.
Nàgaràju Munnuru ……. == కురువాపురం దత్తాత్రేయ స్వామి ఆలయం ==
దత్తాత్రేయ స్వామి భక్తులందరికీ స్వామి త్రిమూర్తుల అంశతో జన్మించారు అనే విషయం తెలిసిందే. ఇతరుల కోసం దత్త చరిత్ర క్లుప్తంగా చెబుతాను.
Ads
సత్వ గుణానికి ప్రతీక అయిన అత్రి మహర్షి, ద్వేషరహిత స్వచ్ఛతకు ప్రతీక అయిన అనసూయ దంపతుల కుమారుడే దత్తాత్రేయుడు. అనసూయను పరీక్షించాలని చూసిన త్రిమూర్తులు ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పుత్రుడి రూపంలో జన్మించారు. అందుకే ‘దత్త’ (ఇవ్వబడిన) అని పేరు వచ్చింది.
దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, శివుడి కలయిక కాబట్టి త్రిమూర్తి స్వరూపం అని, జ్ఞానాన్ని ప్రచారం చేసిన మొదటి గురువు కావడం వలన “గురువుల గురువు లేదా ఆది గురువు” అని, ప్రపంచాన్ని త్యజించి, నిర్మమకరంగా తిరుగుతూ ఙ్ఞానాన్ని బోధిస్తారు కాబట్టి దిగంబరుడు, అవధూత అని వివిధ పేర్లతో పిలవబడతారు. దత్తాత్రేయుడి ఫోటోల్లో కనబడే నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు, గోవు తల్లికి, సింహం రాజసానికి, త్రిశూలం త్రిమూర్తులకు ప్రతీకలు.

దత్తాత్రేయుడు అనేక అవతారాలు ఎత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీపాద శ్రీవల్లభుడిగా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్) మొదటి అవతారం కాగా, తరువాత అవతారాలు శ్రీ నృసింహ సరస్వతి (గానుగాపురం కర్ణాటక), శ్రీ మాణిక్య ప్రభు (హుమ్నాబాద్, కర్ణాటక), స్వామి సమర్థ (అక్కల్ కోట్, మహారాష్ట్ర) ముఖ్యమైనవి.
శ్రీపాద శ్రీవల్లభుడిగా పిఠాపురంలో అవతరించిన దత్తాత్రేయుడు కొన్నేళ్లకు పిఠాపురం వదిలి దేశంలో అనేక తీర్థ క్షేత్రాలలో తపస్సు చేయడానికి వెళ్ళారు. అలా తిరుగుతూ గోకర్ణం వచ్చారు. గోకర్ణ క్షేత్ర మహిమ కారణంగా రెండేళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నారు.

ఆ తరువాత కృష్ణా భీమా నదుల సంగమ ప్రదేశంలో నదిమధ్యలో ఉన్న కురువాపురం అనే దీవిలో సుమారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తరువాత శ్రీశైలం వద్ద పాతాళగంగలో అంతర్ధానం అయినట్లు, నేటికి దత్తాత్రేయుడు కురువాపురంలో సూక్ష్మరూపంలో తిరుగుతుంటాడని క్షేత్ర పురాణం చెబుతుంది.
దత్తాత్రేయుడు సుదీర్ఘకాలం తపస్సు చేసిన కురువాపురం గురించి దాదాపు సంవత్సరం క్రితం ముచ్చట లో ఆర్టికల్ చదివినప్పటి నుండి అక్కడికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను. పుణ్యక్షేత్రాల్లో వీలైతే ఒకరోజు నిద్ర చేయడం నాకు అలవాటు. అందుకోసం మొన్న శనివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా కురువాపురానికి బయలుదేరాము.
మాఊరు సదాశివపేట నుండి వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా వెళ్తే 193 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము మధ్యానం బయలుదేరడం వలన, వికారాబాద్ జిల్లాలో అనేక చోట్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్న కారణంగా మేము అక్కడికి వెళ్ళేసరికి సాయత్రం 7:30 అయ్యింది.
కురువాపురం వెళ్ళాలంటే కృష్ణా నది దాటి వెళ్ళాలి. చీకటిలో బోటు ప్రయాణం అనుమతి లేకపోవడంతో ఒడ్డునే ఉన్న పంచదేవ్ పహాడ్ గ్రామంలో ఉన్న శ్రీపాద ఛాయ ఆశ్రమంలో రూమ్ తీసుకుని అక్కడే బస చేశాము. పెద్దలకు ఒక్కొకరికి ₹700 చొప్పున ఛార్జ్ చేశారు. ఆశ్రమంలో ఉదయం టిఫిన్, మధ్యానం, రాత్రి భోజనం ఉచితమే.

ఉదయం నాలుగుగంటలకు నిద్రలేచి ఫ్రెష్ అయ్యి నది ఒడ్డుకు చేరుకున్నాం. నదిలో స్నానం చేసి ఆలయానికి వెళ్ళాలని ప్లాన్. నది ఒడ్డున ఘాట్ లలో స్నానం చేయవచ్చు కానీ మహిళలకి దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాట్లు లేవు.
సుదూర ప్రాంతంలో ఉండటం కావచ్చు, ఎక్కువ ప్రచారంలో లేకపోవడం వలన కావచ్చు కురువాపురం శ్రీపాద శ్రీవల్లభ ఆలయంలో భక్తుల రద్దీ చాలా తక్కువ. ఇక్కడ రెండు రకాల పూజలు అందుబాటులో ఉన్నాయి. అభిషేకం ₹250, మహాభిషేకం ₹500. ఏ టికెట్ తీసుకున్నా దంపతులను కూర్చోబెట్టి, ఆచమనం చేయించి, గోత్రనామాలతో సంకల్పం చేయించి, సంకల్పం, పూజ విశిష్టత గురించి పూజారి సవివరంగా భక్తులకు వివరించి పూజ చేయిస్తారు.
మండపంలో ఏర్పాటు చేసిన లైవ్ టెలికాస్ట్ ద్వారా గర్భగుడిలో జరిగే అభిషేకం, పూజ క్రతువు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించింది.
హైదరాబాదు నుంచి వెళ్లాలి అనుకునే భక్తులు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ మీదగా మక్తల్ వరకు వెళ్ళాలి. మక్తల్ నుండి అనుగొండ వెళ్ళేదారిలో 20 కిలోమీటర్లు వెళ్తే పంచదేవ్ పహాడ్ గ్రామంలో ఉన్న ఆశ్రమాల్లో బస చేయవచ్చు లేదా సూర్యాస్తమయం లోపు వెళ్తే కృష్ణా నది దాటి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న వసతులలో కూడా ఉండవచ్చు.
- కృష్ణా నదికి ఇవతలి ఒడ్డున ఉన్న పంచదేవ్ పహాడ్ గ్రామంలో ఉన్న వసతుల వివరాలు
శ్రీపాద ఛాయ ఆశ్రమం – 9912314718
శ్రీ దత్తాత్రేయ స్వామి పీఠం – 9848915490
విఠల్ ఆశ్రమం – 84989 01718
ముందుగా ఫోన్ చేసి వసతి బుక్ చేసుకోవడం మంచిది.
తక్కువ మంది భక్తులతో, ప్రశాంత వాతావరణంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న కురువాపురం దత్తాత్రేయ స్వామి ఆలయం సందర్శన నాకైతే మరిచిపోలేని అనుభవం ఇచ్చింది. వీలైతే ఈసారి రెండు మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్తాను.
ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః
– నాగరాజు మున్నూరు
Share this Article