.
కన్నడ శివ కథల్లో అద్భుతమైన కథనమిది. కర్ణాటక శివగంగ నుండి ఒక యువకుల బృందం శ్రీశైలానికి కాలినడకన బయలుదేరింది. ఇరవై రోజుల పాటు ఆగి ఆగి సాగే పవిత్ర దీక్షా ప్రయాణం. బృందంలో ఒక యువకుడు ఒక రాత్రి అడవిలో దారి తప్పాడు. కాసేపటికి ఒక పల్లె కనపడితే హమ్మయ్య అనుకుని వెళ్లాడు.
పూరి గుడిసె అరుగు మీద ముసలి అవ్వ వక్కాకు నమలడానికి వక్కలను దంచుకుంటోంది. అవ్వా! నేను శ్రీశైలం వెళ్లాలి… దారి ఎటు? అని అడిగాడు. అయ్యో ఇంత రాత్రి… అడవిలో వెళ్ళలేవు. ఈ ఊరి శిథిల శివాలయం మండపంలో పడుకుని ఉదయాన్నే సూర్యోదయాన్ని గమనించి తూర్పు వైపు కాలి బాటలో వెళ్ళు అంటుంది…
Ads
సరే అలాగే… ఎక్కడుంది ఆలయం? అని అడుగుతాడు. ఇదో నేను కాళ్లు చాచిన వైపే వెళ్లు అంటుంది. శివ శివా! శివుడున్న దిక్కున కాళ్లు చాచావా? మహాపరాధం! అంటాడు. అయితే శివుడు ఏ దిక్కున లేడో చెప్తే… అటువైపే కాళ్లు పెట్టుకుంటా! అంటుంది అవ్వ.
పిచ్చిదిలా ఉంది అవ్వ అని విసుక్కుంటూ వెళ్లిపోతాడు. అవ్వ చెప్పినట్లే మండపంలో పడుకుని ఉదయాన్నే తూర్పున కాలిబాటలో వెళితే సాయంత్రానికి శ్రీశైలం వస్తుంది. గుడి మెట్ల ముందు ఆ అవ్వే వక్కాకు దంచుకుంటూ ఏమి నాయనా ఏ దిక్కున వచ్చావు? అని అడుగుతుంది.
ఆ అవ్వలో యువకుడికి పరమశివుడు దర్శనమిస్తాడు. అన్ని దిక్కుల్లో ఉన్నవాడు, నాకు దిక్కై ఇలా దిగివచ్చినవాడు- అని అవ్వకు నమస్కారం చేసి పొంగిపోతాడు యువకుడు.
దేవుడు కేవలం దేవాలయాలకో, విగ్రహాలకో పరిమితమైనవాడు కాడు. సర్వవ్యాపి, సర్వాంతర్యామి. భాగవతంలో పోతన చెప్పినట్లు – ‘ఇందుగలడు అందులేడని సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే కలడు’. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం అసలు అవసరమే లేదు. మనం ఎక్కడ వెతికితే అక్కడ దర్శనమిస్తాడు.
కొండల్లో, ప్రవహించే నదుల హోరులో, వికసించే పువ్వుల పరిమళంలో, చివరకు మన గుండె చప్పుడులో కూడా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు. అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిచోటా ఆ దివ్య శక్తి విస్తరించి ఉంది. కంటికి కనిపించే ప్రకృతిలోనూ, కనిపించని మన ఆత్మలోనూ దేవుడే వెలుగుతున్నాడు.
ఇప్పుడు భక్తి ఒక సుదీర్ఘ ప్రయాణం. లేనివారికి శారీరక శ్రమ, విపరీతమైన నిరీక్షణ. ఉన్నవారికి ఆటవిడుపు, చిటికెలో పని. ప్రోటోకాల్ ఉన్నవారికోసం దేవుడే ఒంటికాలిమీద వేచి ఉంటాడు. ఏమీలేనివారిని రెట్టపట్టి అమానుషంగా తన కళ్ళముందే తోసేస్తుంటే దేవదేవుడే నిగ్రహం కోల్పోకుండా విగ్రహమై మౌనంగా చూస్తూ ఉంటాడు.
నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఒక వింత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. గుడి మెట్లు ఎక్కడాన్ని భక్తి అనుకుంటున్నామే తప్ప, మనసులో అహంకారాన్ని వదిలించుకోవడం భక్తిగా గుర్తించలేకపోతున్నాం. మనకు ‘దర్శనం’ ఒక అలవాటుగా మారింది, కానీ ఆ దైవత్వం ‘అనుభూతి’ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
స్థల పరిమితిలో బందీ
దేవుడిని మనం ఒక నిర్దిష్ట స్థలానికి పరిమితం చేసేశాం. ఫలానా క్షేత్రానికి వెళ్తేనే దొరుకుతాడు, ఇక్కడ ఉంటే దొరకడు అన్నట్టుగా మన ప్రవర్తన ఉంటోంది. వేల, లక్షలమంది తోపులాటల మధ్య రెండు సెకన్ల పాటు చూసే ఆ దర్శనం, దైవ సాక్షాత్కారమా లేక “చూశాను” అని చెప్పుకోవడానికా?
దర్శన వ్యాపారం
భక్తి ఒక వ్యవస్థగా, ఒక వ్యాపారంగా రూపాంతరం చెందింది. భక్తి వేటిని వ్యతిరేకిస్తుందో ఆయా మార్గాలన్నీ దర్శనం దారుల్లో వ్యవస్థీకృతమై ఉన్నాయి. త్వరగా వెళ్లాలి, త్వరగా చూడాలి, త్వరగా బయటికి రావాలి అన్న ఆరాటంలో ఆలయం కాస్తా ఇసుకవేస్తే రాలని జనసాంద్రత ఉన్న కేంద్రమయ్యింది.
ప్రకృతి విధ్వంసం
క్షేత్ర మహిమలను పురాణాలు కీర్తించాయి. అది మన సంస్కృతి. కానీ ఆ క్షేత్రాలు కొలువై ఉన్న ప్రకృతిని మనం గౌరవిస్తున్నామా? హిమాలయాలను దేవుడి నివాసం అంటూనే పర్యాటక భారంతో వాటిని నలిపేస్తున్నాం. కొండలు కూలితే ప్రకృతి వైపరీత్యం అంటాం కానీ, మన అత్యాశే దానికి కారణమని ఒప్పుకోము. నదిని అమ్మ అని పిలుస్తూనే అందులో ప్లాస్టిక్ వ్యర్థాలను వేస్తాం. ప్రకృతిని బాధపెట్టే ఏ భక్తి కూడా దైవభక్తి అనిపించుకోదు.
మన ఇంట్లో, మన కాలనీ గుడిలో దేవుడు దేవుడు కాడా?
ఖాళీగా ఉండే గుడిలో దైవ దర్శనం చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. వాస్తవానికి, భక్తికి ప్రదేశం కంటే భావం ముఖ్యం. కాలనీలోని చిన్న గుడి అయినా లేదా మన ఇంట్లోని పూజ గది అయినా, దైవానికి, భక్తికి అవి సమానమే.
రద్దీగా ఉండే ప్రసిద్ధ ఆలయాల కంటే, ఖాళీగా ఉండే స్థానిక దేవాలయాల్లో ఏకాగ్రతతో ప్రార్థించుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను పెంచుతుంది. దేవుడు ఒక విగ్రహానికో లేదా నిర్దిష్ట ప్రదేశానికో పరిమితం కాదు. నిష్కల్మషమైన మనసుతో ఎక్కడ వేడుకున్నా ఆ పరమాత్మ ఆలకిస్తాడని భక్తులు తెలుసుకోవాలి.
మనకు అందుబాటులో ఉన్న చోట మనస్ఫూర్తిగా దైవాన్ని స్మరించుకోవడం ఉత్తమమైన పద్ధతి. మనం కోరుకుంటున్నది దర్శన భాగ్యమో? ప్రదర్శన భాగ్యమో? మనల్ను మనమే ప్రశ్నించుకోవాలి. లేకపోతే దేవుడు కూడా మనల్ను క్షమించడు.
- పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article