.
రేవంత్ రెడ్డి విసిరిన బాణాలు కేసీయార్ క్యాంపుకి బలంగా తగిలాయి… కలకలం మొదలైంది… కలవరమూ మొదలైంది… వివరంగా చెప్పుకుందాం…
‘‘కేటీయార్ వర్కింగ్ ప్రసిడెంటుగా ఫెయిల్యూర్… అసెంబ్లీ ఎన్నికలు ఫెయిల్, ఎంపీ ఎన్నికలు ఫెయిల్, ఉపఎన్నికలు ఫెయిల్, పంచాయతీ ఎన్నికలు ఫెయిల్… మరోవైపు హరీష్ రావు ఇక పార్టీని కేటీయార్ చేతుల్లో నుంచి లాక్కోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాడు… కేసీయార్ రాజకీయంగా రిటైరయినట్టేనని చివరకు గజ్వెల్ ప్రజలు కూడా తీర్మానించుకుని కాంగ్రెస్ వైపు మళ్లారు…’’ ఇదే కదా రేవంత్ రెడ్డి చెప్పింది…
Ads
ఇదేమీ పొలిటికల్ ర్యాగింగు ఏమీ కాదు… ఉన్నవే చెబుతూ పోయాడు… మరి కేటీయార్ ఏమన్నాడంటే… ‘‘ఇక కేసీయార్ జనంలోకి వస్తాడు, తనే పార్ఠీకి దిశానిర్దేశం చేస్తాడు’… ఇదీ నిన్న స్వయంగా చెప్పిన మాట…
- అంటే ఒకరకంగా ఇది వర్కింగ్ ప్రసిడెంటుగా తన పనితీరు పట్ల కేసీయార్ తీవ్ర అసంతృప్తిని, జనం తన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడం లేదని తనే చెబుతున్నట్టు..! ఇక తనపై ఆశలు వదిలేసుకుని కేసీయారే తప్పనిసరై పార్టీని కాపాడుకోవడానికి జనంలోకి వస్తున్నట్టు, ఇకపై తనే పార్టీకి దిశానిర్దేశం చేస్తాడని అంగీకరిస్తున్నట్టు..!!
రాష్ట్ర రాజకీయాల్లో దీనికి విశేష ప్రాధాన్యం ఉంది, ఎందుకో కాస్త వివరంగా చెప్పుకోవాలి… వారసత్వాన్ని కేటీయార్‌కు అప్పగించేసి శేషజీవితం రిలాక్స్‌డ్‌గా గడిపేయాలని అనుకున్నాడు కేసీయార్… గతంలో మోడీని కూడా మావాడిని ముఖ్యమంత్రిని చేస్తాను, ఆశీర్వదించండి అని అడిగాడు కదా…

కానీ ఏం జరిగింది..? ఈ వారసత్వ పంచాయితీల్లోనే సాక్షాత్తూ తన సోదరి కవితను వదిలేసుకున్నాడు… 10 మంది ఎమ్మెల్యేలు పోయారు, హైదరాబాద్ మేయర్ పోయింది… పార్టీపరంగా హరీష్ రావు కూడా చేదోడువాదోడుగా ఉన్నా సరే కంటోన్మెంట్ పోయింది, జుబ్లీ హిల్స్ పోయింది… చివరకు తన చేతుల్లో నుంచి పార్టీయే హరీష్ రావు చేతుల్లోకి పోయే దురవస్థ…

పంచాయతీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు… కేడర్‌లో జోష్ లేదు… కేటీయార్ వద్ద రాజకీయ వ్యూహాలు లేవు… రేవంత్ రెడ్డి చెప్పినట్టు 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 87 స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచులు గెలిచారు… కేసీయార్ గజ్వెల్ సహా… (18 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గనుక సరిగ్గా పట్టించుకుంటే బీఆర్ఎస్ ఓటముల కథ మరింత పాకాన పడేది)…

వెరసి వర్కింగ్ ప్రసిడెంటుగా ఓ ఫెయిల్యూర్ అనే ముద్ర… నిన్న తనే పదే పదే చెప్పుకున్నాడు… నేను ఐరన్ లెగ్ కాదు, ఫెయిల్యూర్ కాదు… రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఫెయిల్, 7 ఉపఎన్నికల్ని కోల్పోయాడని చెప్పాడు… మరి దుబ్బాక, హుజురాబాద్ ఓటముల మాటేమిటి..? ఎన్నో అనుకూలతలు ఉన్నా జుబ్లీ హిల్స్ ఓటమి చెప్పిందేమిటి..? సో, ఎన్ని చెప్పుకున్నా సరే, కేసీయార్‌కు అర్థమైంది, జనానికీ అర్థమైంది, కేటీయార్‌తో ఇక పనికాదని..!!

కేసీయార్ జనంలోకి వస్తాడు సరే… 80 వేల పుస్తకాలు చదివిన తనకు తెలియనిదేమీ కాదు… జనంలో లేని నాయకుడు జననేత కాదు… జనంపై కోపగించుకుంటే జనం కూడా సదరు నాయకత్వంపై కోపగిస్తారు… ప్రజాజీవితంలో జనమే కదా అల్టిమేట్.., మీ ఖర్మ, అనుభవించండి అనే మాటలతో జనానికి దూరంగా ఉంటే… ఆటోమేటిక్‌గా జనం దూరమైపోతారు… బీఆర్ఎస్ వైఫల్యాలకు, భవిష్యత్తు మనుగడ సందేహాలకు కారణమిదే…

నిర్ణీత కాలంలో అటెండెన్స్ లేకపోతే అనర్హతకు గురవుతానని ఓసారి వచ్చాడు అసెంబ్లీకి… పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఓసారి వచ్చాడు… ఓసారి కాలు ఫ్యాక్చరై హాస్పిటల్‌కు వచ్చాడు… ఆరోగ్య పరీక్షలకు వచ్చాడు… అంతేతప్ప ఇక ఫామ్ హౌజు నుంచి కదిలింది లేదు…

అనారోగ్యం ఒకవైపు, తను దూరంగా ఉండి కేటీయార్ సామర్థ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన మరోవైపు, ఇంటిపోరు ఇంకోవైపు, జనం తిరస్కరణ సరేసరి… చంద్రబాబు నేతృత్వంలోని మహాకూటమి తరఫున ఘోర ఓటమి తరువాత తను ఎలా అజ్ఞాతంలోకి వెళ్లాడో, ఇప్పుడు రెండేళ్లుగా అంతే… పోరాట స్పూర్తి లేదు, మొహం చూపించిందీ లేదు…

హరీష్ రావులో కూడా ఏదో అంతర్మథనం… గతంలో కేసీయార్ తనను పూర్తిగా దూరం పెట్టిన అనుభవం ఉంది… పార్టీ పగ్గాలు పూర్తిగా కేటీయార్ చేతుల్లోకి వెళ్తే, సొంత చెల్లెనే సహించలేని కేటీయార్ తనను ఎలా భరిస్తాడు..? పార్టీలో తనకు దక్కే ప్రాధాన్యం ఏమిటి రాను రాను..? ఇదీ హరీష్ రావు బాధో, భయమో, సందేహమో, ఆందోళనో…

ఇక్కడ ఓ చిక్కు ప్రశ్న… హరీష్ రావు ఎప్పటికైనా సొంత వారసుడు కాలేడు, కవితను ఇంటి నుంచే తరిమేశారు, ఏనాటికైనా కేటీయారే బీఆర్ఎస్ ఉత్తరాధికారి… కానీ వరుస ఓటములతో తను కుదేలు… ఇప్పటికిప్పుడు జనంలోకి వచ్చినా, గతంలోలాగే ఏవో మాయమాటలు చెప్పినా జనం పట్టించుకుంటారా..? పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలు వెంటాడుతూనేే ఉంటాయి… ఓడిపోయాక మళ్లీ జనం మొహం చూడని కేసీయార్‌ను జనం గతంలోలాగా ఆదరిస్తారా..? పల్లకీ మోస్తారా..? అదీ అసలు డౌట్…

ఇక పార్టీకి మళ్లీ పట్టు చిక్కుతుందా..? వోకే, పార్టీని ఎంతోకొంత పటిష్టం చేసినా సరే, మళ్లీ కేటీయార్‌కే కదా అంతిమంగా పగ్గాలు ఇచ్చేది..? ఇన్నాళ్లూ జనంలో పెద్దగా యాక్సెప్టెన్సీ లేని, రాని కేటీయార్, వరుసగా పార్టీ నాయకత్వంలో విఫలమవుతున్న కేటీయార్… తరువాతైనా ఎలా పార్టీని కాపాడుకోగలడు..?
కేసీయార్ ఇతర పార్టీల్లో తన కోవర్టులను పెట్టుకుని, ప్రలోభపెడుతూ, తను బలపడుతూ, కథ నడిపించుకుంటూ వచ్చాడు… ఐనా సరే, గత ఎన్నికల్లో పరాభవం తప్పలేదు, మరోవైపు రాజకీయ వారసుడు కేటీయార్‌కు రాజకీయ చాణక్యం లేదు, సామదానభేదదండోపాయాలూ తెలియవు… ఇంకోవైపు కేసీయార్ క్యాంపు ఏమాత్రం సహించని రేవంత్ రెడ్డికి స్వర్ణ కిరీటం తొడిగారు జనం… రోజురోజుకూ తనేమో పాతుకుపోయాడు… సో, వాట్ నెక్స్ట్ కేసీయార్ అండ్ కేటీయార్..?!
Share this Article