.
ఎక్కడో ఓ చిన్న వార్త కనిపించింది… తెలంగాణ అమరజ్యోతిని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరనున్నట్టు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చెప్పినట్టు ఆ వార్త సారాంశం…
తెలంగాణ సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్న భవనం… భిన్నమైన ఆర్కిటెక్చర్… అద్దంలా మెరుపు, ఓ దీపశిఖ… దూరం నుంచే ఆకర్షిస్తుంది… కానీ అప్పుడెప్పుడో 2023లోనే దాన్ని ప్రారంభించినట్టు గుర్తు…
Ads
మళ్లీ ముఖ్యమంత్రి ప్రారంభించడం ఏమిటి..? పునఃప్రారంభమా..? అలా చేస్తే బీఆర్ఎస్ మళ్లీ రాజకీయ విమర్శలకు, బదనాం చేయడానికి ప్రయత్నిస్తుంది… ఇప్పటికే మేమిచ్చిన కొలువులకు నియామక పత్రాలు ఇస్తున్నాడు, మేం కట్టిన నిర్మాణాలకు, ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు అని రోజూ ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంది కదా… మళ్లీ వాళ్లకు చాన్స్ ఇవ్వడం దేనికి..?
ఈ సందేహాలు తలెత్తాయి… కాకపోతే కొన్ని బీఆర్ఎస్ హయాంలోనే విమర్శలున్నయ్… తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల పేర్లు లిఖించబడలేదనేది ప్రధాన విమర్శ… అలాగే స్మారక చిహ్నం నిర్మాణ ప్రణాళికలో మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్, రీసెర్చ్ హాల్ (పరిశోధనా కేంద్రం) వంటివి ఉన్నాయి… వాటి సంగతేమిటో తెలియదు…

అన్నీ పూర్తి చేసి, పర్యాటకులకు యాక్సెస్ ఇస్తేనే కదా, ఆ నిర్మాణ ఉద్దేశం నెరవేరేది… మరెందుకు ఆగిందో, ఎక్కడ అడ్డంకులు ఎదురయ్యాయో తెలియదు… సో, వాటన్నింటినీ పూర్తి చేసి, సీఎం స్వయంగా వాటిని ప్రారంభిస్తే, అమరవీరులకు సరైన స్మరణ అవుతుంది, ఇంకెవరూ ఏ విమర్శ చేసినా దానికి విలువ ఉండదు… ఇండియా గేట్ మీద అమర జవాన్ల పేర్లున్నట్టే ఈ స్మారక చిహ్నం లోపల కూడా పేర్లుంటేనే ఆ సంకల్పానికి సార్థకత…

అమరవీరుల పేర్లను అధికారికంగా గుర్తించడంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో తెలియదు… నిజానికి తెలంగాణ మలి దశ ఉద్యమానికి నిలువెత్తు స్పూర్తిగా నిలబడింది మాత్రం అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కులో ఉన్న స్మారక స్థూపం… తెలంగాణ మణిస్థంభం… 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం తెలంగాణ ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావు నిర్మించిన స్థూపం అది… దానికీ ఓ చరిత్ర…

హైదరాబాదులోనే మరో అమరవీరుల స్థూపం ఉంది… ఇది సికింద్రాబాదులో ఉంటుంది… చాలామందికి ఇదొకటి ఉందనే తెలియదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని కూడా పట్టించుకోవాలి… అమరవీరుల స్మారకాల్ని నిర్లక్ష్యం చేయడం అంటే అవమానించడమే… కేసీయార్ పిరియడ్‌లో అవేవీ జరగలేదు, ఆ అన్యాయాన్ని ఈ ప్రభుత్వమే సరిదిద్దాలి…!!
Share this Article