.
(డాక్టర్ మనోహర్ కోటకొండ . కడప . “9704799959 )….. “కస్తూరి రంగరంగా – నాయన్న కావేటి రంగరంగా…. శ్రీరంగ రంగ రంగా నిను బాసి – యెట్లునే మరచుందురా”
అన్నమయ్య వ్రాసిన ఈ లాలి పాటలోని పదాలతో ముత్తైదువలు పసుపు దంచడి వేళ పాడుకునే ‘సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగ’ జానపదుల పాట పుట్టింది.. ఆ దంపుడు పాటకు.. రాధాకృష్ణుల కేళీ విలాసం జత కట్టితే ఈ పాట పుట్టింది . (చిల్లెరకొట్టు చిట్టమ్మ సినిమా పాట)
Ads
అలా ‘దాసం గోపాలకృష్ణ’ గారు అన్నమయ్య సంకీర్తనను జానపదుల జావళిగా మార్చిన పాట ఇది..
ఆయనే వ్రాసిన చిల్లర కొట్టు చిట్టెమ్మ నాటకం గోదావరి జిల్లాలలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది.. ( ఆనాటకంలో చిట్టెమ్మ పాత్రధారి రత్నమాలిక తర్వాతి కాలంలో బాక్సాఫీసు కొట్టు వాణిశ్రీగా మారింది).
ఆ చిత్రంలోని చిట్టెమ్మ పాత్ర అత్యున్నతమైన భావాలతో చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరి సాయం మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో జీవించాలని కొట్టు పెడుతుందీ..
తోడు నీడగా పుంసంలేని పున్నయ్య అన్నగా ఆ ‘చిట్టప్ప’ కు తోడుంటాడు.
నీలాటి రేవుకు నీటి కోసం వచ్చిన ఆ పున్నయ్య. బిందెతో నీళ్లు తీసుకొని చిట్టెమ్మ దగ్గరికి వస్తాడు… అప్పటికే తన గుడిసె ముందు అన్నం కోసం ఎసరు పెట్టి బియ్యం దంచడం మొదలు పెడుతుంది చిట్టెమ్మ. పక్కనే ఉన్న గోదావరిలో పడవ సారంగు హైలెస్సా పాటకు తోడవుతుంది…. మొదట అల్లరి కృష్ణుని ఉద్దేశించి పాడుకుంటుంది..
“సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ ….”
అంటూ మొదలయ్యే పల్లవిలో ఇంటి ముందు ఆడుకుంటున్న తన బాలకృష్ణుడిని ఉద్దేశించి పాడుతుంది..
ఆ తర్వాత దంపుడు బియ్యాన్ని మంచం పైన ఆరబెడుతుంది..
ఇంకొక మంచం మీద ఆరబెట్టిన రెండవ వరుస దంపుడు బియ్యాన్ని తీసుకొని మూడోసారి దంచడం మొదలుపెడుతుంది.. పున్నయ్య బిందెతో నీరు తెచ్చి దించి తను ఆమె పనిలోనూ ఆమె పాటలోనూ మమేకమవుతారు.
- కథానాయక గోపిక అయిపోతుంది.. తన చెలికత్తతో కృష్ణుడు తనతో చేసిన అల్లరి చెప్పుకుంటుంది
అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు కృష్ణయ్య నా వద్దకు వచ్చి
కొంగుపట్టుకుని లాగి యమునకు తీసుకెళ్లాడు. అని ఆమె అంటే…
అయ్యో నన్ను చెలికత్తె అనుకుంటున్నావా నేనే నీ కృష్ణుడిని.
ఆ వనములో కొల్లలుగా నేను గొల్లభామలను కూడి ఆడితిని అని పున్నయ్య పాడుతాడు.
ఏల క్రిష్ణ ఈ అల్లరి .. రాతిరి మన కేళీవిలాసమయ్యాక ఇంటికొచ్చి నిద్రపోయానా ఉదయాన్నే లేచి అద్దంలో చూస్తే చెక్కిలి పైన అధరాల ముద్దుల ముద్ర చూడు అంటే అవును అద్దినట్లు ఉంది అంటాడు పున్నయ్య… ఇప్పుడు ఎలా స్వామి అందరూ చూసే వేళయింది కదా అంటూ గోముగా వాపోతుంది.
అలతి అలతి పదాలలో కృష్ణయ్య అల్లరిని దాసం గోపాల కృష్ణ గారు చక్కగా చిత్రిక పట్టారు.
- “అద్దమరేతిరి నిద్దురలోన
ముద్దుల కృష్ణుడు ఓ చెలియా…
నా వద్దకు వచ్చెను ఓ సఖియా””వంగి వంగి నను తొంగి చూచెనూ
కొంగు పట్టుకుని లాగేనుగా…
భల్ చెంగున యమునకు సాగేనుగా””అల్లావనమున కొల్లలుగా వున్న..
గొల్ల భామలను కూడితిని…
నే గొల్ల భామనై అడితిని””నిద్దుర లేచి అద్దము చూడ..
ముద్దుల ముద్దర ఓ చెలియా …
హబ్బ అద్దినట్టుంది ఓ సఖియా”
నాలుగే నాలుగు వాక్యాలతో రాధాకృష్ణుల యమునా తీరపు కేళీ విలాసాన్ని దాసం గోపాలకృష్ణ గారు మధురంగా రచించారు.. మధువనిని మన ముందు సాక్షాత్కరింప జేశారు
- ఈ పాటలో మనల్ని విశేషంగా ఆకర్షించేది శ్రీ మాడా వెంకటేశ్వరరావు గారి నటన.. సాక్షాత్తు అల్లరి కృష్ణుడు గోపికతో పాడినట్లుగా ఆయన అభినయించిన తీరు మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ‘గొల్లభామలతో ఆడితిని నే గొల్లభామనే ఆడితిని’ అన్నప్పటికీ మాడా గారి అభినయం ఎంత గొప్పగా ఉంటుందో..
ఆ గోపికను కృష్ణుడై ఆయన ఆట పట్టించే తీరు, నిలుచున్న భంగిమ, కొబ్బరాకును పిల్లల గ్రోవిగా ఉంచుకొని చూసిన అల్లరి చూపు …మనల్ని కట్టిపడి వేస్తుంది.
జయచిత్ర గారు దంచేటప్పుడు.. చాలా హుషారుగానూ.. రాధగా మారినప్పుడు చాలా సున్నితంగానూ చక్కగా చేశారు..
పాట మొదట్లో వచ్చే సరంగు ఆలాపన “బాన్సురి” నుంచి వస్తుందా అనేలా ” ఆలపించారు శ్రీ బాలు గారు.. సరంగు రాగాలలోని బాలు గారేనా కృష్ణుడిగా మారి గోముగా మాడా గారికి పాడినది అనిపిస్తుంది. తెలియని మృదుత్వం ఉంటుంది మాడా గారికి పాడిన నేపథ్యగానంలో.. జానకి గారి గురించి చెప్పేదేముంది ఆమె గమకాలతో సాగే చిరునవ్వు భలే ఉంటుంది… కృష్ణుడితో రాధ గుసగుసలాడుతున్నట్లుగా ఉంటుంది జానకి గారి గానం.
- ఆలాపన… పిల్లనగ్రోవి రాగాలతో పాట అద్భుతంగా కొనసాగుతుంది.
చిన్నటి కోలాటాల లయ ధ్వని, మృదంగంతో కలిసి పాట అంతా పరుచుకుంటుంది..
పడవ నడిపే సరంగుల ఆలాపనతో పాట మొదలైతే..
హైలెస్సా అయ్యా హైలెస్సా హయ్య ..అంటూ మొదటి చరణంలో మార్ధవంగానూ..
ఓహోహో అయ్యా ఓహోహో అయ్యా…అంటూ రెండవ చరణం లాలనలో సాగుతుంది..
రమేష్ నాయుడు గారి సంగీత జ్ఞానానికి ఇదో మెచ్చుతునక. ఈ సినిమాలోనే ఆయన పాడిన “తల్లి గోదారికే ఆటు పోటులు ఉంటే తప్పుతుందా మనిషికి తలరాత” అన్న సీనారే పాటకు ‘నంది అవార్డు’ ప్రారంభించిన సంవత్సరముననే పొందారాయన.
పల్లెలలో సర్వసాధారణంగా సాగే ఈ ఉదయపు కార్యక్రమాన్ని పాటకు నేపథ్యంగా ఉంచడం దర్శకరత్న ప్రతిభ. కొబ్బరి ఆకును పిల్లనగ్రోవిగా ఉంచడం.. బియ్యాన్ని రోలులో పోసి దంచే ముందు రోకటి కింద భాగాన్ని తుడవడం లాంటి సూక్ష్మ విషయాలను కూడా దర్శకుడు చక్కగా చిత్రీకరించారు.
దాసరి గారి ఎన్నో చిత్రాలను దృశ్యీకరించిన కే .ఎస్ .మణి గారి కెమెరా పనితనం చాలా అందంగా ఉంటుంది. సరంగు ఆలాపనతో మొదలయ్యే క్రేన్ షాట్ జూమ్ అవుట్ చేస్తూ కొబ్బరి చెట్టు మీదుగా సాగి కిందికి దిగుతూ గుడిసె ముందున్న జయ చిత్ర దగ్గరికి తీసుకు రావడం .. “వరుసగా సాగే పడవల ప్రయాణం” … అక్కడి నుంచి జూమ్ చేస్తూ.. జయచిత్ర గారి వైపుకు తీసుకురావడం ఆమె హావ భావాలను సరి అయిన ఫ్రేములో బిగించడం.. అక్కడి నుంచి.. గుంజకు కట్టిన మేక పిల్లల వైపు కెమెరా ట్రాలీ షాట్ .. కన్నుల పండుగే..
ఈ పాటలో గోదావరి యమున కావడం.. చిట్టెమ్మ గోపికగా మారడం..మాడా గారు చెలికత్తె గాను కృష్ణుడిగాను రూపాంతరం చెందడం గొప్ప వేడుక. సాహిత్యమే కాదు సంగీతం గానం అభినయం చిత్రీకరణ.. ఈ పాటను. చిరస్మరణీయం చేసింది….
Share this Article