Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది..!

December 28, 2025 by M S R

….

Gurram Seetaramulu …. సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆధునీకరిస్తున్నారు అని ఒక బాపనాయన తెగ బాధ పడుతున్నాడు మరి శ్రీశైలం, యాదగిరి గుట్ట, సమతా విగ్రహాల వెనక వేల కోట్లు ఉన్నాయి, వాటి గురించి ఒక్క ముక్క మాట్లాడడు. అదే జియ్యర్ ఎవరూ ఈ సమ్మక్కలు, ఒక ఆదివాసీ గ్రామ దేవతలు అని అవమాన పరిచినప్పుడు ఆనందించి ఉంటాడు.

ఆదిమ సమాజాలలో నాగరిక భావన మొదలు కాని రోజుల్లో మనిషి స్థిరమైన ఆవాసం లేకుండా సంచరిస్తూ గుహలు పర్వతాలు అవాసాలుగా బ్రతికాడు. ఉరుములు మెరుపులు మేఘాల రాపిడికి నిప్పు వస్తది అనీ, విత్తనం నాటితే మొలకలు వస్తాయి అని, దానికీ ప్రకృతికీ ఋతువుకీ ఏదో సంబంధం ఉందని, రాయికీ రాప్పకీ మొక్కాడు.

Ads

ప్రకృతినే దేవతగా భావించి తనకు తెలియని అతీంద్రియ శక్తులు ఏవో తనను నడిపిస్తున్నాయి అనీ, తెలియని శక్తికి దాసుడు అవడం మొదలు పెట్టాడు. అనాదిగా వాళ్ళ ఆరాధ్య దైవం గ్రామ దేవతలు.
వేదకాలానికి పూర్వం ప్రజలు ప్రకృతి ఆరాధకులు. చెట్టు, పుట్ట, రాయి నీరు, నిప్పు తన చుట్టూ ఉన్న సమస్త జీవజాలంలో దైవాన్ని చూసుకున్నారు.

ఆ కాలంలో మాతృస్వామిక వ్యవస్థ ఉంది కనుక స్త్రీ ఆరాధ్య దైవం అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలవబడుతూ ఉంది. ఇదొక ఆచరణ, దానికో దేశవాళీ క్రతువు ఉంది. పండిత క్రతువుకు సమాంతరంగా మరొక పరంపర ఉంది. ఉత్పత్తి కులాలకి అనుబంధంగా ఆశ్రిత లేదా ఉప కుల నిర్మాణాలు ఆయా కులాల జీవితంలో పెళ్లి చావు లేదా మరేదో క్రతువు నిర్వహణ పూర్తిగా ఆయా కుల పూజారుల ఆజమాయిషీలోనే జరిగేది.

వీళ్ళ జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు భాగం అయ్యాయి. ఇవి ఎన్నో పేర్లతో వ్యాపించి ఉన్నా, అన్ని ప్రాంతాలలోనూ దళిత బహుజన కులాల కుల పెద్దలు, కుల గురువులు లేదా బైండ్ల. లేదా బవనీ లాంటి కులాల వాళ్ళు ఈ దేవతల పూజారులుగా చలామణిలో ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా శక్తి ఆరాధకులు. ‘శాక్తేయ’ పరంపరను ఆచరించే వైదిక క్రతువుకి బయట ఉన్న ఇది అతి సాధారణ పూజా విధానం నిరాడంబర గుడులు .

మూలవాసుల నమ్మిక ఆచారం కల్లూ, సార, జంతుబలి, నైవేద్యం ఒక విశిష్టత. కొన్ని గ్రామాలలో బయట కాక ప్రతి ఇంట్లో తమ నమ్మకానికి అనుగుణంగా ఒక గుడి పూజా క్రతువు ఉంటుంది. వాస్తవానికి ఇవి గ్రామానికి రక్షణగా ఉన్న ఐతిహ్యాలు.

2 . ఈ గ్రామ దేవతల ప్రస్తావన పురాణాలలో కనబడదు అయినా “విష్ణుపురాణం” లో జమదగ్ని కథలో ‘ఎల్లమ్మ’ లేదా ‘రేణుకా ఎల్లమ్మ’ ప్రస్తావన ఇలా ఉంది. “ఋషి జమదగ్ని తన భార్య రేణుక ఏదో తప్పు చేసింది (తను భర్తను కాక పరాయి పురుషుణ్ణి అలోకన చేసుకుంది అనే అభియోగం) ఆమెను వధించమని తన కొడుకు పరుశురామున్ని ఆజ్ఞాపించగా, భయపడిన రేణుక మాదిగ లందలో తల దాచుకున్నది, పరుశు రాముడు తన తండ్రి మాట ప్రకారం రేణుక తల నరికి తండ్రికి చూపిస్తాడు. కన్న తల్లిని నరికే అమానవీయ దుష్టాంతం ఇది.

మళ్ళీ తన భార్యను బ్రతికించే క్రమంలో తెగిన తల కోసం వెతకగా కేవలం మొండెం మాత్రమె దొరకగా ఒక మాదిగ స్త్రీ తలను నరికి రేణుక మొండానికి అతికించి ప్రాణం పోసాడు. అప్పటి నుండి రేణుక ఎల్లమ్మ గా పిలువ బడుతోంది అని ఐతిహ్యం. అందుకే కింది కులాల లో ఇంటికొక ఎల్లమ్మ ఉంటది.

ఎల్లమ్మ అంటే ఎల్లలు లేని దేవత అని అర్ధం. ఆమె సోదరీమణులు అయిన మన గ్రామ దేవతలు ఈదమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, పోలేరమ్మ (పొలి అంటే పోలిమెర- సరిహద్దు), పోచమ్మ, అంకాలమ్మ, సవారు లచ్చమ్మ, పైడితల్లి, గంగానమ్మ, కోట మైసమ్మ, కట్ట మైసమ్మ బందం మైసమ్మ గా గ్రామ గ్రామాన అనేక పేర్లతో విస్తరించి ఉంది.

ప్రతి ఇంట్లో తమ ఆడ బిడ్డలను ఆ రూపంలో గౌరవించుకుంటూ ఆ పేర్లు పెట్టుకుంటున్నారు. ఏది ఏమయినా ‘గ్రామ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన స్త్రీలనే దేవతలుగా భావించి గ్రామానికి రక్షణ కల్పిస్తున్నారు’ ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

3 . దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది. ఆధిపత్య శిష్ట ధోరణులు ఈ గ్రామ దేవతలను కబలిస్తున్నాయి. ఆదిమ కాలం నుండీ అనుసరిస్తున్న పూజా విధానంలో వైదిక సనాతన క్రతువు తిష్ట వేసింది, ఇప్పుడు చిందు, డక్కలి, బవనీలు అలంకార ప్రాయం అయ్యారు. భత్యం విదిల్చి గుడి చుట్టూ దాని సంపద చుట్టూ ఈగల్లా బెల్లం నాకేస్తున్నారు.

అసలు రాజ్యం కనుసన్నల్లో బోనాలు దానికి తోడు వందిమాగదులు పోగయ్యారు. దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది.

సట్టిలో వండే సప్పిడి పులగాన్ని బంగారు గిన్నెలో వండినంత మాత్రాన దాని రుచి మారుద్డా ? శావణమాసం జోగినీ, బవనీ, పంబాల, బైండ్ల, శివసత్తులకి కాస్త గాసం దొరికే మాసం, రాత్రికి రాజులుగా పగలు యాచకులుగా ఆధిపత్య కుల పోరాటాల పైరవీకాల్ల పద ఘట్టనల మధ్య చీమల్లా నలుగుతూన్న అస్తిత్వం వీళ్ళది. ఈ క్రతువులో దేవదాసీలు, మాతంగులు ముందుంటారు. శాక్తేయ పరంపరలో జరిగే ఈ ఆరాధనలో కింది కులాల వారే పూజారులుగా ఉంటారు. వీరి కేంద్రీకృతంగా జరిగే ఈ తంతు ఆదిమ సమాజాల నుండే ఉన్నప్పటికీ మధ్య యుగాల్లో అది వికృత రూపం దాల్చింది.

4 . ఈ బోనాల పరంపరలో అమానవీయ సంస్కృతి రంగం. తరతరాలుగా మాతంగి కుటుంబీకులు కత్తితో లగ్గం ఆడి, రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తూ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. మూలవాసుల విశ్వాసాల మీద ఆధునిక హేతువుతో వేసే ప్రశ్నలు నిలబడవు.

కేవలం సప్పిడి పులగానికి బంగారు తెలంగాణ తన బడాయిని వజ్రాల ముక్కుపుడకలు, బంగారు తాపడ బోనాలు సిద్ధం చేసి బ్రమకు బంగారు పూత పూస్తున్నారు . ఏటా పార్టీకి ఒక , ప్రవరకొక, పూటకొక పంచాంగం చెప్పే ఆధిపత్య కుల పూజారుల పంచాంగ విశ్వసనీయత ఈ గుడి ముందు ఎప్పుడూ దిగదుడుపే. ఆదిమ కాల విశ్వాసాల్లోకి ఆధునికత ఎంత దూకుడుతో వచ్చినా అది బియ్యంలో వడ్ల గింజలా సంకరమే.

5 . ఖమ్మం పట్టణానికి పక్కనే ఉన్న మా ఊరు (తల్లంపాడు)లో కొన్ని తరాలుగా గ్రామ రక్షణగా ఉన్న ‘మైసమ్మ’ గుడి పునర్నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ క్రమంలో స్థానిక శిల్ప, అద్దక, తాపీ మేస్త్రీ విద్వత్ స్వయంగా చూసా. గ్రామాల్లో వాడకొక మైఖేల్ ఏంజిలో, డావెన్సీలు ఉంటారు. డేవిడ్ లాంటి కుదమట్టంగా ఉండే బాహుబలులూ కనబడతారు.

ఆ క్రమంలో ఇటీవల మైసమ్మ గుడి నిర్మించారు. ఇది మా తమ్ముడు గుఱ్ఱం శ్రీనివాస్ కట్టాడు, ఇంకో తమ్ముడు రామకృష్ణ ఆ శిల్పాలు తయారు చేసాడు. ఇంకో మిత్రుడు వెంకటేశ్వర్లు రంగులు అద్దాడు. వీళ్ళెక్కడో శిల్పశాస్త్ర విద్యలు నేర్వలేదు. ఆగమ శాస్త్ర, శస్త్ర, స్రష్టలూ కారు. బ్రతుకుల్లో అష్టవంకరలు ఉన్నా, నుదిటి మీద గీతలు సరి లేకున్నా చేతిలో మట్టి, సున్నం, సిమెంట్ ఒదిగి పోయింది.

వివక్షను నుదుటి బొట్టులా ధరించిన కురూపి బొమ్మలు, వాళ్ళ కరుకు చేతుల సుకుమారానికి సిమెంటు, రాళ్ళు, ఇటుకలు వాళ్ళు వొదగమన్న చోట వొదిగాయి. ఆ చేతులు ఇంద్రధనస్సుకు తాపడం పెట్టగలవు.
ఇది వెలివాడల అంటరాని జీవితాల్లో దాగున్న తుమ్మ పూలంత సౌందర్యం. బీరపూవంత సుకుమారం. ఇవి కవెల కట్టెల్లో శిధిలమౌతూ … చరిత్రలో విస్మరణకు వెలివేతకూ లోనవుతూ… ఒక విషాద గాధలా… వీటిని వినేందుకూ రాసేందుకు నువ్వు మనిషిగా మళ్ళీ పుట్టాలి…

6 . ఆరేడు ఏళ్ల కింద ఆగష్టు పదహారు నుండి పందొమ్మిది మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన తంతు మా ఊరిలో ఎప్పుడో నూటా యాభై ఏళ్ళ కింద లేదా అంతకు ముందు జరిగి ఉండొచ్చు అని అమ్మ అన్నది. అది చూసిన, విన్న వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. పాత ఊరిలో శిధిలం అయిన ఆ గుడి పునర్నిర్మాణ పనులు నా చిన్నతనం నుండే కొత్తది కట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నా మా తమ్ముడు మొదట పూనుకొని పని మొదలు పెట్టాడు.

గుడి కట్టడం అంటే చిన్న పిచ్చుక గూడు కట్టినంత తేలిక కాదు. ఖర్చు ‘నిష్ట’తో కూడుకున్న వ్యవహారం. ఈ క్రతువులో అతి ముఖ్యమైనది జంతుబలి , బలి తర్వాత ఊరు చుట్టూ బలి తిరగడం. అత్యంత భయోత్పాతమైన పని అది. ఆ తంతు చూడడానికి వేలాది మంది జమ కూడతారు. తినడానికి తిండి లేని జనాలకు ఇంటి మీద సరిగా కప్పు లేకున్నా ఊరి బయట ఉండే గుడి నిర్మాణం విషాదంలో విషాదం.

మొత్తానికి ప్రజల్లో పెరుగుతున్న భక్తి అనుకోవాలో, భయం అనుకోవాలో పెద్ద మొత్తంతో నిధులు సమకూరాయి. నేను పదహారు అర్ధరాత్రి ఊరికి చేరా. కాలనీ మధ్య ఖాళీ స్థలంలో రెండు హోమ గుండాలు. ఒకటి చతురస్రాకారంలో, మరొకటి గుండ్రంగా. అందంగా మట్టితో అలికి ముగ్గులు పెడుతున్నారు. కింది కులాలలో ఈ హోమాలు ఉండవు.

ఏనాడయితే ఈ క్రతువు చుట్టూ డబ్బు పోగు అయ్యిందో సాంప్రదాయం పేరుతో కుల పూజారుల విశ్వసనీయత ప్రమాదంలో పడుద్ది. ఆరోజు ఎందుకో వేల ఏళ్ళుగా ఈ క్రతువు నడిపే ‘బవనీ’ ఉనికి అస్తిత్వం ప్రశ్నార్ధకం అయ్యింది. సాంప్రదాయంగా వస్తున్న ఒక క్రమానికి ఆధునికత పేరుతో జరిగే ఎక్కిరింత అది. అక్కడ హోమాలు సాంప్రదాయ ముగ్గులు, కొబ్బరి, గుమ్మడి, ఇతరత్రా సామాగ్రి జమకూడింది. మొదటి రెండు రోజులు సంప్రదాయ కుల పూజారి అయిన బైండ్ల వెంకన్న మౌనంగా తన పరంపరలోకి దూసుకొని వచ్చిన సంస్కృత క్రతువు వెక్కిరింతల మధ్య గడిచింది.

లీటర్ల కొద్దీ పాలు, నెయ్యి, హోమగుండంలో ఎండిన తంగేడు, మోదుగు, సండ్ర సమిధలుగా పదహారు రోజులు ఆరకుండా ఆవిరి అయ్యాయి. పూజా, పుణ్యాహ వచన, పంచగన్య, ప్రవచన, అఖండ దీపారాధన, అగ్నిహోమం, యాగశాల, మండపారాధన, నవగ్రహ, అష్టదిక్పాలక, మంత్రం పుష్ప,తీర్ధ ప్రసాద, ధన, ఆర్ష, జల, పుష్ప అభిషేకాలు, యంత్ర లాంటి క్రతు లాంటి అర్ధం కాని సంస్కృత శ్లోకాల ఉక్కిరిబిక్కిరి మధ్య ‘సనాతన వైదిక’ పరంపర ముగిశాక మూడో రోజు బైండ్ల వెంకన్న తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

అప్పటిదాకా జరిగిన క్రతువు వాళ్ళ జీవితంలో ఏనాడూ లేనిది. బవనీ ప్రవేశంతో ఆ ప్రదేశానికి ఒక్కసారి జవసత్వాలు వచ్చాయి. మూడో రోజు శివసత్తుల డప్పు కేరింతలతో ఊరుఊరంతా శిగం ఊగింది. రోజంతా చిందాడిన శివసత్తులు తమ అలసట భారాన్ని మైసమ్మ గుడి ముందు మందు, బీర్ బాటిల్స్ చీర్స్ కొట్టడం, కల్లుపాక ఎల్లమ్మ గుడి ఎందుకు కలిసి ఉంటాయో అర్ధం అయ్యింది. ఆ రాత్రి మొత్తం బైండ్ల ఎల్లమ్మ కథ లయల మధ్య చివరి రోజు జరిగే భయానక ఉద్వేగాల ఎదురు చూపులతో ఆ రాత్రి నిద్రోయింది.

7 . చివరి రోజు అతి ముఖ్యమైన రోజు అనిపించింది. వేలాది మంది ఊరును జాతర చేసారు. బలి నిర్వాహకుడికి స్నానం చేయించి. బలి కోసం తయారు చేసిన కత్తికి పూజలు చేసి. కంకణం కట్టి, కులపెద్దకి గజ్జెలు కట్టి, వీరపూజ చేసి కత్తికి నిమ్మకాయలు కుచ్చి, కత్తిని గడప గడపకూ సాకబోసిన ఉద్వేగాల నడుమ బొడ్రాయి దాకా ఊరేగింపుగా వెళ్ళారు.

తిరిగి గుడి వైపు వచ్చేముందు గ్రామగవిడి ముందు బలమైన దున్న కుర్రకు నాలుగు వైపులా తాళ్ళు కట్టి, వొక్క వేటుతో తెగిన తల వేలాది మంది శిగం ఊగగా జరిగింది. రెండో దున్న గుడి ముందు. మరో రెండు మేక పోటేల్లు కోసి పొట్ట చీల్చి పేగులు మేడలో వేసుకొని, దొబ్బను నోట్లో కరిసి, జొన్నలతో వండిన అన్నంలో కుంకుమ రక్తం కలిపి, వాడ సరిహద్దుల చుట్టూ బలి తిరిగి, అశ్శరభ శరభల మధ్య గ్రామం చిందాడింది. నాలుగు రోజులు నిరవధికంగా జరిగిన ఒక హోరు విశ్రమించింది. వందేళ్ళ తర్వాత జరిగిన ఈ క్రతువు తరానికి తరానికి మారుతూ వస్తోంది. మల్లెప్పుడు జరుగుతదో తెలియదు.

ఈ క్రతువు ప్రత్యక్షంగా చూసిన నాకు ఎక్కడో ఆఫ్రికా ‘చీకటి’ ఖండంలో నోబెల్ గ్రహీత వోలె సోయింకా రాసిన “డెత్ అండ్ కింగ్స్ హార్స్ మాన్” అనే నోబెల్ పురస్కార రచన యాదికి వచ్చింది . నైజీరియాలో ఎరూబా తెగలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రాసిన నాటకం అది. “రాచ పీనుగ ఊకెనే పోదు” అనే సామెత ఎందుకు వచ్చిందో నాకు ఎరూబా తెగ రాజు ఆచారాలు చదివాక అర్ధం అయ్యాయి.

స్థూలంగా నాటక కథ ఒక మారుమూల తెగ ఆ రాజు చనిపోతే ఆ తెగ అంతిమ క్రతువులో రాజు గుఱ్ఱం, కుక్కతో బాటు ఆయన ప్రధాన అశ్వకుడు కూడా ఆత్మార్పణ చేసుకోవాలి. ఒక వేళ ప్రధాన అశ్వకుడు చనిపోతే, లేక అనారోగ్యంగా ఉంటే ఆయన పెద్ద కొడుకు ఆ బాధ్యతను నెరవేర్చాలి. వినడానికి భయంగా ఉన్నా డెబ్బై ఎనభై ఏళ్ళ కింద దాకా ఈ ఆచారం ఉంది.

బ్రిటన్ వలస పాలనలో ఉన్న కాలం అది. నాడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్న ఒక తెల్ల దొర సైమన్ పికింగ్స్, ఆయన భార్య లండన్ లో మెడిసిన్ చదువుతునన్న ఆ ప్రధాన అశ్వకుని కొడుకుని ఒప్పించి, ఎలాగయినా ఆ క్రతువు ఆపాలని చేసే ప్రయత్నం. అతను ఓడలో బయలుదేరినా ఆ ఊరికి వచ్చేదాకా జాగారం చేస్తూ రకరకాల నివేదనలు చేస్తూ ఉంటుంది పల్లె.

అతని పేరు ఒలుండే. తమ తెగ మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రధాన ఆశ్వకుడు, ఆయన కొడుకు ఒలుండే తమ ప్రాణాలను అర్పిస్తారు. దీని అర్ధం ఆదిమ తెగలు తమ సాంస్కృతిక ఉనికి ప్రశ్నార్ధం అయినప్పుడు దానిని కాపాడుకోడానికి తనువు అర్పించడానికి వెనకాడరు. వలసపాలన తమ మూలవాసుల ఉనికిని అస్తిత్వాన్ని కబళిస్తున్నాయి అనీ, దానికోసం కొన్ని ప్రాణాంతకమైన పనులకూ వెనకాడరు. తరాలుగా నమ్మిన విశ్వాసానికే ఒలుండే తలొగ్గడం ఈ నాటకం ముగింపు.”

నాడు జరిగిన సంవాదంలో “ఆధునికత పేరుతో మీరు తెచ్చిన విద్వంశం మా రక్త నాళాల్లో చేరి కలుషితం అయ్యింది. మీ నుండి నేర్చుకునేంత దుస్థితిలో నా నాగరికత లేదు’ అని అంటాడు. ఎక్కడో మా ఊరుకి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం లో జరిగిన ఒక సంఘటన ఒకే భావోద్వేగాలను కలిగి ఉండడం . ఒక మనిషి కోసం నమ్మిన విశ్వాసం కోసం ఆత్మార్పణ చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయ ఆలోచనగా చూడాలి.

“ఒలుండే” నుండి నర్మదా నదిలో దూకిన ప్రతాపరుద్రుని దాకా ఒక ప్రాంతీయ విముక్తి కోసం వేలాది మంది అమరులు అవడం. ఎక్కడయినా ఒకే ఉద్వేగాన్ని కలిగి ఉంటుంది అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆదిమ లేదా మూలవాసుల ఆచార వ్యవహార అలవాట్లు మధ్య కొనసాగుతున్న ఒరవడి నాటి నుండి నేటిదాకా కొనసాగడం వెనక నడిచిన రక్త నదిలో నమ్మిక, విశ్వాసం వెనక భయోత్పాతం మూలాలు ఇంకా లోతుగా రాయాలి అనిపించింది.

ఎంతో ప్రజాదారణ పొందిన నైజీరియా ఒలుండే నిష్క్రమణ మా ఊరు పక్కనే ఉంది అనిపించింది. మా ఊరిలో దున్న కుర్రను వేలాది మంది చూస్తుండగా వధించడం, అందునా నరికిన వీర కత్తిని, నరికిన వాణ్ణీ పవిత్రంగా పూజించడం చూస్తే విభ్రమ కలిగింది.

చూస్తే ఇదొక ఆటవిక అనాగరిక, హింసాత్మక చర్యలా అనిపించొచ్చు. నాస్తిక హేతువాదులు ఇందులో అనాగరికం వెతుక్కోవచ్చు. అయినా ఒకటి నిజం. బలి ఆదిమ సమాజాల శిలాజం, వేట ప్రధాన వనరు అయినప్పుడు దొరికినదేదో ఒక ఉత్సవంలా వేడుకలా జరుపుకొనే ఒక సామూహిక వేడుక. ఈ సమాజంలో నూటికి తొంబై మంది తమవి కాని సాంస్కృతిక బరువులను మోస్తున్నారు.

ఆధిపత్య ఐతిహ్యాలని ధిక్కరించిన తమవైన జ్ఞాపకాలను నాగరికతను కాపాడుకుంటున్ననిమ్న సాంస్కృతిక ఆలోచనలలో హేతువును వెతకగలమా? తమ తెగ రక్షణ కోసం పొలిమేర చుట్టూ బలి చల్లి ఏర్పరుచుకున్న హద్దులు, వాటికి కాపలాగా గ్రామ గవిడిలో నీ ఆధునిక హేతువుకి అందని ఏదో ఒక నమ్మకం విశ్వాసం ఉండొచ్చు. దానికి గౌరవిస్తావా ఈసడిస్తావా అనేది నీ విచక్షణ మీద ఆధార పడి ఉంటది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దారం పోగు కట్టడిని జంధ్యం శాసిస్తోంది..!
  • ‘‘ఈ భారత రాజును ఎవరైనా దూషిస్తే… ఫిరంగికి కట్టి పేల్చేస్తారుట…’’
  • హమారా హైదరాబాద్… దీని తెహజీబ్ నిత్యాంతర్వాహిని…!
  • రాబందు’వులొస్తున్నారు జాగర్త…! కానీ ఇప్పుడలాంటి సీన్లు లేవు…!!
  • ఎవరు తప్పుదోవ పట్టించారో గానీ… రేవంత్ రెడ్డి దిద్దుకోవాల్సిన పాలసీ…
  • పాత కేసుల్ని కెలుకుతున్న బండి సంజయ్…! కేటీఆర్‌పై డ్రగ్స్ దాడి..!!
  • జలద్రోహి ఎవరు..?! కవిత చెప్పిన చేదు నిజాల్ని అసెంబ్లీలో వినిపిస్తే సరి..!!
  • సమస్య బట్టలు కాదు… అది మూక ఉన్మాదం… మగాళ్లనూ వదలరు…
  • మేల్ శ్రీముఖి..! ఆ హాలీవుడ్ చెత్తతో మన పురాణాలకూ పోలికేమిటి.,.!!
  • దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ వీఐపీ లాంజులో ఫ్రీ మందు, ఫ్రీ విందు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions