Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె కథలో బోలెడు నాటకీయత… కానీ ‘క్రియేటివ్ ఫ్రీడమ్‌’పైనే భయం…

December 17, 2025 by M S R

.

ఓ యువకుడు ఒక ప్రశ్న వేశాడు… *ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు వింటున్నాను గానీ, ఒక సినిమా కథకు సరిపడా నాటకీయత ఉందా ఆమె జీవితంలో..?* …

సాయిపల్లవి కథానాయికగా సుబ్బులక్ష్మి జీవిత కథను గీతా ఆర్ట్స్ తెరకు ఎక్కించబోతుందనే వార్తల నేపథ్యంలో  ఆ ప్రశ్న…! అంతేకాదు, ఆమె అభిమానుల్లో మరో భయం ఉంది ఇప్పుడు… క్రియేటివ్ ఫ్రీడమ్ పేరిట ఆమె కథకు నానా కల్పితాలను జతచేస్తారేమోనని… అసలు ఆమె కథకు మరకలు పడతాయేమోనని…

Ads

నిజమే, సినిమా అన్నాక దర్శకుడు, రచయిత కావల్సినంత ఫ్రీడమ్ తీసుకుని… కథ రక్తికట్టడం పేరిట ఏవేవో ట్విస్టులు, మసాలాలూ గుప్పిస్తారు… ప్రత్యేకించి మన తెలుగు దర్శకులకు చరిత్రకు వక్రబాష్యాలు చెప్పడం, వక్రీకరించడం బాగా అలవాటు… మరీ ముఖ్యంగా హీరోల ఇమేజ్, ఎలివేషన్ల కోసం చారిత్రిక వ్యక్తుల కథలనూ చెడగొట్టడం మనం చూశాం కూడా…

  • సుబ్బులక్ష్మి జీవితంలో దర్శక రచయితలు మసాలాలు జోడించగల అంశాలున్నాయి… అదుగో అక్కడ వస్తోంది ఈ భయాందోళన… ప్రత్యేకించి ఆమె పెళ్లి…

సరే, వివరాల్లోకి వెళ్దాం…  ప్రజెంట్ జనరేషన్‌కు ఆమె కథ తెలియడం అవసరం… రేప్పొద్దున ఆమె కథకు ఏమేం కలిపి, వాళ్లేం తీస్తారో తెలియదు కదా, అసలు కథను ముందుగానే ఇక్కడే, ఇప్పుడే ఓసారి చెప్పుకుందాం… ఆమె జీవితంలోని నాటకీయ పరిణామాలతో సహా..!!

ఆమె అప్పటి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో ఒక ‘దేవదాసి’ కుటుంబంలో జన్మించింది… ఆ కాలంలో ఈ సామాజిక నేపథ్యం కారణంగా ఆమె సామాజిక నిరాదరణ, పక్షపాతం ఎదుర్కొంది… చిన్నప్పటి నుంచే సంగీతంపై అసాధారణ పట్టు… ఆమె తల్లి, షణ్ముకవడివు, వీణా విద్వాంసురాలు కావడం, ఆమెకు తొలి గురువు కావడం… ఎనిమిదేళ్ల వయసులోనే వీణ కచేరీతో రంగప్రవేశం చేసి, వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది…

మధురై నుండి చెన్నైకి (అప్పటి మద్రాసు) రావడం ఆమె జీవితంలో పెద్ద అడుగు… సదాశివంతో పరిచయం, ఆ తర్వాత వివాహం… ఇది ఆమె జీవితంలో పెద్ద మలుపు… సదాశివం ఆమె మేనేజర్‌గా, ప్రమోటర్‌గా మారి, ఆమె ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు… కానీ ఆ పెళ్లిపై, ఆమెలోని మార్పుపై అప్పట్లో బోలెడు విమర్శలు… అవీ చెప్పుకుందాం…

  • 1940ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది, శకుంతల (1940), మీరా (1945) వంటి చిత్రాల్లో నటించింది… ‘మీరా’ సినిమా ఆమెకు జాతీయ స్థాయిలో, హిందీ ప్రేక్షకుల మధ్య కూడా గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది… కానీ సంగీతం కోసం ఆమె సినిమాల్ని వదిలేసింది… లేదా వదిలేయాల్సి వచ్చింది…

 

అంతర్జాతీయ కీర్తి… అపురూప ఘట్టాలు (The Global Stage)

ప్రపంచ వేదికపై…: 1966లో ఐక్యరాజ్య సమితి (UN) వేదికపై కచేరీ ఇవ్వడం ఒక భారతీయ కళాకారిణికి దక్కిన అరుదైన గౌరవం … ఈ ప్రదర్శన కోసం జరిగిన సన్నాహాలు, ఆందోళనలు, విజయం – ఇవి గొప్ప ఉద్వేగభరితమైన దృశ్యాలుగా ఉంటాయి ఆమె కథను నిజాయితీగా తీయగలిగితే…

విశ్వ గురువులు…: గాంధీ,  నెహ్రూ, బాల సరస్వతి వంటి అప్పటి ప్రముఖుల ప్రశంసలు పొందింది…

వినయం, దాతృత్వం… (The Legacy)

  • వినయమూర్తి…: గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ఆమె అత్యంత వినయంగా (డౌన్ టు ఎర్త్) ఉండేది… ఆమె జీవితమంతా సంగీతానికి, ఆధ్యాత్మికతకు అంకితం చేసింది… ఆమె బయోపిక్‌లో ఈ కేరక్టరైజేషన్‌లో జాగ్రత్తలు అవసరం…

  • దాతృత్వం…: కచేరీల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలను స్వచ్ఛంద సంస్థలకు, ఆలయాలకు, విద్యా సంస్థలకు విరాళంగా ఇవ్వడం ఆమె గొప్పదనం… ఈ నిస్వార్థ వైఖరి నేటి తరానికి ఒక గొప్ప సందేశం…

  • భారత రత్న…: 1998లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అందుకోవడం మరో గ్రేట్‌నెస్… ఈ గౌరవం పొందిన తొలి సంగీత విద్వాంసురాలు ఆమె…


సుబ్బులక్ష్మి బయోపిక్ కేవలం ఓ సంగీత చిత్రం కాకుండా, సామాజిక నిరాదరణను అధిగమించిన ఒక మహిళ జీవిత పోరాటం, ప్రేమ (సదాశివంతో), త్యాగం (దాతృత్వం), విశ్వ ఖ్యాతిని అందుకున్న ఒక గొప్ప గాయని కథగా మారుతుంది…

సదాశివంతో పెళ్లిపై ఏమిటీ వివాదం?

సుబ్బులక్ష్మి సదాశివంను కలిసినప్పుడు ఆమె వయసు దాదాపు 19 ఏళ్లు…  ఆయనకు అప్పటికే పెళ్లై, మొదటి భార్య అపితకుచంబాల్, ఇద్దరు కుమార్తెలు (రాధ, విజయ) ఉన్నారు… సదాశివం వయసు సుమారు 33 ఏళ్లు అప్పటికి…

ఆ కాలంలో, మొదటి భార్య జీవించి ఉండగానే, ఒక యువ గాయనితో సంబంధం పెట్టుకోవడం, ఆమెను తన ఇంటికి చేర్చుకోవడం తీవ్రమైన సామాజిక నిందకు దారితీసింది… సుబ్బులక్ష్మి ‘దేవదాసి’ కుటుంబంలో జన్మించింది… సదాశివం బ్రాహ్మణుడు…

సుబ్బులక్ష్మి సదాశివంను పెళ్లి చేసుకోవడం ద్వారా తన సంగీత జీవితానికి ఒక ‘సనాతన’ ముద్రను వేసుకోవడానికి ప్రయత్నించిందనే విమర్శల్ని ఎదుర్కొంది.., అంటే, తన దేవదాసి మూలాలను, దానితో ముడిపడిన అప్పటి సామాజిక నిందను దాటవేయడానికి ఇలా ప్రయత్నించిందని అప్పటి కొందరు ఆధునిక విశ్లేషకులు (ఉదాహరణకు, కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ) విమర్శించారు… ఆమె తన వస్త్రధారణ, జీవనశైలిలో బ్రాహ్మణ సంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా అలవరుచుకుందనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేశారు… నిజానికి అందులో తప్పేమీ లేదు… అది ఆమె ఇష్టం…




మొదటి భార్య మరణం చుట్టూ పుకార్లు

సుబ్బులక్ష్మి సదాశివం జీవితంలోకి వచ్చిన కొద్ది కాలానికే, 1938లో ఆయన మొదటి భార్య అపితకుచంబాల్ మరణించింది… ఈ మరణం విషయంలో రకరకాల పుకార్లు మద్రాస్ సామాజిక వర్గాలలో వ్యాపించాయి… ఈ పుకార్లు సదాశివం- సుబ్బులక్ష్మి సంబంధంపై మరింత నలుపు రంగు చల్లి, వారి వివాహాన్ని మరింత వివాదాస్పదం చేశాయి…

సుబ్బులక్ష్మి తల్లితో సంఘర్షణ

సుబ్బులక్ష్మి తల్లి షణ్ముకవడివు… తన కుమార్తెను ఒక సంపన్న చెట్టియార్ ప్రాపకానికి అప్పగించాలని అనుకుంది… దీనిని సుబ్బులక్ష్మి వ్యతిరేకించి, ఇంటి నుండి పారిపోయి సదాశివం వద్దకు వచ్చింది… ఈ సంఘటన వల్ల ఆమె తల్లి, సదాశివం మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది… తన కుమార్తె తనను వదిలి వెళ్లడం, సదాశివం ఆమెను తన ఆర్థిక ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే అభిప్రాయం షణ్ముకవడివుకు కలిగింది… ఇది సుబ్బులక్ష్మి జీవితంలో ఒక భావోద్వేగ సంఘర్షణ అంశం…

సదాశివం నియంత్రణ (Controlling Nature)

కొంతమంది విమర్శకులు సదాశివంను “నియంత్రించే బ్రాహ్మణ భర్త”గా అభివర్ణించారు… సుబ్బులక్ష్మి  ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనా, ఆమె తన భర్తకు పూర్తిగా లొంగిపోయి, ఆయన నిర్ణయాల ప్రకారమే నడిచిందనీ, తన స్వంత అభిప్రాయాలను, స్వతంత్రతను పెద్దగా వ్యక్తపరచలేదని విమర్శ…

  • ఉదాహరణ…: ఆయన బలవంతం వల్లే సుబ్బులక్ష్మి సినిమాలకు దూరమై, కేవలం భక్తి గీతాలు, దాతృత్వ కచేరీలకు పరిమితమయ్యారని చెబుతారు…

ఈ అంశాలన్నీ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు నాటకీయతను, లోతును అందించడానికి చాలా ముఖ్యమైనవి… ఆమె గొప్ప సంగీత ప్రయాణం వెనుక, వ్యక్తిగత స్థాయిలో ఈ సవాళ్లు, విమర్శలు, అంతర్గత పోరాటాలు కూడా దాగి ఉన్నాయి…



చివరగా…. గాంధీజీ 78వ జన్మదినం… 1947 సంవత్సరం… గాంధీకి ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే అపారమైన అభిమానం… ఆమె స్వరం, ఆమె భక్తికి ఆయన పరవశించిపోయేవాడు… తన పుట్టినరోజు సందర్భంగా సుబ్బులక్ష్మి తన అభిమాన భజనల్లో ఒకటైన “హరి తుమ్ హరో” (मीराबाई భజన)ను పాడి వినిపించాలని కోరాడు…

సుబ్బులక్ష్మి ఆ భజనను అంతకుముందు ఎప్పుడూ పాడలేదు… అది ఆమె రెపర్టరీలో (తరచుగా పాడే పాటల జాబితాలో) లేదు… ఆ భజనను తక్కువ సమయంలో నేర్చుకుని, గాంధీజీ ముందు పాడగలననే ధైర్యం ఆమెకు రాలేదు… పరిపూర్ణతకు ఆమె ఇచ్చే విలువ అది… సో, నేర్చుకోకుండా పాడటానికి ఆమె నిరాకరించి గాంధీ కోరికను అంగీకరించలేదు…

ఆమె తన నిస్సహాయతను గాంధీకి కబురు పంపింది… సుబ్బులక్ష్మి జవాబు విన్న తర్వాత, గాంధీ స్వయంగా ఆమెకు ఒక చిన్న నోట్ (లేఖ) పంపించాడు… తన కోరికను నిరాకరించినా సరే ఆయన ఆమెను విమర్శించలేదు… నువ్వు పాడలేకపోయినా సరే నీ ఆధ్యాత్మిక భక్తి (Devotion), ఆత్మశుద్ధి నచ్చాయన్నాడు…

గాంధీ వంటి వ్యక్తి కోరినా, తను ఆ భజనను పరిపూర్ణంగా నేర్చుకోలేదని చెప్పి సుబ్బులక్ష్మి నిరాకరించడం ఆమెకున్న గొప్ప వినయాన్ని, కళాపట్ల చిత్తశుద్ధిని సూచిస్తుంది… గాంధీ ఆ వినయాన్ని, చిత్తశుద్ధిని పాట కన్నా ఎక్కువ విలువైనవిగా భావించాడు…

తరువాత ఆమె తమిళ పండిట్ రాజగోపాలాచారి (రాజాజీ) సహాయంతో ఆ భజనను నేర్చుకుని, స్వయంగా రికార్డ్ చేసి గాంధీకి పంపించింది… ఆ రికార్డింగ్‌ను విన్న తర్వాతే గాంధీ మరణించాడు… బయోపిక్‌లో ఇది కీలక సీన్ అయ్యే చాన్స్ ఉంది… కాకపోతే ఆమె పట్ల దేశం ప్రదర్శించిన గౌరవాన్ని, ఆమె వినయశీలతను సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితేనే…



సాయిపల్లవి

బయోపిక్ సవాళ్లు

ఆమె 88 సంవత్సరాలు జీవించింది… 8 ఏళ్లకే రంగప్రవేశం చేసింది.., జీవితాంతం పాడుతూనే ఉంది… ఈ సుదీర్ఘ ప్రయాణంలో ముఖ్య ఘట్టాలన్నీ రెండున్నర గంటల సినిమా కథలోకి కుదించడం కష్టం…

ఆమె తల్లి దేవదాసి వృత్తి, సదాశివంతో ప్రేమ- వివాదం, సినీరంగ ప్రవేశం (మీరా), సంగీతం కోసం సినిమా వదిలివేయడం, UN ప్రదర్శన, గాంధీతో బంధం, దాతృత్వం… ఇన్ని కోణాలు ఒకే సినిమాలో ఇమడ్చడం సవాలే…

ఆమె సంగీత విద్వాంసురాలు కాబట్టి, సినిమాలో పాటలు, కచేరీ దృశ్యాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది… ఆ పాటల మాధుర్యాన్ని వర్తమాన సంగీత దర్శకుల్లో ఎవరు ఆసక్తికరంగా ప్రజెంట్ చేయగలరనేదీ సవాలే… పైగా సంగీతానికే ప్రాధాన్యం ఇస్తే కథలో వేగం తగ్గే ప్రమాదం ఉంది…

  • చివరగా…….. సాయిపల్లవి ఈ పాత్రను సమర్థంగా చేయగలదు, సందేహం లేదు… ప్రచారంలో ఉన్న బయోపిక్ నిజంగానే తెరరూపం ధరిస్తే… ఇప్పటికే వేల కోట్ల రామాయణం సినిమాలో సీతగా దక్కించుకున్న ఫేమ్ సుబ్బులక్ష్మి పాత్రతో మరింత వెలిగిపోవడం ఖాయం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…
  • ఆమె కథలో బోలెడు నాటకీయత… కానీ ‘క్రియేటివ్ ఫ్రీడమ్‌’పైనే భయం…
  • ప్చ్… చిరంజీవి, రాఘవేంద్రరావు, విజయశాంతి లెవల్‌లో ఆడలేదు…
  • కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions