘటనలు, ఆ పేగుబంధం గొప్పదనాన్ని దర్శకుడు గణేష్ కె. బాబు చక్కగా ఆవిష్కరించారు. బేసిక్ గా తండ్రి వదిలేస్తే సింగిల్ పేరెంట్ గా తల్లి బిడ్డల్ని పెంచడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం .. మన చుట్టూ సింగిల్ పేరెంట్స్ ఎంతో మంది ఉంటారు కూడా …
కెవిన్ నటన ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. కాలేజీ కుర్రాడిగా, ప్రేమికుడిగా, ఆ తర్వాత సింగిల్ ఫాదర్‌గా… పాత్ర వివిధ దశల్లోని ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా చిన్నారిని ఒడిలో పెట్టుకుని తండ్రిగా అతను చూపించే ప్రేమ, బాధ, బాధ్యత చాలా సహజంగా కనిపిస్తాయి. ఇంతకుముందు .. “STAR” సినిమాలో .. కెవిన్ నటన చూసాను .. అతని నటనలో హీరోయిజం కంటే .. భావోద్వేగాలను అద్భుతంగా పలికిస్తాడు…
సింధు పాత్రలో అపర్ణాదాస్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తన పాత్రలో వచ్చే కీలకమైన మలుపులను, భావోద్వేగాలను సమర్థవంతంగా ప్రదర్శించి, ప్రేక్షకులను పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేసింది.
మాస్టర్ ఇయాన్ (కొడుకు పాత్ర) ఈ చిన్నారి నటన చాలా ముద్దుగా, రియలిస్టిక్‌గా ఉండి సినిమాకు మరింత ప్రేమను జోడించింది.
మొత్తం మీద, ‘పాపా’ చిత్రం ఒక మంచి ఫీల్- గుడ్ ఎమోషనల్ మూవీ. ప్రేమ, బాధ్యత, విడిపోవడం, ముఖ్యంగా తండ్రి- కొడుకుల సెంటిమెంట్ వంటి అంశాలను బలంగా చూపించిన ఈ చిత్రం, గుండె బరువెక్కించే అనుభూతిని ఇస్తుంది. కొంత మందికి రొటీన్ కథలా అనిపించినా, క్లైమాక్స్ సన్నివేశాలు, ప్రధాన పాత్రల నటన సినిమాను మర్చిపోలేని విధంగా చేస్తాయి.
ఒక దశలో బిడ్డని తల్లి ఎందుకు వదిలేసి వెళ్లిందనే కారణంతో మనకి తల్లి మీద విపరీతమైన కోపం వస్తుంది .. కానీ ఆ బిడ్డని అలా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో సినిమా ఎండింగ్ లో రివీల్ చేస్తాడు దర్శకుడు.. ఎలాంటి ఫైట్లు , విపరీతమైన ట్విస్టులు , డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ ఉండవు.. సినిమా అంతా ఎమోషన్ మీదే నడుస్తుంది .. అశోక్ వేములపల్లి ……….. (ప్రైమ్ లో తెలుగులోనే ఉంది ఈ సినిమా )
Share this Article