.
ఊహిస్తున్నదే… కొన్ని వారాలుగా హఠాత్తుగా వోటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల… తనూజ వెనుకబడిపోయింది… సో, అనుకున్నట్టే CRPF జవాను, సిక్కోలు కల్యాణ్ పడాల బిగ్‌బాస్ 9 సీజన్ విజేత అయ్యాడు… ఒక కామనర్ ఒక సెలబ్రిటీని ఓడించాడు… తనూజకు నిరాశే…
నిజానికి మొదటి నుంచీ తనూజ టాప్‌లో ఉంటూ వచ్చింది వోటింగులో… ఎప్పుడూ నామినేషన్లలో ఉంటూ, ఆడియెన్స్ వోటింగుతో సేవ్ అవుతూ వచ్చింది… కోపం, అలక, కామెడీ, ఏడుపు, ఎమోషన్, ఆవేశం, డ్రామా అన్నీ పండించింది ఆమె… అందరితో దీటుగా టాస్కుల్లో పోటీపడింది… ఆమె రన్నరప్ కావచ్చు గాక, కానీ మొదటి నుంచీ ఆడియెన్స్ ఆదరణను పొందింది…
Ads

మరో విశేషం, మొదటి నుంచీ పేలవంగా ఆడుతూ వస్తున్న డిమోన్ పవన్, తనతో లవ్ ట్రాక్ నడిపిన రీతూ హౌజు నుంచి బయటికి పోగానే రెచ్చిపోయాడు, టాస్కుల్లో ఇరగదీశాడు… వోటింగులో కూడా అదరగొట్టాడు… చివరకు 15 లక్షలు తీసుకుని లాభపడ్డాడు… సరైన నిర్ణయం, తనెంత బాగా ఆడినా సరే, కల్యాణ్- తనూజలతో పోలిస్తే ఎక్కడో వెనుకబడ్డాడని తనకూ తెలుసు, అందుకే ఆ నిర్ణయం…
తనకు 15 లక్షలు, కల్యాణ్‌కు 35 లక్షలు ప్లస్ సుజుకి విక్టోరిస్ కొత్త కారు… 600 గజాల ప్లాటు, 15 లక్షల విలువైన జువెలరీ…. జాక్ పాట్… ఎటొచ్చీ అటూఇటూ గాకుండా తీవ్ర నిరాశకు గురైంది తనూజ… టాప్ 5 లో ఉన్న సంజన ఫైనల్స్‌లోకి రావడమే గొప్ప కాబట్టి, ఆమె కూడా హేపీ…
బాగా నిరాశకు గురిచేసిన ఫలితం ఇమాన్యుయెల్‌ది… తను నిజంగా మొదటి నుంచీ బాగా ఆడాడు… నవ్వించాడు, అందరితోనూ కలిసిపోయాడు, బిగ్‌బాస్ 9 సీజన్ ఎంతోకొంత రక్తికట్టిందీ అంటే ప్రధాన కారకుడు ఇమాన్యుయెలే… కానీ కొన్ని వారాలుగా వోటింగులో పడిపోయాడు, కనిపిస్తూనే ఉంది…
సరైన పీఆర్ టీమ్స్ లేకపోవడం, చాలా వారాలు నామినేషన్లలోనే లేకపోవడంతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు… జబర్దస్త్ నటీనటులందరూ పూనుకుని తామే క్యాంపెయిన్ చేసినా చివరకు టాప్4 గా వెనుదిరగాల్సి వచ్చింది…

ఇక్కడ బిగ్‌బాస్ చేసిన తప్పేమీ లేదు… అయిదారు రోజులుగా అన్ అఫిషియల్ వోటింగుల్లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తూనే ఉంది… కాకపోతే ఎప్పుడూ మగవిన్నర్లేనా, ఈసారైనా లేడీ విన్నర్ ఉండకపోతుందా అనుకున్న వాళ్లకు కూడా నిరాశే… తను కన్నడ అమ్మాయే అయినా సరే, కన్నడమ్మాయికి ట్రోఫీ ఏమిటనే నెగెటివ్ ప్రచారం మధ్య కూడా… తనూజ మంచి తెలుగుతో, మంచి ఆటతొ, టెంపర్‌మెంట్‌తో… మంచి వోట్లే సంపాదించింది…
ఆట… ఎవరో ఒకరే గెలుస్తారు, మరొకరికి నిరాశ తప్పదు… ఇదీ అంతే… ఇక ఫినాలే సంగతికొద్దాం… మూడున్నర గంటల మారథాన్ ఎపిసోడ్… కానీ జోష్ లేదు, చీఫ్ గెస్టు లేడు… ఏదో ఒకటీరెండు డాన్సులతో సరిపుచ్చారు…
శ్రీకాంత్, రవితేజలు కూడా గెస్టులే కానీ… ట్రోఫీ అందించే ముఖ్య అతిథి లేని లోటు కనిపించింది… ఏదో మమ అనిపించేశారు… ఆశించినంత యాడ్ రెవిన్యూ రాలేదేమో, స్పాన్సరర్ల సొమ్మూ ఖర్చుకు సరిపడా రాలేదేమో…!!
Share this Article