Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ఈ భారత రాజును ఎవరైనా దూషిస్తే… ఫిరంగికి కట్టి పేల్చేస్తారుట…’’

December 28, 2025 by M S R

.

ఉక్రెయిన్ సంక్షోభంలో… మన విద్యార్థులు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని వెళ్తే… ఏ అనుమతులూ, వీసాలూ లేకున్నా పోలెండ్ తన దేశంలోకి అనుమతించింది… ఎందుకు..?

ముందుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వస్తున్న ఈ పోస్టు చదవండి… తరువాత కొన్ని నిజాలు చెప్పుకుందాం…

Ads

‘‘పోలాండ్‌లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష… కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!
పోలాండ్‌కు భారతదేశంపై అంత మమకారం ఎందుకు? ఏ రకంగా వారిని మనం కాపాడాం?

ఇజ్రాయిల్‌లాగానే భారతదేశానికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి దయనీయమైన కధ?
పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో పోలెండ్ సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే… బతికితే మళ్లీ కలుద్దాం!

500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ ఇరాన్‌లోని ఓడ రేవుకు చేరుకుంది, ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు, మళ్లీ అలా వెళ్తూ వెళ్తూ అదాన్‌లో ఆగారు కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు… చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది… అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డుకు.,..

అప్పటి జామ్‌నగర్ రాజు “జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్” తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు, 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని బాలచాడిలోని సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు. ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.

అదే శరణార్థి పిల్లల్లో ఒకరు తరువాత పోలాండ్ ప్రధాని అయ్యారు… నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు…

పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు “మహారాజా జామ్ సాహబ్” పేరు పెట్టారు, పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో “మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్” గారి గురించి కథనం ప్రచురించబడుతుంది. ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి వసుధైక కుటుంబం, సహనం అనే పాఠాన్ని బోధిస్తోంది..,

రాజు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు సైనిక శిక్షణ ఇచ్చి, వారికి యుద్దవిద్యలు నేర్పించారు, తరువాత ఆయుధాలు ఇచ్చి పోలాండ్‌కు పంపారు, అక్కడ వారు జామ్‌నగర్ నుండి నేర్చుకున్న సైనిక శిక్షణతో దేశాన్ని పునరుద్ధరించారు.

నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు. పోలాండ్ రాజ్యాంగం ప్రకారం, జామ్ దిగ్విజయ్ సింగ్ గారు వారికి దేవుడు లాంటివాడు. అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.

భారతదేశంలో దిగ్విజయ్ సింగ్ గారిని అవమానిస్తే, ఇక్కడ లా అండ్ ఆర్డర్‌లో శిక్షించే నిబంధన లేదు. కానీ అదే తప్పు పోలెండ్ లో చేస్తే ఫిరంగికి కట్టేసి పేల్చేస్తారు. జామ్ సాహిబ్ చేసిన ఆ సాయం పోలాండ్ నేటికీ మరచిపోలేదు. కాబట్టి ఈ రోజు భారతదేశం వీసా లేకుండా వచ్చేవారిని అనుమతిస్తోంది. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు.

భారతదేశ చరిత్ర పుస్తకాలలో ఈ రాజు గురించి ఎప్పుడైనా బోధించారా? పోలాండ్ పౌరుడు ఒక భారతీయుడిని “మీకు “జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్” తెలుసా?” అని అడిగితే, ఉక్రెయిన్‌లో డాక్టర్ చదవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో రియాక్షన్ అనేదే లేదు ! లేదు, మనల్ని దాని స్వంత మూలాల నుండి దూరం చేసిన అటువంటి విద్యా వ్యవస్థకు సిగ్గుపడదాం…



jam nagar king

……… సో, పైన చెప్పిన కంటెంటును బాగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు… కానీ నిజానిజాలు ఏమిటి..? అదీ చెప్పుకుందాం…

‘‘ఈ కథలో చెప్పబడిన విషయం చాలావరకూ నిజమే, కానీ కొన్ని భాగాలు అతిశయోక్తిగా లేదా తప్పుగా ప్రచారంలోకి వచ్చాయి… రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన సుమారు 1,000 మంది పోలిష్ అనాథ బాలబాలికలకు గుజరాత్‌లోని బలాచడిలో ఆశ్రయం, ఆహారం, విద్య, సంరక్షణ కల్పించారు… వీరు సోవియట్ శిబిరాల నుండి తప్పించుకుని ఇరాన్ మార్గంగా భారత్‌కి చేరుకున్నారు.

జామ్ సాహెబ్ బలాచడిలో శరణార్థి క్యాంపు ఏర్పాటు చేశారనేది నిజం. ఈ పిల్లలు 1942 నుంచి 1946 వరకూ అక్కడ నివసించారనేది నిజం. కొంతమంది తరువాత కొల్హాపూర్‌లోని శిబిరాలకు వెళ్లారు. వీరి వారసులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం జామ్‌నగర్‌కు వచ్చి స్మరించుకుంటారు. పోలాండ్ ప్రభుత్వం ఆయనను “డోబ్రి మహారాజా” (అంటే “మంచి మహారాజా”) అని గౌరవిస్తుంది. వార్సా నగరంలో ఆయన పేరు మీద కూడలి (స్క్వేర్), పాఠశాలలు, స్మారకాలు ఉన్నాయి… ఇవన్నీ నిజాలే…

 తప్పుగా ప్రచారంలో ఉన్న విషయాలు
– పోలాండ్‌లో ఆయనను దూషిస్తే “మరణశిక్ష ఉంటుంది” అన్నది, మరీ ఫిరంగికి కట్టి పేల్చేస్తారనేది అసత్యం. పోలాండ్‌లో ద్వేష ప్రసంగాలపై (hate speech) చట్టాలు ఉన్నా అవి జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్షల వరకే పరిమితం…

– పోలాండ్ రాజ్యాంగంలో నాయకులు “జామ్ సాహెబ్ పేరుతో ప్రమాణం చేస్తారు” అనే అంశం లేదు… వారు దేశానికి నిబద్ధతతో మాత్రమే ప్రమాణం చేస్తారు…
– ఆయన ఆ పిల్లలకు విద్య, ఆశ్రయం మాత్రమే అందించారు — యుద్ధ శిక్షణ లేదా ఆయుధాలు ఇవ్వలేదు.
– ఆ శరణార్థుల్లో ఎవరూ పోలాండ్ ప్రధానమంత్రి కాలేదు.

– ఉక్రెయిన్‌ నుండి భారత విద్యార్థులకు వీసా మాఫీ ఇచ్చినది పోలాండ్ – కానీ అది జామ్ సాహెబ్‌కు కృతజ్ఞతగా కాదు, యురోపియన్ యూనియన్ మానవతా విధానాల్లో భాగమే.

పోలాండ్ ప్రభుత్వం 2011లో జామ్ సాహెబ్‌ గారికి ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారం ప్రదానం చేసింది. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి వార్సాలోని ఆయన స్మారక చిహ్నాన్ని సందర్శించాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఈ భారత రాజును ఎవరైనా దూషిస్తే… ఫిరంగికి కట్టి పేల్చేస్తారుట…’’
  • హమారా హైదరాబాద్… దీని తెహజీబ్ నిత్యాంతర్వాహిని…!
  • రాబందు’వులొస్తున్నారు జాగర్త…! కానీ ఇప్పుడలాంటి సీన్లు లేవు…!!
  • ఎవరు తప్పుదోవ పట్టించారో గానీ… రేవంత్ రెడ్డి దిద్దుకోవాల్సిన పాలసీ…
  • పాత కేసుల్ని కెలుకుతున్న బండి సంజయ్…! కేటీఆర్‌పై డ్రగ్స్ దాడి..!!
  • జలద్రోహి ఎవరు..?! కవిత చెప్పిన చేదు నిజాల్ని అసెంబ్లీలో వినిపిస్తే సరి..!!
  • సమస్య బట్టలు కాదు… అది మూక ఉన్మాదం… మగాళ్లనూ వదలరు…
  • మేల్ శ్రీముఖి..! ఆ హాలీవుడ్ చెత్తతో మన పురాణాలకూ పోలికేమిటి.,.!!
  • దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ వీఐపీ లాంజులో ఫ్రీ మందు, ఫ్రీ విందు…!!
  • తేడా వస్తే… ఆదుకునేవాడు ఉండడు … ఆడుకునేవాళ్లు తప్ప…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions