.
బిగ్‌బాస్ మూడున్నర గంటల ఫినాలే చూశాక ఓ మిత్రుడడిగాడు… అసలు ఈ విజయాలతో ఆయా వ్యక్తులకు వచ్చే అదనపు ఫాయిదా ఏమైనా ఉంటుందా..? ఇప్పుడు గెలిచిన కల్యాణ్ సీఆర్పీఎఫ్ జవాను అంటున్నారు కదా, అది వదిలేసి, ఇక తనే చెప్పుకుంటున్నట్టు సినిమాల్లోకి వెళ్తాడా..?
ముందుగా చెప్పాల్సింది ఇది ఓ టీవీ రియాలిటీ షో… జనానికి వినోదం అందించే ఓ స్క్రిప్టెడ్ డ్రామా… బయట ఎవరు ఎక్కువ నాణ్యమైన పీఆర్ టీమ్స్ పెట్టుకుంటే, వాళ్లు వోటింగును కూడా ప్రభావితం చేయగలిగితే సదరు వ్యక్తులు గెలుస్తారు… లేదా బిగ్‌బాస్ టీమే నానా కథలూ పడుతుంది అవసరమైతే…
Ads
కల్యాణ్ నిజానికి ఆర్మీ జవాను కాదు, సీఆర్పీఎఫ్… ఆర్మీ రక్షణ శాఖ పరిధిలో దేశరక్షణ చూస్తుంది… సీఆర్పీఎఫ్‌ను వ్యవహారంలో పారామిలిటరీ అంటాం, సెంట్రల్లీ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ అసలు పేరు… తను అనుకోగానే బిగ్‌బాస్ పాపులారిటీతో సినిమాలు ఏమీ రావు… ఈ గెలుపు అస్సలు ఉపయోగపడదు, సినిమా లెక్కలు వేరు…
శివబాలాజీ, ఫస్ట్ సీజన్ విజేత… ఆ గెలుపుతో 50 లక్షలు వచ్చాయి కానీ తన కెరీర్‌కు అదనపు ఫాయిదా ఏమీలేదు, తను కూడా వ్యాపారంపైనే కాన్సంట్రేట్ చేస్తూ, అడపాదడపా సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంటాడు…
తరువాత మందా కౌశల్… అసలు సోషల్ మీడియా టీమ్స్ సహకారంతో వోటింగు అనేది తనతోనే ఊపందుకుంది… కౌశల్ ఆర్మీ పేరిట హడావుడి… తనకూ బిగ్‌బాస్ గెలుపుతో వచ్చిన పెద్ద ఫాయిదా ఏమీ లేదు… ఏవో కొన్ని పాత్రలు, మోడలింగ్ అసైన్‌మెంట్లు… అంతే…
రాహుల్ సిప్లిగంజ్… నిజానికి బిగ్‌బాస్ డబ్బు సంపాదించి పెట్టింది గానీ తన కెరీర్‌కు పెద్ద బూస్టప్ ఏమీ కాదు, తను సింగర్… రాజమౌళి సినిమాలో ఓ పాట తనను ఆస్కార్ వేదిక దాకా తీసుకుపోయింది, అంతే… దానికీ బిగ్‌బాస్ తాలూకు విజయం ఏమీ తోడ్పడలేదు కూడా… ఇప్పుడూ అడపాదడపా కొన్ని పాటలు, ఎప్పటిలాగే…
అభిజిత్… గుడ్ ప్లేయర్… సూట్ కేసు డ్రామాలతో కేవలం 25 లక్షల ప్రైజ్ మనీ… ఏవో వెబ్ సీరీస్‌లు, డిజిటల్ కంటెంటు మాత్రమే తన కెరీర్ ఇప్పుడు…
వీజే సేన్నీ… తన గెలుపు కూడా అనూహ్యమే… 50 లక్షల ప్రైజ్ మనీ, ఒకటీ అరా సకలగుణాభిరామ వంటి సినిమా చాన్సులు, కెరీర్ ఎదుగుదల లేదు, ఉండదు… చెప్పుకున్నాం కదా ముందే, సినిమా లెక్కలు వేరు… సొహెయిల్ తనకు మస్తు ఆదరణ వచ్చింది, ఇక ఢోకా లేదనుకుని తనే ఓ సినిమా తీసి నిండా మునిగిపోయాడు… బిగ్‌బాస్ పాపులారిటీ పాలపొంగు… అది చాలారోజులు ఉండదు…
రేవంత్ కూడా ఓ సింగర్… జస్ట్, 10 లక్షలు తన ప్రైజ్ మనీ… అప్పటికే సింగర్‌గా, ఇండియన్ ఐడల్ విజేతగా పాపులర్… బిగ్‌బాస్‌తో వచ్చిందేమీ లేదు కొత్తగా… ఇప్పటికీ అడపాదడపా పాటలు, ఏవో టీవీ షోలు… అంతే…
పల్లవి ప్రశాంత్… కల్యాణ్‌కన్నా ముందే ఓ కామనర్ గెలుపు… బిగ్‌బాస్ షో వికటరూపం, ఆ పాపులారిటీకి ఓ వికృతకోణం తను… బస్సులపై రాళ్లు, ఉద్రిక్తతలు, తోటి కంటెస్టెంట్ల కార్లపై దాడులు… వెరసి పోలీసు కేసులు… ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…

లాస్ట్ సీజన్ విజేత నిఖిల్… తెలుగు సీరియల్ నటుడు… ఆటలో ప్రవీణుడే అయినా వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని మరకలు… ఇప్పటికీ అదే సీరియల్ పాత్రలు, అంతే… అంతకుమించి ఎదుగూ లేదు, బొదుగూ లేదు…
ఈ సీజన్‌లో డిమోన్ పవన్‌కూ సినిమా చాన్సుల మీద ఆశలున్నాయి… తనూజకు కొత్తగా వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు… ఆమె లిమిటెడ్ సీరియల్ పాత్రలు చేస్తుంది… ఇప్పుడూ అంతే… కాకపోతే కొన్ని టీవీ షోలు వస్తాయి కొన్నాళ్లు, ఆ డబ్బు మాత్రమే బిగ్‌బాస్ వల్ల ఫాయిదా,.. నిజానికి ప్రైజ్ మనీ గెలిచిన కల్యాణ్‌కన్నా ఆమెకే బిగ్‌బాస్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చాడు…
ఓటీటీ సీజన్ విజేత పేరు, ఓటీటీ బిగ్‌బాస్ లేడీ విన్నర్ బిందు మాధవి… 40 లక్షలు వచ్చాయి, అంతకుమించి ఏ ఫాయిదా లేదామెకు… ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... బిగ్‌బాస్ ఒక షో, దానివల్ల ఏదో సూపర్ పాపులారిటీ వచ్చేసి, అవకాశాలు తన్నుకొస్తాయని అనుకోవడం పెద్ద భ్రమ..!! విజేతలు సరే, కాస్త పేరొచ్చిన కంటెస్టెంట్లు కూడా పత్తా లేకుండా పోయారు..!!
Share this Article