.
దాదాపు ప్రతి పార్టీ చెప్పేదీ అదే… రాబోయే ఎన్నికల్ని సోషల్ మీడియా శాసించబోతోంది అని… ప్రజాజీవితంలో ఉన్న ప్రతి నాయకుడు సొంతంగా సోషల్ మీడియా టీమ్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు… బోలెడు ఖర్చు… ఎన్నికలొస్తే మరింత ఖర్చు…
ఇక పార్టీలయితే సోషల్ మీడియా ప్రచారంలో దిగజారని మెట్టు లేదు… అభూత కల్పనలు, అబద్ధాలు, ఫేక్ వీడియోలు, ఎఐ ఇమేజెస్, ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలు… (వీటికితోడు ఎన్నికల వ్యూహకర్తల పేరిట కోట్లు వసూలు చేసే గ్యాంగులు చేసే అరాచకాలు అదనం) కాసేపు ఏపీ పాలిటిక్స్, అక్కడి ప్రధాన పార్టీల సోషల్ పైత్యాల్ని వదిలేస్తే…
Ads
తెలంగాణలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ పవర్‌ఫుల్… కోట్లకుకోట్ల ఖర్చుతో… పైన చెప్పినవన్నీ చేస్తున్నారు… బినామీ ఖాతాలు, అసలు ఖాతాలు… క్రియేటెడ్ తప్పుడు వార్తలు, కృత్రిమ వీడియోలు, కావాలని సీఎంను తిట్టించి జనంలోకి వదిలే వీడియోలు…. బోలెడు యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు… బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా వ్యక్తిగత దాడులు, ట్రోలింగులు, బూతులు…
కాంగ్రెస్‌కూ సోషల్ మీడియా వింగ్ ఉంది… అదీ బీఆర్ఎస్‌ను అనుకరించే ప్రయత్నం చేస్తుంది… కానీ బీఆర్ఎస్ సోషల్ క్యాంపెయిన్‌లో పది శాతం కూడా చేతకాదు కాంగ్రెస్ సోషల్ వింగ్‌కు..! ఐతే..?
నిజంగా సోషల్ మీడియా ఎన్నికల సరళిని శాసిస్తుందా..? ప్రభావం చూపిస్తుందా..? నెవర్… అది పార్టీల భ్రమ… నాయకుల నమ్మకం… ఉదాహరణకు జుబ్లీ హిల్స్ ఉపఎన్నికే తీసుకుందాం… కేటీయార్ మీడియా, సోషల్ మీడియా క్యాంపెయిన్లకు బాగా నమ్ముకున్నాడు…
అవే కాదు, బోలెడు స్టంట్లు… కాంగ్రెస్ బాకీ కార్డులు, నిరుద్యోగ కార్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి మరీ బోలెడు ఖర్చుతో కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలపై వ్యతిరేక ప్రచారాలు, బుల్‌డోజర్ సర్కారు అని ఊదరగొట్టారు… ఏం చేసినా వర్కవుట్ కాలేదు… సోషల్ మీడియా ప్రభావం కౌంటర్ ప్రొడక్ట్ అవుతుందని కేటీయార్‌కు ఇప్పుడు అర్థమైనట్టుంది… (గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాను బలంగా నమ్ముకుంది… ఫలితం తెలిసిందే)
ఇప్పుడేమైంది..? ఉపఎన్నిక ఖరారైనప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ దాదాపు 10 శాతం మైనసులో ఉన్నట్టు ఓ అంచనా… కానీ తీరా ఫలితం చూస్తే 12 శాతానికిపైగా ప్లస్… గెలిచేది సోషల్ మీడియా, మీడియా కాదు… సరైన రాజకీయ ఎత్తుగడలు, పోల్ మేనేజ్‌మెంట్… గెలిపించేవి అవే… గెలిపించినవీ అవే..!!
Share this Article