.
సైబర్ క్రైమ్… ఏదో చదువు లేనివాళ్లు, ఎక్కువగా తెలివి లేనివాళ్లే ఈ మోసాలకు గురవుతారనేది అబద్ధం… బాగా తెలివితేటలున్నవాళ్లు, బాగా చదువుకున్నవాళ్లు, మంచి పోస్టుల్లో ఉన్నవాళ్లు, పది మందికీ జాగ్రత్తలు చెప్పగలిగేవాళ్లే సైబర్ నేరగాళ్లకు త్వరగా దొరికిపోతున్నారు… ప్రత్యేకించి డిజిటల్ అరెస్టులు అనబడే సైబర్ నేరం ఇలాంటిదే…
సైబర్ నేర ముఠాలు ఎంత తెలివిగా, ఎంత పకడ్బందీగా ట్రాప్ చేస్తున్నాయో చదివేకొద్దీ, తెలిసేకొద్దీ నిజంగా భయం పుడుతోంది… ఈమధ్య తమ కుటుంబసభ్యుడూ ఇలాంటి నేరగాళ్ల చేతుల్లో పడబోయినట్టు నటుడు నాగార్జున కూడా వెల్లడించాడు తెలుసు కదా… పైసా పైసా కూడబెట్టుకుని, కోట్లలో నేరగాళ్ల చేతుల్లో పోస్తున్నాం… ఆస్తులు అమ్మించి, బ్యాంకు డిపాజిట్లు ప్రిమెచ్యూర్ విత్‌డ్రాలు చేయించి మరీ డబ్బులు దోచుకుంటున్నారు…
Ads
రీసెంట్ ఉదాహరణ… భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మభూషణ్ టి రామసామి… ఈ వార్తను మీడియా వివరంగానే కవర్ చేసింది… కానీ అవి చదువుతుంటే అందులో ఒక పాయింట్ దగ్గర చూపు అలా నిలిచిపోయింది విభ్రమతో…
ముందుగా ఆ నేరం గురించి చెప్పుకుందాం… ఆయన చెన్నైలో ఉంటాడు, వయస్సు 77 ఏళ్లు… అంత చదువుకున్నవాడు, మంచి పోస్టులో పనిచేసి రిటైరయినవాడు… తొలుత ఆయనకు వీడియో కాల్ చేసిన నేరగాళ్లు ఢిల్లీ పోలీస్ యూనిఫాంలో కనిపించారు తనకు… పక్కగా క్రియేట్ చేసిన ఫేక్ ఎఫ్ఐఆర్ కాపీలను, ప్రత్యేకంగా పోలీస్ లోగోలు, ముద్రలు చూపించడంతో ఆయన అడ్డంగా పడిపోయాడు ట్రాపులో, నిజమే అనుకుని…
- ఎంత పర్‌ఫెక్ట్ స్క్రిప్టు, యాక్షన్ అంటే… నేరగాళ్లు ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం, మీరు ఫిక్సయిపోయారు అని నమ్మించారు… అలా మాట్లాడారు… నిజమైన పోలీసులకు కూడా ఇలా మాట్లాడటం చేతకాదేమో… దశల వారీగా ఆయనతో 57 లక్షల్ని ఏవేవో ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు… అవన్నీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్‌డ్రా చేయించి మరీ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నవే…
మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్టులో ఉన్నారు, ఇప్పుడు మీరు కట్టే డబ్బులు కేసు నుంచి బయటపడ్డాక మీకు తిరిగి వస్తాయి అని నమ్మబలికినవే… మీ పేరిట కొరియర్‌లో డ్రగ్స్ వచ్చాయనీ, మీరు నార్కొటిక్ కేసులో ఇరుక్కున్నారనీ, మీ వాళ్ల మీద కేసు బుకయిందనో చెబుతుంటారు కదా… మరి వీళ్లు ఏ ఫేకులు చెప్పి ఆయన్ని బెదిరించారో మరి…
57 లక్షలు చెల్లించాక, ఏకంగా 2.43 కోట్లుకు టెండర్ పెట్టారు… అక్కడ ఆయనకు అనుమానం వచ్చింది బహుశా ఇది సైబర్ నేరగాళ్ల పనేమో అని… అప్పుడు పోలీసులను ఆశ్రయించాడు… గ్రేటర్ చెన్నై పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోంది… అక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ సైబర్ పోలీసులు బోలెడు జాగ్రత్తలు చెబుతున్నారు గానీ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో కోట్లు కొల్లగొడుతూనే ఉన్నారు…
- సైబర్ విభాగంలో పనిచేసే ఓ అధికారి మొన్న చెబుతున్నాడు… ‘‘మీకు తెలిసినవాళ్లే వీడియో కాల్ చేస్తారు, వేరే ఎవ్వరైనా సరే మామూలు కాల్స్ మాత్రమే చేస్తారు, అంతేతప్ప మీకు తెలియనివాళ్లు, కొత్తవాళ్లు మీకు వీడియో కాల్స్ ఎందుకు చేస్తారు..? డిజిటల్ అరెస్టు అంటేనే ఫేక్ కదా.., పైగా ఎవరినైనా, ఎంత పెద్ద కేసైనా సరే పోలీసులు భౌతికంగా అరెస్టు చేయాల్సిందే, దానికీ బోలెడంత తంతు ఉంటుంది… మరెందుకు అన్‌నోన్ వీడియో కాల్ రాగానే రెస్పాండ్ అవుతున్నారు..?’’
ఎవరీ పద్మభూషణ్ రామసామి..!
శాస్త్రవేత్త నుంచి పౌర సేవకుడిగా మారిన రామసామి… భారత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పనిచేసిన కార్యదర్శులలో ఒకరు… ఇదే సమయంలో… చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీ.ఎల్.ఆర్.ఐ) డైరెక్టర్ గా, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీ.ఎస్.ఐ.ఆర్) డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు… ఈ క్రమంలో.. అనేక సైన్స్ అవార్డులతోపాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నాడు…
- ముందు చెప్పుకున్నాం కదా… ఈ నేరగాథలో ఓచోట విభ్రమ కలిగించే అంశం అని… అదేమిటంటే..? ఆయనకు జీవితకాల పురస్కారం ప్రకటించింది ఏదో సంస్థ… అది తీసుకోవడానికి తిరుచ్చి వెళ్లాల్సి ఉంది… తనేమో డిజిటల్ అరెస్టులో ఉన్నాడాయె… నేరగాళ్లను బామాలి, బతిమాలి ఒప్పించుకుని, వెళ్లి ఆ పురస్కారం తెచ్చుకున్నాడు… ప్చ్, ఇంకా ఇంకా ఈ సైబర్ మోసాలు ఏ రేంజుకు పోతాయో..!!
Share this Article