.
స్విట్జర్లాండ్ లో ఎటు చూసినా తెల్లటి మంచు కొండలు, పచ్చటి మైదానాలు. ప్రకృతి పరవశగీతాలు పాడుకునే అక్కడైతేనే తెలుగు గీతాలకు బాణీలు చక్కగా వస్తాయని దర్శకుడు అనుకున్నాడు. నిర్మాత గంగిరెద్దులా తల ఊపాడు. సంగీత దర్శకుడు ఎగిరి గంతేశాడు. హీరో చిటికేశాడు. అంతే- ప్రత్యేక విమానం సిద్ధం. ఒక్కో పాటకు మూడు రోజుల చొప్పున ఆరు పాటలకు 18 రోజులపాటు సంగీతం మీద కూర్చోవడానికి(మ్యూజిక్ సిట్టింగ్ కు) అనువైన ఒక నైన్ స్టార్ రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేశారు.
హైదరాబాద్ లో బయలుదేరేప్పుడు బాగా ఉక్కగా ఉండి…తిక్కతిక్కగా ఉండడంతో హీరో మూడ్ పాడై…అందరూ దిగులుగా ఉన్నారు. మొదటిరోజు సంగీతదర్శకుడు అనేక సాపాసాలు సమోసాలు నములుతూ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ…మైనస్ ఇరవై డిగ్రీల అతిశీతల వాతావరణంలో చలికి గడ్డకట్టి అతడి నోరు పెగల్లేదు.
Ads
రెండో రోజు ఉదయమయ్యింది కానీ…ఎవరూ స్పృహలో లేరు. మూడో రోజు హీరోకు ఉక్క తిక్క దిగి…నోరు విప్పాడు.
“ఉక్క ఉక్క ఉక్క-
తిక్క తిక్క తిక్క…”
అన్న క్యాచీ పల్లవి తట్టింది. దాంతో స్టార్ట్ చేయండి అని ఆదేశించాడు. దర్శకుడి కళ్ళల్లో ఆనందబాష్పాలు జలజలా రాలి వెంటనే మంచుగా ఘనీభవించాయి. వెంటనే గీత రచయిత పెన్నూ పేపర్ లేకుండానే హీరో అందించిన ఉప్పందుకుని చెలరేగిపోయాడు. ఉఫ్ అని పాటను అయిదు నిముషాల్లో ఊదిపారేశాడు. సంగీత దర్శకుడు ఒక చరణాన్ని మార్చి రాశాడు. దర్శకుడు హీరో చెప్పిన మాటలను తప్ప మొత్తాన్ని మార్చాడు.
నాలుగో రోజు పొద్దున్నే సంగీతం వారిమీద కూర్చుంది. సంగీత దర్శకుడు తాదాత్మ్యంగా పాడుతున్నాడు. పల్లవిలో తన మాటల తరువాత రచయిత ఆ టెంపోను పట్టుకోలేకపోయాడని హీరోకు అనిపించింది. బాగా విసుగ్గా “దీనక్కా!” ఇక్కడ ఏదో పదం మిస్సవుతోందే అన్నాడు-ఊతపదంగా. అంతే- రచయిత కళ్ళల్లో కోటి కాంతులు వెలిగాయి. తిక్కగా మారిన ఉక్క తరువాత అక్కడ పడాల్సిన పదం “దీనక్కా”యే సార్ అని ఆనందం పట్టలేక గట్టిగా అరిచాడు. లెక్క, పక్క, ముక్క, వక్క ప్రాసపదాలతో మొదటి చరణాన్ని దాదాపుగా హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు పూరించేశారు. కానీ రచయితకు క్రెడిట్ ఇచ్చారు.
అయిదో రోజు రెండో చరణంమీద గట్టిగా కూర్చున్నారు. ప్రేమ్ నగర్లో ఎయిర్ హోస్టెస్ నడిచి వస్తే ఆత్రేయ “కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల” అన్నాడు. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. రెండో చరణం ఆ లెవెల్లో ఉండాలి అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అమెరికా నుండి పెంటపాడుకు హీరోను వెతుక్కుంటూ వచ్చిన హీరో ఇన్ నెత్తిన గంప పెట్టే సీన్ ను దర్శకుడు మైమరచి వర్ణించాడు.
ఆ గంపలో రచయిత కొన్ని దుంపలు వేశాడు. హీరో షరామామూలుగా అవధానంలో దత్తపదిలో పదాలు ఇచ్చినట్లు కొన్ని పదాలు ఇచ్చాడు. రచయిత మహాప్రసాదంగా అందుకుని అల్లుకుపోయాడు. “ఆ గంపా నా కొంపా నీ దుంపా తెంపా…ఆ సొంగ సొగసు ముంపా? అది మురికి కంపా?” అంటూ సాగే రెండో చరణం మొదటి చరణంకంటే బాగా వచ్చినట్లు అందరి కళ్ళలో అదోరకమైన తృప్తి తొణకిసలాడింది.
ఫినిషింగ్ టచ్ గా పదో క్లాస్ పది సార్లు ఫెయిలైన నిర్మాత హీరో జుట్టు ఈ సినిమాలో చింపిరి చింపిరిగా ఉంటుంది కాబట్టి-
“చింపిరి చింపిరి చింపిరి” అన్న సాకీతో పాటను ఎత్తుకుందాం అన్నాడు. సంగీత దర్శకుడు ఉబ్బితబ్బిబ్బయి నిజంగానే నిర్మాతను ఎత్తుకుని…దాన్నే పల్లవిగా నెత్తిన పెట్టుకున్నాడు.
ఈ ఒక్కపాటకే 18రోజులూ సరిపోయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత నిమ్మళంగా నిలుచున్నాడు. మిగతా అందరూ మ్యూజిక్ సిట్టింగ్ కు సార్థకత చేకూర్చి కూర్చున్నారు.
కట్ చేస్తే-
“సొంగ కార్చుకున్న దీనక్క” పాట ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం. భాషాతీత, ప్రాంతాతీత సూపర్ హిట్. యూ ట్యూబ్ లో కోట్ల కోట్ల వ్యూస్ సునామీ. ఏ పెళ్ళి సంగీత్ లో అయినా డ్యాన్స్ కు ఎవరికైనా “దీనక్కా” ఒక్కటే దిక్కూ మొక్కు. మిగతా రచయితలకు సొంగ పల్లవి, దానెక్క ఒక అందుకోవాల్సిన రచనా కొలమానం.
కొస మెరుపు:-
గీత రచయిత ఈ పరమోత్కృష్ట రచనలో దాగిన పదబంధాల అంతరార్థాన్ని స్పష్టంగా విడమరిచి చెబుతూ ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశాడు. అక్కడ “జారింది ఏదీ నక్కా” అన్న మూడు పదాలు సంధిలో కలవడం వల్ల “జారిందే దీనక్క” అన్నట్లు వినిపిస్తుంది కానీ…పద వ్యుత్పత్తి, విభజన ప్రకారం ఉదాత్తమైన సన్నివేశానికి అంతే ఉదాత్తమైన పదరచన అట ఇది. హీరో పరమ మొరటువాడు కావడంతో అతడి కోణంలో ఊతపదం “దీనక్క” అవుతుంది. హీరో ఇన్ నక్కలా అక్కడికి జారుతూ వచ్చింది కాబట్టి ఆమె కోణంలో జారింది- ఏదీ- ఈ నక్క ఈజ్ ఈక్వల్ టు “జారిందే దీనక్క” అవుతుంది.
వెనకటికి మొదటి పేజీనుండి చివరి పేజీవరకు చదివితే ఒక అర్థం ; వెనక పేజీనుండి మొదటి పేజీకి రివర్స్ లో చదివితే మరొక అర్థం వచ్చే “ద్వ్యర్థి(ద్వి-అర్థి – ఒక రచనలోనే రెండర్థాలు) కావ్యాలు రాసే ప్రబంధ కావ్యాల కవులుండేవారు.
ఇంతగా గీతాల్లో సొంగ లావాలా ఉప్పొంగుతుంటే-
ఏయ్! ఎవర్రా అక్కడ?
తెలుగులో ప్రయోగాలు చేసే కవులకు కరువొచ్చిందన్నది?
ఈ పాట “స బూతో-స వర్తమానం- స భవిష్యతి”!!
(ఇందులో పాత్రలు, ప్రాంతాలు, సందర్భాలు, సంగీతసాహిత్యాలు- అన్నీ కేవలం కల్పితం. నిజమనుకునేరు సుమీ!)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article