Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంతుడు ధన్యుడు… వందలేళ్ల ఆదివాసీ చరిత్ర ‘చెక్కబడుతోంది’…

December 19, 2025 by M S R

.

మొన్న ఎక్కడో ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘నేను ఈ ఎములాడ గుళ్లోనే పెళ్లి చేసుకున్నా, మస్తు డెవలప్ చేస్తానన్న కేసీయార్ మళ్లీ పత్తాకు రాలేదు, రూపాయి ఇవ్వలేదు, కానీ మేం 100, 150 కోట్లతో టెంపుల్ సిటీగా చేస్తున్నాం, గుడిని పునర్నిర్మిస్తున్నాం’ అన్నాడు…

తన పెళ్లి కూడా అదే గుళ్లో జరిగిందని చెబుతుంటాడు తరచూ… ఇద్దరి పెళ్లిళ్లూ అక్కడే, కానీ గుడి అభివృద్ధిపై శ్రద్ధ విషయంలో ఎంత తేడా…?! నాకు వేములవాడతో ఓ బంధం ఉందీ అనేవాడు కేసీయార్ తరచూ సభల్లో… కానీ పైసా విదిల్చింది లేదు… ఇది రియాలిటీ… మాటల దొర కదా…

Ads

కేసీయార్ ఒక్క తమ వైష్ణవ యాదగిరిగుట్టను మరో తిరుపతిలా చేయాలని వందల కోట్లతో పునర్నిర్మించాడు సరే… మిగతా ఏ గుడినీ పట్టించుకోలేదనే మాట నిజం… ఏ గుడికీ రూపాయి ఇవ్వలేదు సరికదా, భద్రాచలం రాములవారి పెళ్లికి పాలకుడు  ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లే ఓ సంప్రదాయాన్ని భగ్నం చేశాడు… అదీ వైష్ణవాలయం ఐనాసరే…

(మెస్సీ హైదరాబాద్‌కు వస్తే రేవంత్ రెడ్డి తన మనమడిని తీసుకుపోయి, మెస్సీతో ఆడించాడు అని ఆడిపోసుకునే పింక్ క్యాంపు భద్రాచలానికి కేసీయార్ మనమడు ముత్యాల తలంబ్రాలు తీసుకుపోవడం ఏమిటని మాత్రం ఆత్మవిమర్శ చేసుకోరు… అది వేరే కథ…)

  • ఆది శ్రీనివాస్ ‘పెళ్లిళ్ల కథ’ చదివాక… ఓ ప్రశ్న తటాలున తలెత్తింది… ‘‘అవునూ, మేడారంలో ఏదో దారుణం జరిగిపోతోంది, ఆదివాసీల సంప్రదాయాల్ని, నమ్మకాల్ని, మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు… హిందూ గుళ్లల్లోని ఆగమాన్ని, అర్చన రీతుల్ని, అగమాగం రుద్దేస్తున్నారని బీఆర్ఎస్ గాయిగత్తర చేసింది కదా… నిజానికి అక్కడ ఏం జరుగుతోంది’’ అనే ప్రశ్న మొదలైంది… కాస్త ఆరా తీస్తే తెలిసిన విషయాలతో నిజంగా రేవంత్ రెడ్డిని, సహచర మంత్రి సీతక్కను మెచ్చుకోవచ్చు...

గ్రామ దేవతల గుళ్లల్లో కూడా హిందూ రొటీన్ ఆగమాన్ని ప్రవేశపెట్టి… స్థానిక విశిష్ట, విభిన్న అర్చన రీతుల్ని దెబ్బతీస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం… (ఉదాహరణకు, కొమురవెళ్లిలో మైలప్రోలు, పట్నం అనే భిన్నమైన అర్చన రీతులు ఉంటాయి… అవి క్రమేపీ కనుమరుగవుతూ అవే ఆగమ అభిషేకాలు, కల్యాణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి… అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అయితే ఏకంగా మూల విరాట్టునే తీసేసి, వేరే కొత్త శిలావిగ్రహం పెడదామని అనుకున్నాడు… )

medaram

నిజానికి మేడారం సమ్మక్క- సారలమ్మ గద్దెలు అక్కడి ఆదివాసీల దేవతలు… కాకతీయ పాలకులపై తిరగబడి అసువులు బాసిన యోధులే దేవతలయ్యారు… అక్కడి పూజా పద్దతులు వేరు… ఓన్లీ గద్దెలు, రెండేళ్లకోసారి జాతర, ఆ సమయంలో అడవి నుంచి తీసుకొచ్చే కుంకుమ భరిణెలే దేవతలు… అసలు ఓ గుడి అనే స్వరూపం ఉండదు… బెల్లం ప్రసాదాలు… ప్రదక్షిణలు… అక్కడే పుట్టు వెంట్రుకలు… బలులు, మద్యపానం, జంపన్నవాగు స్నానాలు…

అక్కడ ఆ ఆదివాసీ మనోభావాలకు విరుద్ధంగా ఆ దేవతలకు ఏవో విగ్రహరూపాలు కల్పించటానికి నానా ప్రయత్నాలూ జరిగాయి… ఆదివాసీలు ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టి, తమ సాంస్కృతిక, తమ ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని రక్షించుకున్నారు… ఆమధ్య నమస్తే తెలంగాణ, అనగా బీఆర్ఎస్ క్యాంపు ఓ గాయిగత్తర లేపాలని యత్నించింది… ఆదివాసీలను రెచ్చగొట్టడం… తనకు అలవాటైన సహజ ఉసిగొల్పే రీతిలో…

(ఏ కాకతీయులపై ఆ తల్లులు పోరాడి అమర దేవతలయ్యారో, అదే కాకతీయ కళాతోరణాన్ని పోలే స్వాగత తోరణాలు నిర్మిస్తున్నారనే ప్రచారానికి దిగింది బీఆర్ఎస్ క్యాంపు...)

హిందూ ధర్మాన్ని రుద్దుతున్నారు, అన్యాయం జరిగిపోతోంది, సగటు హిందూ దేవాలయ ఛాయల్ని రుద్దుతున్నారు అని గోల… దాన్ని కౌంటర్ చేయడానికి ఏకంగా రేవంత్ రెడ్డే ఓసారి సందర్శించాడు… నన్ను నమ్మండి, ఆదివాసీల మత, మనోభావాలకు కించిత్ నష్టం జరగనివ్వను, పైగా వాటిని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తాం అన్నాడు…

(సరే, అక్కడ పనుల కంట్రాక్టుల విషయంలో పొంగులేని వర్సెస్ కొండా సురేఖ పంచాయితీ అనేది ఓ క్షుద్ర తగాదా)… దాదాపు 200 కోట్ల పైచిలుకు నిధుల్ని ఖర్చు చేసి గద్దెల చుట్టూ శిలాస్థంభాలను నిర్మిస్తూ… గిరిజన కుంభమేళాగా చెప్పబడే ప్రతి జాతరకు కోటిమంది దాకా వచ్చే భక్తజనం సాఫీగా దర్శనాలు చేసుకునేలా డెవలప్ చేస్తున్నారు… అవసరం కూడా… సీతక్క స్వయంగా ఆదివాసీ మహిళ… ఆమెను మించి తమ మనోభావాలకు రక్ష ఎవరు..? అందుకే పనుల పర్యవేక్షణ ఆమెకే అప్పగించాడు రేవంత్ రెడ్డి… తన జిల్లా కూడా..!

పూజారులతో మాట్లాడాడు… సందేహాలు తీర్చాడు… ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదంటే… అపూర్వమైన శ్రద్ధ… ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు అద్దం పట్టేలా… స్వాగత తోరణాలు, గద్దెలు, స్థంభాలు వేగంగా ఏర్పాటవుతున్నాయి… అసలు అదికాదు చెప్పుకోవాల్సింది… తల్లుల చరిత్రను ప్రతిబింబించే ముద్రలు చెక్కుతూ… తాళపత్ర గ్రంథాల్లో ఉన్న తల్లుల 930 ఏళ్ల చరిత్రను లిఖిస్తున్నారు ఆ స్థంభాలపై, తోరణాలపై… దాదాపు ఏడు వేల  ముద్రలు…

సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపాలైన పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, ఇతర అటవీ జంతువుల ఛాయలు… కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపాలుగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండిచక్రాలు, అడ్డ నిలువు నామాలకు (అద్వైతం) చోటు కల్పిస్తున్నారు…

తల్లులు కుటుంబానికి చెందిన 250 కోయల ఇంటిపేర్లు, మూలాలను కూడా లిఖించడం అంటే ఆ చరిత్రకు శాశ్వతత్వం కల్పించడమే... ఎక్సలెంట్... సీఎం రేవంత్ రెడ్డీ... ఈసారి జాతరకు వెళ్లు... తల్లులకు వందనం చేసుకో... పర్లేదు, మనమడినీ తీసుకెళ్లు... సమ్మక్క- సారలమ్మ జాతరకు అద్దిన ఆధునిక హంగులు, తరాల చరిత్ర నిక్షిప్తాన్నీ చూడు... ఆదివాసీలు నీకు నీరాజనం పలుకుతారు..!!



  • ఒక జాతి మూలాలను కాపాడటం అంటే కేవలం నిధులు ఇవ్వడం మాత్రమే కాదు, వారి అస్తిత్వాన్ని (Identity) గౌరవించడం కూడా…


“నిన్నటి వరకు మేడారం అంటే కేవలం కోటి మంది భక్తులు, బెల్లం బంగారం… కానీ రేపటి మేడారం… ఆదివాసీల ఘన చరిత్రకు శిలా సాక్ష్యం… మాటల దొరలు చేయలేని పనిని, చేతల మనుషులు చేసి చూపిస్తున్నారు… రేవంత్ రెడ్డి, సీతక్క చొరవ, ప్రయాస మేడారం చరిత్రలో నిలిచిపోతుంది…”

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంతుడు ధన్యుడు… వందలేళ్ల ఆదివాసీ చరిత్ర ‘చెక్కబడుతోంది’…
  • ఎడ్యుకేటెడ్, రిటైర్డ్, ఇంగ్లిషు తెలిసినవాళ్లే… ఈజీ సైబర్ టార్గెట్లు..!
  • ఒక బ్రహ్మపుత్రుడు… ఒక బ్రహ్మపుత్రిక… వెరసి ఓ బ్రహ్మపదార్థం సినిమా..
  • అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
  • పాకీజా, శ్యామల, జయవాహిని… రంగులు వెలిసిన జీవితాలు…
  • రాముడి తమ్ముడు శతృఘ్నుడికీ విడిగా ఓ కథ ఉంది రామాయణంలో…!!
  • మోహన్‌లాల్ తోపు ఐతేనేం… ఆమె కడిగేసింది… తెలుగులో ఊహించగలమా…
  • ఉన్నత శిఖరాలెక్కి… అక్కణ్నుంచి అమాంతంగా చీకటి లోయల్లోకి…!!
  • నితిన్ నబీన్..! ఈ చిత్రగుప్తుడి వారసుడి చేతిలో బీజేపీ భవిష్యత్తు..!!
  • పవర్‌లో ఉంటే పవిత్ర జంపింగ్స్-! ప్రతిపక్షంలో ఉంటే అదే అనైతికమట…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions