.
ఓ ఆసక్తికరమైన వార్తకు ముందు కొద్దిగా నేపథ్యం, ఉపోద్ఘాతం అవసరం దీనికి…. హిడ్మా… ఇప్పుడు మారుమోగిపోతోంది పేరు… సోషల్ మీడియాలో, మీడియాలో… ఎక్కువగా తన ఎన్‌కౌంటర్ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా… కొంతమేరకు మాత్రమే అనుకూలంగా..! సోషల్ మీడియాలో జోరు కనిపిస్తుండగా, అనేకమంది తన వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారు… ప్రస్తుతం ట్రెండింగ్ నేమ్స్ 1) ఐబొమ్మ రవి… 2) మావోయిస్ట్ హిడ్మా… అఫ్‌కోర్స్, ఇద్దరికీ ఏమాత్రం పోలిక లేదు… అసలు ఆ పోలికే మూర్ఖత్వం…
- ఎందుకు..? తను అక్షరాలా దండకారణ్యాన్ని శాసించాడు… తన కనుసైగతోనే పాలించాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ రాజ్యానికి తను సైన్యాధికారి… ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తిష్ట వేసిన మావోయిస్టు కాదు… ఆ ఆదివాసీల్లో నుంచి పుట్టినవాడు, పెరిగినవాడు… తుపాకీ పట్టి, రాజకీయ నాయకులకు, పోలీసు బలగాలకు సింహస్వప్నం అయ్యాడు… 2017 తరువాత ప్రతి కీలక ఆపరేషన్ తనదే…
మారిన కాలంలో తను కూడా లొంగిపోవడానికి సిద్దపడి, ఆ ప్రయత్నాల్లో ఉండగానే, అనుకోకుండా పట్టుబడితే… ఏపీ పోలీసులు తనను అనవసరంగా ఎన్‌కౌంటర్ చేశారనే ప్రచారం ఉంది కదా… తన లొంగుబాటును గనుక ప్రొజెక్ట్ చేసి ఉంటే, మావోయిస్టుల్లో ఉన్న ప్రతి కేడర్ గిరిజనం బయటికి వచ్చేవాళ్లు అనే భావన ఉంది… ఎలాగోలా తెలంగాణకు వచ్చి ఉంటే బతికేవాడేమో… ఇప్పటికీ మావోయిస్టుల్లో తెలంగాణవాళ్లవే కీలకస్థానాలు… లొంగుబాటు, రక్షణ, తరువాత జీవనం గురించి ఆలోచిస్తే వాళ్లకూ తెలంగాణలో లొంగుబాటే సేఫ్…
Ads
- ఎక్కడో ఇస్తాంబుల్‌లో తన పేరిట వాల్ రైటింగ్, పోస్టర్లు, బ్యానర్లు, ఆందోళనలు కనిపిస్తున్నాయి… టర్కీలోని మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ (టీకేపీ-ఎంఎల్) తమ పత్రిక పార్టిజాన్ పేరిట హిడ్మాకు ఇలా భారీగా సంతాపం ప్రకటిస్తోంది… ఢిల్లీలో వాయుకాలుష్యం మీద జరిగిన ఓ కార్యక్రమంలో హఠాత్తుగా హిడ్మాకు సంతాపం ప్రకటించే ప్లకార్డులు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి… తన అంత్యక్రియల షార్ట్ వీడియోలు, తన మృతదేహం ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి…

ఒక ఆసక్తికరమైన వార్త ‘ఆంధ్రప్రభ’లో కనిపించింది… ఆ వార్త కరెక్టో కాదో నేనిక్కడ చెప్పదలుచుకోలేదు… కానీ సందేహాలు మాత్రం ఉన్నాయి… చదవడానికి మాత్రం ఆసక్తికరంగా ఉంది…
‘‘మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత హిడ్మా మూలాలు హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నాయి… హిడ్మా ఎన్ కౌంటర్ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 2015 లో హిడ్మా సోదరుడు ఎన్ కౌంటర్లో మరణించగా.. స్వగ్రామం పూవర్తిలో భారీ స్తూపాన్ని నిర్మిస్తున్న సమయంలో హిడ్మాను పట్టుకునేందుకు జీపీఎస్ ట్రాకింగ్, ఆర్మీ హెలికాప్టర్, డ్రోన్స్ సహాయంతో పదివేల మంది పోలీస్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
- ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకుని ఛత్తీస్‌గఢ్ నుండి గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు వస్తున్న కూలీలతో కలిసి ఇక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఇక్కడి టన్నెల్ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ సాధారణ జీవితాన్ని గడిపారు. నాటి జిల్లా ఎస్పీ డోయల్ డేవిస్‌కు హిడ్మాపై అందిన ఇంటెలిజెన్సీ హెచ్చరికలతో అప్రమత్తమైన హుస్నాబాద్ పోలీసులు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన 20 మంది కూలీలను ఒక్కొక్కరిగా విచారణ జరిపారు.
అందులో అనుమానితుడుగా ఉన్న హిడ్మాను. అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హిడ్కా భాష అర్ధం కాకపోవడంతో అనుమానాస్పద వ్యక్తిగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు జీవితం అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు కనిపించినా.. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఈ ప్రాంత వాసులు గుర్తు చేసుకుంటున్నారు…’’

ఇదీ వార్త… 1) తన మూలాలు హుస్నాబాద్‌లో ఉండటం ఏమిటి..? తనది సుక్మా జిల్లా, పూవర్తి… మురియా తెగ… 50 ఇళ్లున్న ఓ చిన్న గిరిజన గ్రామం అది… 2) భాష తెలియకపోతే పోలీసులు అనుమానాస్పద వ్యక్తిగా రిమాండ్‌కు పంపిస్తారా..? ఏం కేసు పెడతారు..? పైగా తోటి కూలీల గురించి తెలుసుకున్నట్టే హిడ్మా వివరాలూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా… హిడ్మాకు ఇంగ్లిష్, హిందీ, గోండు, కోయ, తెలుగు, బెంగాలీ భాషలు తెలుసు, మాట్లాడగలడు…
- 3) కానీ 2015లో తను పెద్ద కేడర్ నక్సలైట్ కాదు… 2017 నుంచే తన మార్క్ అటాక్స్ స్టార్టయ్యాయి… 4) అప్పట్లో తన కోసం మరీ 10 వేల మంది పోలీస్ బలగాలు డ్రోన్లు, జీపీఎస్, ఆర్మీ హెలికాప్టర్లు గాలించేంత సీన్ లేదు… అప్పటికి దండకారణ్యంలోని అనేక ప్రాంతాలకు బలగాలు అడుగుపెట్టే సాహసమే లేదు… అంతటి సాధన సంపత్తితో గాలింపులూ లేవు అప్పుడు… 5) కర్రెగుట్టల్లో ఓసారి మాత్రం హిడ్మా కోసం దాదాపు అదే స్థాయిలో గాలింపు జరిగింది, అదీ మొన్నీమధ్యే..!! ఎస్, గెరిల్లా పోరాటాలకు సంబంధించి, మావోయిస్టుల ప్రస్థానంలో హిడ్మాది ఓ సపరేట్ అధ్యాయం..!!
Share this Article