.
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ…. ఒక్కసారి తెగిన పతంగుల బాధ కూడా వినండి…
అందాల పోటీలు నిర్వహించారు, సూపర్… గ్లోబల్ సమ్మిట్ పెట్టారు, సూపర్… మెస్సీ షో ఏర్పాటు చేశారు, సూపర్… అన్నీ గ్రాండ్ సక్సెస్… హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి మీ ప్రభుత్వం చేస్తున్న కృషి సూపర్…
Ads
ఇప్పుడు మరో పెద్ద ఈవెంట్ చేయబోతున్నారు మీరు… రాబోయే 13, 14, 15 తేదీల్లో, అంటే సంక్రాంతి పర్వదినాల్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు పరేడ్ గ్రౌండ్స్‌లో… ప్రకటన కూడా జారీ చేశారు…, 13, 14 తేదీల్లో డ్రోన్ ఫెస్టివల్… 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్…
2025 ఈవెంటులో స్వీట్ ఫెస్టివల్ కమ్ ఫుడ్ కార్నివాల్ కూడా పెట్టారు… ఈసారి కూడా ఉంటుందా..? సరే, ఇన్ని ఈవెంట్లు చేస్తున్నారు కదా మీరు… కానీ 2025 ఈవెంటు కోసం టెండర్లు వేసి పనిచేసిన కాంట్రాక్టర్లకు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు, సంస్థలకు ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు…
అది మీ ప్రభుత్వానికి అప్రతిష్ట కాదా..? ఈ బకాయిల యవ్వారం మీకు శోభనిస్తుందా..? బకాయిలు ఇక ఎగ్గొట్టబడినట్టేనా..? ఏమో, ఇప్పుడు కూడా డబ్బులిస్తామో లేదో తెలియదు, అన్నింటికీ సిద్ధపడే ఈవెంట్ టెండర్లలో పార్టిసిపేట్ చేయండి అని పరోక్షంగా మీ ప్రభుత్వమే చెబుతున్నట్టు భావించాలా..? ఇంకొన్ని వివరాల్లోకి వెళ్తే…

2025 ఈవెంట్ టైములో టూరిజం సెక్రెటరీ స్మితా సబర్వాల్… టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు… ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా దాదాపు 60 మంది కైట్ ఫ్లయర్లు వచ్చారు, రకరకాల ఆకారాల పతంగులు ఎగురవేశారు, సందడి చేశారు… మంచి మీడియా కవరేజ్ కూడా వచ్చింది…
వాళ్లను తెలంగాణలోని ఇతర పర్యాటక ప్రదేశాలకు కూడా తిప్పారు… కొంత అదనపు ప్రచారం (అచ్చం మొన్నటి అందాల పోటీల కంటెస్టెంట్లను కూడా వివిధ ప్రదేశాలకు తిప్పినట్టుగా…) సరే, కైట్ ఫెస్టివల్ కాగానే, ప్రపంచ సుందరి పోటీలకు ముందు కారణాలు ఏవైతేనేం స్మితను తప్పించేశారు… ఎందుకనేది ఇక్కడ అప్రస్తుతం… తరువాత జయేష్ రంజన్‌ను పట్టుకొచ్చారు ఈ శాఖ ఇన్‌చార్జిగా…
పాత బిల్లులు ఈరోజుకూ క్లియర్ కాకపోవడంతో వెండర్లు లబోదిబోమంటున్నారు… మంత్రి దగ్గరకు వెళ్లి అడిగినా ఏ స్పందనా లేదు… అప్పటి సెక్రెటరీ లేకపోవడంతో ఇప్పటి సెక్రెటరీ నాకేం సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నారు… ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియక వెండర్లు నెత్తికి చేతులు పెట్టుకున్నారు… వీళ్లలో చిన్న చిన్నవాళ్లు కూడా ఉన్నారు…
ఇప్పుేడు కూడా ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయ్‌లాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ తదితర దేశాల నుంచి సుమారు 50 మందికి పైగా అంతర్జాతీయ పతంగుల ఆటగాళ్లు (కైట్ ఫ్లైయర్స్) పాల్గొననున్నారని చెబుతున్నారు…
తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్ (Tamil Nadu, Kerala, Haryana, Andhra Pradesh) తదితర రాష్ట్రాల నుంచి సుమారు 60 మందికి పైగా కైట్స్ క్లబ్ సభ్యులు, పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గొంటారని అంటున్నారు… ఆ మూడు రోజులు పరేడ్ గ్రౌండ్స్, గండిపేట పండుగ సందడి నెలకొంటుంది… గుడ్… వెండర్లకు కూడా ఆనందమే…
కానీ..? ఆ పనులు చేసిన పతంగుల దారాలు తెంపేసి… కొత్త పతంగులను ఆహ్వానించడం అంటే అది ఎవరికి అవమానకరం..? ఈ బకాయిల ఎగవేతకు ఎవరు జవాబుదారీ..? సీఎం సార్, ప్రభుత్వం ఇజ్జత్ పోకుండా మీరే ఓసారి లుక్కేయండి… చిన్న పతంగులను చింపేయకండి..!!
Share this Article