.
ఇండియాలోని విమానాశ్రయాలలో ఎప్పుడూ లాంజుల వద్ద ఒకటే రద్దీ… ఎయిర్‌పోర్టుల్లో ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా బిల్లు వాచిపోతుంది తెలుసు కదా… కనీసం ఆరేడు రెట్ల రేట్లు… అందుకని తమ జర్నీల కోసం నిరీక్షించేవారు, తమ ఎలిజిబుల్ క్రెడిట్ కార్డుల సాయంతో లాంజుల్లో కూర్చుని, అక్కడే తిని, వేచి చూస్తుంటారు… (పెయిడ్ లాంజులు కూడా ఉంటాయి, కానీ అదీ ఖరీదే)…
ఈమధ్య ఓ ఎయిర్‌పోర్టులో లాంజు వద్దకు వెళ్లాను… బయట క్యూ ఉంది, ఏమిటని అడిగితే లోపల ఖాళీ స్పేస్ లేదు, ఫుల్లీ ఆక్యుపైడ్ అన్నారు… కొందరు అడిగితే మీల్ పార్సిల్ ఇస్తున్నారు… మీ డిపార్చర్ గేట్ దగ్గరే తినేసేయండి అని చెబుతున్నారు… అది చూశాక పదేళ్ల క్రితం నాటి కథలాంటి వార్త ఒకటి గుర్తొచ్చింది…
Ads
వి.ఐ.పి లాంజ్ మాస్టర్ మైండ్… ఒక వింతైన నిజం
షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం… నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి మాత్రం అందరి కంటే భిన్నంగా కనిపించేవాడు… అతని పేరు మీడియాలో “Mr. Kwong” (కొన్ని చోట్ల కేవలం ‘లిమిటెడ్ ప్యాసింజర్’ అని ప్రస్తావించారు) అని ప్రాచుర్యం పొందింది…
అతని కథ 2014లో మొదలైంది… క్వాంగ్ ఒకరోజు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ (China Eastern Airlines) లో ఒక ఫస్ట్ క్లాస్ వీఐపీ టికెట్‌ను భారీ ధర చెల్లించి కొనుగోలు చేశాడు… సాధారణంగా ఎవరైనా ఫస్ట్ క్లాస్ టికెట్ కొంటే ఎప్పుడెప్పుడు విమానం ఎక్కుదామా, ఆ విలాసాలను ఎప్పుడు అనుభవిద్దామా అని ఆరాటపడతారు… కానీ క్వాంగ్ ప్లాన్ వేరేలా ఉంది…
ఉచిత విందు.. రోజూ పండుగ!
క్వాంగ్ ప్రతిరోజూ సూట్ వేసుకుని, చేతిలో ఒక చిన్న బ్రీఫ్‌కేస్ పట్టుకుని దర్జాగా ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాడు… సెక్యూరిటీ దాటి నేరుగా చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ వారి VIP లాంజ్‌లోకి అడుగుపెట్టేవాడు… అక్కడ లభించే ఖరీదైన వైన్, రకరకాల వంటకాలు, స్నాక్స్‌ను కడుపునిండా ఆస్వాదించేవాడు… విమానం బయలుదేరడానికి సరిగ్గా గంట ముందు, కౌంటర్ దగ్గరికి వెళ్లి…
“క్షమించాలి, నాకు అత్యవసర పని పడింది. నా ప్రయాణాన్ని రేపటికి వాయిదా (Reschedule) వేయండి” అని చాలా వినమ్రంగా కోరేవాడు…
ఎయిర్‌లైన్ సిబ్బంది కూడా అతను ‘ఫస్ట్ క్లాస్’ ప్రయాణికుడు కావడంతో, ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మరుసటి రోజుకు టికెట్ మార్చేవారు…. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు… ఏకంగా 300 సార్లు సాగింది ఈ ప్రహసనం…!
వెలుగులోకి వచ్చిన వింత
ఒక సంవత్సరం పాటు క్వాంగ్ ఎయిర్‌పోర్టులో ఫ్రీగా తిని వెళ్తుంటే, విమానయాన సంస్థ రికార్డుల్లో ఒకే టికెట్ నంబర్ మీద వందల సార్లు రీషెడ్యూల్ జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది… విచారణలో ఆ వ్యక్తి రోజువారీ లాంజ్ వినియోగాన్ని చూసి అధికారులు నోరెళ్లబెట్టారు…
అతన్ని పిలిచి ప్రశ్నించారు, ముదురు కేసు కదా, తను ఏ నిబంధననూ ఉల్లంఘించలేదని, కంపెనీ ఇచ్చిన ‘ఫ్లెక్సిబిలిటీ’ని వాడుకున్నానని వాదించాడు… విమానయాన సంస్థ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే, క్వాంగ్ తన తెలివితేటలతో మరో అడుగు ముందుకేశాడు…
ఊహించని క్లైమాక్స్
ఎయిర్‌లైన్ వారు చర్యలు తీసుకుంటారని గ్రహించిన క్వాంగ్, వెంటనే తన టికెట్‌ను పూర్తిగా రద్దు (Cancel) చేసుకున్నాడు… ఫస్ట్ క్లాస్ టికెట్ నిబంధనల ప్రకారం, అతనికి టికెట్ డబ్బులు మొత్తం తిరిగి చెల్లించాల్సిందే (Full Refund)…
చివరికి ఏమైందంటే: ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 300 సార్లు ఖరీదైన విందు తిన్నాడు… తాను పెట్టిన అసలు పెట్టుబడిని (టికెట్ ధరను) అణా పైసలతో సహా వెనక్కి తీసుకున్నాడు… చట్టబద్ధంగా అతనిపై కేసు పెట్టడానికి కూడా ఎయిర్‌లైన్స్‌కు అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే అతను అప్పట్లో ఉన్న నిబంధనల ప్రకారమే నడుచుకున్నాడు…
Share this Article