.
ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా, బలంగా ఉండాలి… కానీ ప్రతిపక్షం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలాగా ఉండకూడదు… దీన్ని పదే కేటీయార్, హరీష్ రావు నిరూపిస్తున్నారు… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, వీళ్ల కువిమర్శలు ఎలా కౌంటర్ ప్రొడక్ట్ అవుతున్నాయో కూడా సమజవుతున్నట్టు లేదు పాపం…
ఆ ఇద్దరి గురించే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… అధినేత కేసీయార్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి… అనారోగ్యమో, వైరాగ్యమో తెలియదు… ఆ ఫామ్ హౌజులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి…!
Ads
కేటీయార్ ఏమంటున్నాడు..? ‘‘సర్పంచి ఎన్నికల్లో విజయోత్సవాల పేరిట జిల్లాలు తిరిగి ప్రచారం చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ ఎవరూ చరిత్రలో చూడలేదు’’ అట… ఇది పరోక్షంగా తన డాడీ పెద్ద దొరవారిని ఎద్దేవా చేయడం, ఎందుకంటే… ఈ సీఎం జనంలో ఉంటున్నాడు ఏదో ఓ పేరిట… కేసీయార్ అసలు జనంలోకే వచ్చేవాడు కాదు… అది కొండగట్టు బస్సు ప్రమాదం వంటి విషాదాలు, విపత్తుల్లో కూడా జనం గుర్తుకురాని ముఖ్యమంత్రి… ఎవరు రియల్ ప్రజాజీవితంలో ఉన్నట్టు, జనంలో ఉన్నట్టు కేటీయార్..?

పోనీ, గోపీనాథ్ మరణిస్తే వెళ్లిన దొరవారు కంటతడి పెట్టాడు… కొండగట్టు మృతులు కూడా మనుషులేననీ, ఆ కుటుంబాలూ శోకపీడితమే అని మాత్రం ఆలోచించలేదు… అదీ తేడా… పోనీ, గోపీనాథ్‌కు నివాళి అర్పించాడు, కనీసం జుబ్లీహిల్స్ ఎన్నికలో తన పార్టీకి వోటేయాని అప్పీల్ చేశాడా..? లేదు… పోనీ, సర్పంచి ఎన్నికల్లో పార్టీ అధినేతగా వోటర్లు తమకు మద్దతునివ్వాలని అడిగాడా..? అదీ లేదు… ప్రజలంటే అంత తేలికభావన..!!

ఇవన్నీ రియాలిటీలు, ఉదాహరణలు… జనంలోకి వెళ్లడాన్ని జనం హర్షిస్తారు కదా కేటీయార్… ఫామ్ హౌజులో ఫ్రస్ట్రేషన్‌తో పఢావుపడటాన్ని కాదు..!! అసలు ఓ ముఖ్యమంత్రి జనంలో ఉండటాన్ని, జిల్లాల్లో తిరగడాన్ని అపహాస్యం చేసే ప్రతిపక్షం చరిత్రలో ఇదే మొదటిసారి… ఇదీ కరెక్ట్ స్టేట్‌మెంట్ కేటీయార్… సర్పంచి నుంచి సహాచర మంత్రుల దాకా అందరినీ రేవంత్ రెడ్డి కలిస్తే దాన్నీ విమర్శిస్తే దీన్ని ఏం రాజకీయ పోకడ అంటారో..!!

నిజానికి అధికారంలో ఉంటే జనం కనిపించలేదు సరే, కానీ ప్రజలు కుర్చీ నుంచి దించేశాక, ప్రతిపక్షంలోకి వచ్చాకనైనా జనం మీద బాధ్యత, పద్ధతి కనిపించాలని తమ వ్యవహారశైలిలో... కానీ ఇది మరీ కంట్రాస్టు... కేటీయార్‌లో యారొగెన్సీ మరింత పెరిగింది...

మరో విమర్శ… కేసీయార్ కేవలం అసదుద్దీన్‌ను తప్ప వేరే ఎమ్మెల్యేలను కలవలేదు, ఈ రేవంత్ రెడ్డి మరీ ఎంఐఎం ఎమ్మెల్యేలను, చోటా నేతలను కూడా కలుస్తున్నాడు అట… అవును, కేసీయార్ తన మంత్రులు, తన ఎంపీలకు, తన ఎమ్మెల్యేలకు టైమ్ ఇవ్వకపోయేది… చులకనగా చూసేది… ప్రగతిభవన్ గడీ దగ్గర నిరీక్షించి, కేసీయార్ దర్శనం దొరక్క వాపస్ పోయిన వాళ్లూ బోలెడు మంది… స్వామివారికి ఆర్జిత సేవలు తప్ప ధర్మదర్శనాలు ఉండేవి కావు… ఒక ఈటలను, ఒక గద్దర్‌ను అవమానించిన తీరు జనానికి గుర్తుంది…

మద్దతునిస్తున్న పార్టీ నాయకులు వస్తే దూరం పెట్టగలడా రేవంత్ రెడ్డి… కలుస్తాడు, అందులో తప్పేముంది..? పైగా ఇదే ఎంఐఎం మాకు జాన్ జిగ్రీ అని పోకడలకు పోయింది ఎవరు అప్పట్లో..? పైగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఉరిమితే, హిందూ వోట్లు సంఘటితం అవుతున్నాయి మజ్లిస్- టీఆర్ఎస్ దోస్తీకి వ్యతిరేకంగా అని తెలిసి… అప్పుడు కదా ప్రపంచంలోకెల్లా భీకర, బీభత్స్ హిందువును అని చెప్పుకుంది… జస్ట్, రెండేళ్లే కదా అయ్యింది, ఇవన్నీ చూసి… అప్పుడే జనం మరిచిపోరు కదా..!

బీఆర్ఎస్ క్యాంపు నుంచి మరో విమర్శ… సీఎం ఢిల్లీ పర్యటనలు..! ఎస్, వెళ్తాడు, వెళ్లాలి… వెళ్తూ ఉండాలి… కాంగ్రెస్, బీజేపీ రాజకీయ విభేదాలు వేరు… ఒక రాష్ట్రం- కేంద్రం ప్రభుత్వ అధికారిక సంబంధాలు వేరు… రెండూ వేర్వేరు… వాటి నడుమ కనీకనిపించని ఓ విభజన రేఖ ఉంటుంది… రాష్ట్రానికి కావల్సిన నిధులు, పథకాలు, పెండింగ్ సమస్యల మీద వెళ్లాలి, మంత్రుల్ని కలవాలి, ప్రధానిని కలవాలి… తెలంగాణ అవసరాలు, ప్రయోజనాల కోణంలో తప్పనిసరి… పనిలోపనిగా తన హైకమాండ్‌నూ కలుస్తాడు… వాట్ రాంగ్ ఇన్ ఇట్..?

కేసీయార్ ఏకంగా ప్రధానిని బాయ్‌కాట్ చేసి, నానా రకాలుగా ఏవేవో కువిమర్శలు చేసి.., కేంద్రానికీ, రాష్ట్రానికీ నడుమ సత్సంబధాలను తెగ్గొడితే దాని ప్రభావం రాష్ట్రం మీద పడింది… అవన్నీ సరిదిద్దే తిప్పలు పడుతున్నది రేవంత్ రెడ్డి… ప్రత్యేకించి అడ్డగోలు వడ్డీ రేట్లతో ఎడాపెడా అప్పులు తెచ్చి, కేసీయార్ రాష్ట్రాన్ని అప్పుల కుంపటి చేస్తే… ఆ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం, తెలంగాణ ప్రజల సొమ్ము వృథా గాకుండా ఉండటం కోసం నానాపాట్లూ పడుతున్నది రేవంత్ రెడ్డి… ఇదంతా రియాలిటీ…

కేసీయార్ మోకాలడ్డిన దామగుండం నేవీ రాడార్ దగ్గర నుంచి కేంద్రానికి అన్నింటా సహకరిస్తూ… రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకోవడానికి మొహమాటం దేనికి..? అది ముఖ్యమంత్రి కనీసబాద్యత కాదా..? అది కేసీయార్‌కు తెలియక, తనేదో అడిగితే మోడీ దాన్ని తిరస్కరిస్తే… ఆ కోపాన్ని కేంద్రం మీద, మోడీ మీద చూపించి చివరకు తెలంగాణను నష్టపరిచింది ఎవరు..? కేసీయార్..!! నిష్ఠురంగా ఉన్నట్టు అనిపిస్తోందా..? ప్చ్, నిజం ఎప్పుడూ అలాగే ఉంటుంది... మనకు నచ్చినా నచ్చకపోయినా..!!

కేంద్రాన్ని అడగడంలో తప్పేం ఉంది..? అది తెలంగాణ హక్కు… మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటివి బరాబర్ అడగాలి… అడగాలంటే ఢిల్లీ పోవాలి… ఇస్తారా ఇవ్వరా వేరే సంగతి… ఇవ్వకపోతే తెలంగాణ వ్యతిరేకతను బీజేపీయే బయటపెట్టుకుంటుంది కదా… సో… ఐననూ వెళ్లిరావలె హస్తినకు... అవశ్యంగా..!!

Share this Article