.
ఎన్నికల ప్రక్రియల్లో ఎన్ని లోపాలైనా ఉండవచ్చుగాక… ప్రజాస్వామ్యంలో ఎన్నికలే చాలా కీలకం. ఆ ఎన్నికల్లో ఎన్నెన్ని కలలో, కళలో, కల్లలో తెలుసుకోవాలంటే తాజాగా తెలంగాణాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల గోదాలోకి దిగాలి.
అకడమిక్ గా స్థానిక పరిపాలనలో పంచాయతీ వ్యవస్థ ఎంత ప్రధానమో చెబితే రామాయణం కంటే పెద్దది. కానీ ఆచరణలో సర్పంచ్ పదవి దేవతావస్త్రం కథ. అధికారాలేవో ఉన్నట్లే ఉంటాయి. కానీ ఎమ్మెల్యే సూర్యప్రభ ముందు సర్పంచ్ వెలుగు వెలగలేక చీకటిగానే మూసుకుపోయి కారుచీకట్లో కాంతిరేఖకోసం వెతుకుతూ ఉంటుంది.
Ads
ఊరికి ఎన్నో చేయాలని సర్పంచ్ కు ఉంటుంది. కానీ చేయడానికి తగిన నిధులు ఉండవు. రాజ్యాంగం ఎన్నో హక్కులను, విహిత కర్తవ్యాలను సర్పంచ్ లకు ఇచ్చి ఉంటుంది. కానీ అవన్నీ కాగితాల్లో వేలాడే విలువలుగా ఉంటాయి.
సర్పంచ్ అనుమతి లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ఊళ్ళో చీమ కూడా చిటుక్కుమనడానికి వీల్లేదని ఆదర్శం గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఆచరణలో చీమ దోమ నల్లి బల్లి కుక్క నక్కతోపాటు సకల జీవులు సర్పంచ్ ముందే చిటుక్కుమంటూ కొండొకచో సర్పంచ్ నే తొక్కిపోతూ ఉంటాయి.
సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులుండవు. పార్టీలకు సంబంధం లేకుండా ఊరి అభివృద్ధికి స్వతంత్రమైన స్థానిక పాలనావ్యవస్థ ఉండాలన్నది అందులో ఆదర్శం, ఉద్దేశం. కానీ ఆచరణలో అధికార పార్టీ బలపరిచే అభ్యర్థులే అత్యధిక సంఖ్యలో గెలుస్తూ ఉంటారు.
ఊరి జనానికి కూడా ఏ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరో తెలిసే ఉంటుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ బలపరిచే అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత సహజంగా ఆయా ఎమ్మెల్యేలపైనే ఉంటుంది. ఎమ్మెల్యేలను కాదని సర్పంచ్ లు చేసేదేమీ ఉండదన్న స్పృహ ఎలాగూ ఉంటుంది.
కాబట్టి రాజ్యాంగం ఎన్నెన్ని ఆదర్శాలను, అభ్యుదయాలను ప్రవచించినా, పాలనాసౌలభ్యాలను హక్కుగా పల్లెలకు ఇచ్చినా, చట్టాలుగా అవన్నీ దశాబ్దాలుగా ఉన్నా… ఢిల్లీ నుండి బయలుదేరిన నిధులు పల్లెకు చేరేసరికి అందులో పదహారో శాతం దక్కితే గొప్ప అన్న మాటే అక్షరాలా నిజం.
ఇంటి పన్ను, చెత్త వసూలు పన్ను, వృత్తి వ్యాపార లైసెన్సులు (సీనరేజీ) తదితరాలతో పంచాయతీకి సమకూరే నిధులు ఏ మూలకూ చాలవు. దాంతో ఓట్లేసి గెలిపించిన ఊరి జనం ముందు పరువు పోతుందని సర్పంచ్ సొంత డబ్బులతో రోడ్లు వేయిస్తూ ఉంటాడు. మురికి కాలువలు తవ్విస్తూ ఉంటాడు.
కాలువల్లో మురికిని ఎత్తేయిస్తూ ఉంటాడు. రోడ్డును అడ్డగించే కంపలను కొట్టేయిస్తూ ఉంటాడు. గుంతలు పడితే తట్టెడు మట్టి వేయిస్తూ ఉంటాడు. ఇదంతా అటుఇటు కలిపి లక్షల్లోకి వస్తుంది. తెలంగాణాలో ప్రస్తుతం 12,735 గ్రామ పంచాయతీలు. ఇలా సొంత డబ్బు ఖర్చు పెట్టి బిల్లులు రాక కూలీలైన సర్పంచులున్నారు.
ఊరికోసం అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులున్నారు. పది, పదిహేను లక్షల అప్పుతో ఊళ్ళో మొహం చూపించలేక ఊరొదిలి దూరంగా వెళ్ళిపోయిన సర్పంచులున్నారు. పంచాయతీల స్వయంప్రతిపత్తికి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకూడని విషయాలు. అన్నట్టు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి… ఇదే…
మరోమాట... సర్పంచుల దురవస్థ గురించి ఏం చెప్పినా సరే. ఆ పదవికి ఉండే ప్రాధాన్యమే వేరు ఊరిలో. అందుకే ఏకగ్రీవాల ప్రయత్నాలు, వేలం పాటలు. లక్షల విలువైన సొంత మేనిఫెస్టోలు, హామీలు..
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article