.
Murali Buddha ….. నిన్న ఉదయం ఈటివిలో సతీ సుమతి సినిమా వస్తోంది . కాంతారావు , అంజలీ హీరో హీరోయిన్లు .. టివి ఆన్ చేయగానే ఓ సీన్ బాగా నచ్చింది … రేలంగి తన వద్ద మహిమ గల ఒక వజ్రం ఉందని , దానికి పూజలు చేసి కోరికలు కోరుకుంటే జరుగుతాయి అని వర్ణిస్తాడు ..
అది విన్న సూర్యకాంతం అంత మహిమ గల వజ్రం నాకు అమ్మే బదులు నువ్వే ఇంట్లో ఉంచుకొని బోలెడు సంపాదించవచ్చు కదా ? అంటుంది . దానికి రేలంగి దీని అమ్మలాంటి వజ్రం నా వద్ద ఇంట్లో ఉంది . అందుకే అమ్ముతున్నాను అని నమ్మించి, భారీ మొత్తానికి అమ్ముతాడు .. వారం పాటు ముందస్తు పూజలు చేసి ఆ తరువాత కోరికలు చెప్పమంటాడు …
Ads
ఈ సీన్ అంత గొప్పగా ఏముంది ? అనిపించవచ్చు … కానీ ఆలోచిస్తే ఆలోచించాల్సిందే ఉంది … 1960 ప్రాంతంలోనూ అద్భుత ఉంగరాలు , వజ్రాలు అని మోసం చేసే వ్యాపారం ఉంది. అదేమీ ఈ మధ్య వచ్చిన కొత్త వ్యాపారం కాదు అని తెలిసింది .
60 లలోనే సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు ఉంటే, ఈ కాలంలో సైతం డాక్టర్ వంటి చదువుకున్న వారు కూడా ఇలాంటి వాటికి కోట్లు అర్పిస్తున్నారు అంటే మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది . (ఎవరో ఒక లేడీ తెలివిగా ట్రాప్ చేసి ఓ డాక్టర్ నుంచి ఏకంగా 14 కోట్లు కొట్టేయించింది… నిన్నటి వార్తే… భారీ సైబర్ క్రైమ్…)
ఆ సినిమాలో సూర్యకాంతంకు కనీసం చిన్న అనుమానమైనా వచ్చింది . అంత మహిమ గల వజ్రం నాకెందుకు అమ్ముతున్నావ్, నువ్వే ఉంచుకొని కోట్లు సంపాదించవచ్చు కదా అంటుంది . ఇప్పుడు మోసపోతున్న వారికి ఈ మాత్రం అనుమానం కూడా రావడం లేదు …

ఆ కాలం నాటి కాంతారావు వంటి హీరోలు జీవితంలో దెబ్బ తిన్నారు కదా, వారిని చూసి, ఆ జీవితాలు చదివి ఈ కాలం చిన్న చిన్న నటులు సైతం కొంత డబ్బు రాగానే ఏదో ఓ వ్యాపారం మొదలు పెడుతున్నారు . నటుల్లో అలాంటి జాగ్రత్త కనిపిస్తే వారి సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రం మోసం విషయంలో 1960 నాటి తెలివి తేటలు కూడా చూపడం లేదు …
టివిలో ఆ సీన్ చూడగానే ముందు రాయాలి అనిపించింది … తరువాత ఎంత రాసినా వృథా అని కూడా అనిపించింది తరువాత . ఎందుకంటే, ఓ డెంటిస్ట్ ఇలాంటి మోసానికి కోట్ల రూపాయలు అర్పించాడు అని చదివాక… ఎంత రాసినా ఎవరు మోసపోకుండా ఉంటున్నారు అనిపించింది …
స్వార్ధం వల్లనే ఇలా మోసపోతారు అనుకుంటారు గానీ … స్వార్ధం లేని మనిషి ఉండడు . స్వార్ధం లేకుంటే జీవితమే ఉండదు … స్వార్ధం వల్ల కాదు, అజ్ఞానం వల్ల ఇలా మోసపోతారు … ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేక పోవడం వల్ల ఇలా మోసపోతారు …. స్కూల్ లో ఇంజనీరింగ్ , మెడికల్ కాలేజీల్లో ఈ చదువు చెప్పరు … సొంతంగా నేర్చుకోవాలి …
Share this Article