Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరు తప్పుదోవ పట్టించారో గానీ… రేవంత్ రెడ్డి దిద్దుకోవాల్సిన పాలసీ…

December 28, 2025 by M S R

.

(శంక‌ర్‌రావు శెంకేసి/ 768 000 6088) …….. జర్నలిస్టుల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 252 అశాస్త్రీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జర్నలిస్టులను రెండు రకాలుగా విభజించారు. ఇది ఊహించనిది.

రిపోర్టర్లకు అక్రిడిటేషన్‌ కార్డులు, డెస్క్‌ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇలా ఎందుకు, ఏ కారణం చేత విభజించారో పెద్ద‌లు సెల‌వివ్వ‌లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అప్పటి ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్‌ పాలసీని రూపొందించి 2016 లో జీవో నెం.239ను జారీ చేసింది.

Ads

ఆ జీవో ప్రకారం అన్ని స్థాయి పత్రికలు, టీవీ చానెళ్లకు వివిధ రకాలుగా కోటా నిర్దేశించి అర్హులైన అందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు అందజేశారు. ఇది గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ కార్డుల ద్వారానే జర్నలిస్టులు హెల్త్‌కార్డులు, బస్‌ పాస్‌లు పొందుతున్నారు. గతంలో రైల్వే పాస్‌లు కూడా పొందారు. ఈ కార్డుల ఆధారంగానే ప్రభుత్వ నివేశన స్థలాల కోసం ఎదురుచూస్తున్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు రూపొందించిన అక్రిడిటేషన్‌ పాలసీలో డెస్క్‌ జర్నలిస్టులను టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది. వారికి అక్రిడిటేషన్‌ కార్డులకు బదులు మీడియా కార్డులు జారీచేస్తామని ప్రకటించారు. ఈ విభజన రేఖకు కారణం ఏమిటో.. డెస్క్‌ జర్నలిస్టులు చేసిన పాపమేమిటో.. ఏలికలు చెప్పడం లేదు.

గత పదేళ్లలో ఏ ఒక్క డెస్క్‌ జర్నలిస్టు మూలంగా అక్రిడిటేషన్‌ కార్డులు దుర్వినియోగమైన దాఖలాలు లేవు. వాస్తవానికి డెస్క్‌ జర్నలిస్టులు అన్ని అర్హతలు కలిగిన ప్రొఫెషనల్‌ జర్నలిస్టులు. మీడియా సంస్థలకు రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు రెండు కళ్లలాంటి వారు. ఏ కన్ను గొప్పదని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు? కనీసం ఈ ఇంగితం లేకుండా జర్నలిస్టులను విభజించడం.. డెస్క్‌ జర్నలిస్టులను అవమాన పరచడం, చిన్నచూపు చూడటమే అవుతుంది.

మీడియా కార్డులున్న వారికి అక్రిడిటేషన్‌ కార్డులున్న వారితో సమానంగా సంక్షేమ పథకాలు అందుతాయని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు రెండు కార్డులు ఇవ్వడం దేనికి? డెస్క్‌ జర్నలిస్టుల పని వేళలు రాత్రిళ్లు ఉంటాయి. డెడ్‌లైన్‌ కత్తుల మధ్య వారు అనేక ఒత్తిళ్లతో పనిచేస్తుంటారు.

అటు ప్రజా సమస్యలను, ఇటు ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలను రిపోర్టు చేయడంలో రిపోర్టర్లకు ఎంత పాత్ర ఉంటుందో, వారిచ్చే కంటెంట్‌ను రిఫైన్‌ చేసి, దిద్దితీర్చి, సచిత్రంగా ఇవ్వడంలో డెస్క్‌ జర్నలిస్టులకు అంతకంటే ఎక్కువ పాత్ర ఉంటుంది. మీడియా సంస్థల క్రెడిబిలిటీ కాపాడటంలో, వాటిని ప్రజారంజకంగా తీర్చిదిద్దడంలో డెస్క్‌ జర్నలిస్టులది అత్యంత ముఖ్యమైన పాత్ర. అట్లాంటి డెస్క్‌ జర్నలిస్టుల పట్ల ఈ ‘ప్రజా ప్రభుత్వం’ వివక్షతో వ్యవహరించడం అవివేకం.. అన్యాయం.

నిజానికి డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్ కార్డులు అప్ప‌నంగా రాలేదు. అవి అనేక బౌద్ధిక‌, భౌతిక‌ పోరాటాల ద్వారా, ప్రాణహితుల వెన్నుదన్ను ద్వారా, సంఘీభావం తెలిపిన‌ అనేక‌మంది హితైశ ఫీల్డు జ‌ర్న‌లిస్టుల ద్వారా, పోరాటాల స్పూర్తి ద్వారా అందాయి. యూనియ‌న్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే క్ర‌మంలో, త‌ల పండిన నేత‌ అప్పుడు… ‘డెస్కోళ్ల‌కు కార్డుల‌తో ఏం ప‌నివ‌యా ?’ అని చీత్క‌రించారు.

న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్న స‌మ‌యంలో ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన మ‌రొకాయ‌న.. ‘డెస్క్ జర్న‌లిస్టులంటే ప్రూఫ్ రీడ‌ర్లు, మీకెందుకు కార్డులు..?’ అని త‌న అహం ప్ర‌దర్శించాడు. అట్లా అనేక అవ‌మానాలు, అవ‌హేళ‌న‌లు, బెదిరింపులు ఎదురైనా తెలంగాణ‌లోని ఎడిష‌న్ల సెంట‌ర్ల‌లో ప‌నిచేసిన డెస్క్ జ‌ర్న‌లిస్టులు సాగించిన‌ ఐక్య పోరాటాలతో అవి చేతికందాయి. అట్లా ఆ కార్డుల‌తో డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు ఆత్మ‌గౌర‌వం ద‌క్కింది. డెస్క్‌ల్లో పేజ్ వ్యాల్యూ తెలిసిన వారికి, అప్ప‌టి నుంచి కొంత ఫేస్ వ్యాల్యూ ద‌క్కింది. అందుకే అక్రిడిటేష‌న్ కార్డుల కోసం అంత ఆరాటం.

బీఆర్ఎస్ స‌ర్కారు హ‌యాంలో 2022లో జారీ చేసిన అక్రిడిటేషన్‌ కార్డులే ఆఖ‌రు. 2024 జూన్‌లో వీటి పీరియ‌డ్ ముగిసినా, కాంగ్రెస్ స‌ర్కారు అప్ప‌టి నుంచి పొడిగించుకుంటూ వ‌స్తోంది. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసిన కార్డుల సంఖ్య 23వేలు అని ఒక లెక్క ఉంది. వీళ్లంద‌రికీ ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న ప‌నికొచ్చే ప‌థ‌కం ఏదైనా ఉందంటే అది ఒక్క ఫ్రీ బ‌స్‌పాస్ మాత్ర‌మే.

హెల్త్‌కార్డులు (జేహెచ్ఎస్‌) ఉన్నా.. 90 శాతం కార్పొరేట్ ఆస్ప‌త్రులు బేఖాత‌రు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న నివేశ‌న స్థ‌లాలు సుప్రీంకోర్టు తీర్పుతో జాడ‌లేకుండా పోయాయి. నిజానికి ఈ కార్డుల వ‌ల్ల ప్ర‌భుత్వంపై ప‌డే ఆర్థిక భారం నామ‌మాత్రం. కానీ ఏవో కార‌ణాల‌తో జ‌ర్న‌లిస్టుల‌పై క‌క్ష పెంచుకున్న పాల‌కులు… త‌మ ప్ర‌తాపం కార్డుల మీద చూపెట్టారు.

desk journos

తాజా జీవోలో మీడియా కార్డుల సంఖ్యనూ అడ్డంగా కుదించారు. ఫీల్డు జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చే కార్డుల సంఖ్య‌ను స‌గానికి కుదించారు. ఇక డెస్క్ వారి విష‌యంలో జిల్లాల్లోని పబ్లికేషన్‌ సెంటర్లలో ఒక్కో పత్రికకు నాలుగుంటే నాలుగే ఇస్తారట. ఇదేమి లెక్కనో అర్థం కావడం లేదు.

పబ్లికేషన్‌ సెంటర్లలో ఎన్ని డెస్కులు ఉంటాయో.. అందులో ఎంతమంది పనిచేస్తారో… కనీస అవగాహన లేకుండానే మీడియా కార్డుల సంఖ్యను నిర్ణయించడం దారుణం. 2016 నాటి జీవో (నెం.239)లో డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు శాస్త్రీయంగా కోటాను కేటాయించారు. త‌ద్వారా సీనియ‌ర్లు అంద‌రికీ కార్డులు అందాయి. తాజా జీవోలో మాత్రం అడ్డంగా క‌ట్ చేసి పారేశారు.

నిజానికి డెస్క్‌ జర్నలిస్టులు కేవలం ఆఫీసులకే పరిమితం కారు. ఫీచర్‌ స్టోరీలు, స్పెషల్‌ స్టోరీలు రాయడానికి వారు ఫీల్డులోకి వెళ్లే సందర్భాలు ఉంటాయి. స్పోర్ట్స్, బిజినెస్ డెస్క్‌ల వారికి అది డ్యూటీలో భాగం. అలాంటప్పుడు వారికి కూడా అక్రిడిటేషన్‌ కార్డులు అవసరమే కదా. ఈ విషయం తెలియకుండానే వారి కోటాకు కోత పెట్ట‌డం, పైగా కార్డుల మధ్య విభజన రేఖ గీయడం ఎవరికి భజన చేయడానికో.

కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడి రెండేళ్లు దాటింది. తమ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా అధికార పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి గత రెండేళ్లలో ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఏ గ్యారెంటీ ఒరగలేదు. కొత్త అక్రిడిటేషన్‌ పాలసీ ద్వారా ఏదో ఒరుగుతుందని భావించిన వారికి, ఏలికలు తాపీగా పంగనామాలు పెట్టి వెక్కిరించారు.

ఈ వృత్తిని నమ్ముకొని వేలాదిమంది జర్నలిస్టులు జీవితాలు సాగిస్తున్నారు. తెలంగాణ సాధనలో వారు తమ ఉద్యోగాలనే కాదు, ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు. అట్లాంటి కలం కార్మికుల జీవితాలతో ఈ ఆటలు ఆడటం సరికాదు. ఇప్పటికైనా జీవో.252ను సవరించి జర్నలిస్టుల, ప్రత్యేకించి డెస్క్‌ జర్నలిస్టుల విశాల ప్రయోజనాలను కాపాడాలి. పోరాట ఫ‌లాల‌ను అంద‌కుండా చేసే ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకోవాలి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరు తప్పుదోవ పట్టించారో గానీ… రేవంత్ రెడ్డి దిద్దుకోవాల్సిన పాలసీ…
  • పాత కేసుల్ని కెలుకుతున్న బండి సంజయ్…! కేటీఆర్‌పై డ్రగ్స్ దాడి..!!
  • జలద్రోహి ఎవరు..?! కవిత చెప్పిన చేదు నిజాల్ని అసెంబ్లీలో వినిపిస్తే సరి..!!
  • సమస్య బట్టలు కాదు… అది మూక ఉన్మాదం… మగాళ్లనూ వదలరు…
  • మేల్ శ్రీముఖి..! ఆ హాలీవుడ్ చెత్తతో మన పురాణాలకూ పోలికేమిటి.,.!!
  • దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ వీఐపీ లాంజులో ఫ్రీ మందు, ఫ్రీ విందు…!!
  • తేడా వస్తే… ఆదుకునేవాడు ఉండడు … ఆడుకునేవాళ్లు తప్ప…
  • రాముడి అయోధ్యలో ఓ కొరియన్ రాణి విగ్రహావిష్కరణ..! ఏమిటీ ఆమె కథ..!!
  • మేడారంపైనా బీఆర్ఎస్ క్యాంప్ ‘చేతబడి’..!! రాజకీయ క్షుద్ర విద్య…!!
  • ఇప్పటి టెక్నాలజీ లేకపోయినా… అప్పట్లోనే వెండితెరపై వెలిగిన అడవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions