Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…

December 15, 2025 by M S R

.

Gottimukkala Kamalakar ……. మూడు పాటలు- ఒక నోస్టాల్జియా *****

రాజేష్ ఖన్నా, షర్మిలా టాగోర్ వర్షంలో దేహాలు తడిసి, మనసులకు ఎగసి, వలపులు రగులుతుంటే ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళతారు. వాళ్ల వంట్లో పుడుతున్న దావానలం ముందు చిన్నబోయేలా, ఓ చిన్న చితుకుల మంట ఉంటుంది…!

Ads

షర్మీలా సిగ్గుపడుతూ చలి కాచుకుంటున్నట్టు చెలి వగలు పోతూ ఉంటుంది. ప్రవరాఖ్యుడు సైతం పంతం వదిలేసేలాంటి వాతావరణం; అక్కడున్నదేమో రొమాంటిక్ సూపర్ స్టార్..!

దీనికి తోడు తండ్రిని మించిన తనయుడు రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం; ఆనంద్ బక్షీ సాహిత్యాన్ని వెయ్యింతలు పెంచేలా కిషోర్ గొంతూ..!

హిందీ ఆరాధన సినిమాలోని సన్నివేశమిది. రసజ్ఞులైన నా స్నేహబృందానికి పాట గుర్తుకు వచ్చే ఉంటుంది..!

రూప్ తెరా మస్తానా.. ప్యార్ మెరా దీవానా.. భూల్ కోయీ హమ్ సేనా హోజాయే..!
ఓ ట్రాన్సిస్టర్ లో ఎవరో పాడుతున్నట్టు పాట సాగుతుంటే, గదిలో వ్యవహారం ముందుకు సాగుతుంది..!!
ఆనక భూల్ (?) హోజాతుంది.
****

https://www.youtube.com/watch?v=dyEdcOhxJNQ 

ఇలాంటిదే ఇంకో పాట..!
ఓ ఎంకీ నాయుడుబావ లాంటి జంట ప్రకృతిలో మమేకమైన రీతిలో నాట్యం చేస్తుంటారు. ఆ అమ్మాయిని ఉద్రేకపరుస్తూ అతనో నాటుగీతం పాడుతుంటాడు..!
బనియన్లో బక్కగా కమల్; బట్టల్లో బరువుగా జయచిత్ర బంధింపబడ్డట్టు ఓ రూంలో ఉంటారు. అవతల పాడుతున్న పాట ఇవతల ఉన్న జంట పంట పండిస్తుంది…!

వీటూరి రాస్తే; ఇసై జ్ఞాని ఇళయరాజా బాణీకి బాలు గళేంద్రజాలపు మాయ ఆ పాట..!
ముసలోళ్లకు గతజ్ఞాపకాల మందహాసాన్నీ; పసికుంకలకు భవిష్యత్తు మీద ఆశనీ; పడుచోళ్లకు ఇంటినీ; ఇంతినీ గుర్తుజేసే పాట..!
“మబ్బే మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిచిందిలే..” అంటూ మబ్బు మనుషులను కూడా “వయసు పిలిచింది” అంటూ ముగ్గులోకి దింపే పాట..!

****
ఈ రెండు పాటలూ మగాళ్లు పాడితే అతివలు స్పందిస్తారు..! జంటలు కలుస్తాయి.
*****
పై రెంటినీ మించి మింటినంటిన మరో పాట..!
కవి ఐన ప్రాణ స్నేహితుడి పెళ్లైంది. తొలిరేయి. ఎప్పుడో తను రాసుకుని దాచుకున్న గీతం..!
తను ప్రేమిస్తున్నాను; తనను ప్రేమిస్తోంది అనుకుంటున్న స్నేహితురాలు బాణీ కట్టింది; తనక్కొంచెం వినిపించింది కూడా..!

కొత్త జంటను శోభనపు గదిలోకి పంపి గడియవేసిన ఈ పాత స్నేహితులు ఆరుబయట నడవడం మొదలెట్టారు. గదిలోపల దేహసంయోగం; గదిబయట మనస్సంయోగం…!
ఆ పాటను త్యాగరాజా..? అన్నమయ్యా..? కాళిదాసా..? క్షేత్రయ్యా..? రామదాసా..? భారవా..? భాసుడా..? సాక్షాత్తూ సరస్వతీదేవి పురుషరూపం దాల్చారా..? అనిపించే వేటూరి మాత్రమే రాయగలరు; ఇళయరాజా మాత్రమే చేయగలరు; బాలూ జానకమ్మలు మాత్రమే గేయగలరు..!

“మౌనమేలనోయీ…ఈ మరపురాని రేయీ…!” అంటూ సాగే ఈ పాట ఇద్దరూ మౌనంగా పాడుకుంటారు.
సాగరమంత ప్రేమ ఉన్నా సంగమించని ప్లేటోనిక్ జంటది ఆ ప్రణయగీతం.
సాగరసంగమంలోది…!!
పై రెండూ సూపర్ హిట్ పాటలు..! మూడోది అజరామరం..!    …. -Gottimukkala Kamalakar

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….
  • రాహుల్ గాంధీ, లియోనిల్ మెస్సీ… ఇద్దరినీ స్పానిష్ కనెక్ట్ చేసింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions