·
( గొట్టిముక్కల కమలాకర్ ) …. రావణుణ్ని రామచంద్రుడు చంపేయడం ఖాయం అని బాలకాండ ప్రథమసర్గలోనే పాఠకులకు తెలుసు. ఎలా చంపేస్తాడనే ఉత్కంఠని రేకెత్తించి, కొసంటా ఏకబిగిన చదివించడం వాల్మీకి మహర్షి గొప్పతనం..!
మురారి ఎలాగూ చావడు; అసలే మహేషూ, పైగా కృష్ణ గారబ్బాయి. నిక్షేపంగా సోనాలీ బింద్రేని పెళ్లాడేసి నూరేళ్లూ బతికేస్తాడని మొదటి రీళ్లోనే ప్రేక్షకులకు తెలుసు. ఎన్నిసార్లు చావబోయి బతికేస్తాడనే ఆదుర్దాను పెంచేసేసి చివరిదాకా గోళ్లూ వేళ్లూ కొరికేసుకుంటూ రెప్ప వేయకుండా చూసేలా చేయడం కృష్ఞవంశీ ఇంద్రజాలం..!
Ads
మురారి..! …. వంశంలో పూర్వీకుడెవడో చేసిన ఛండాలప్పనికి నలభయ్యెనిమిదేళ్ల నిర్ణీత వ్యవధిలో పురుషులు విచిత్రంగా చస్తూ ఉంటారు. ఆ నేపథ్యమంతా పట్టుమని పది నిమిషాల్లో చూయించేసినా సినిమా పూర్తయ్యేదాకా ప్రేక్షకులకు గుర్తొస్తూ ఉంటుంది. మురారికేమవుతుందో అని భయమేస్తూ ఉంటుంది.
ఆకు రౌడీలు నీళ్లల్లో ముంచినా, గొల్లపూడింట్లో పామును పట్టుకున్నా, పసిబిడ్డను ట్రాక్టరు కింద పడకుండా కాపాడినా, చివర్లో చావు గుమ్మంలో ఉన్నా మురారిని చూస్తూ జాలి పడుతుంటాం. వాడి అల్లరిని, మంచితనాన్నీ చూస్తూ వాడిమీద అమ్మలా ప్రేమ పెంచేసుకుంటాం..!
మురారికి కష్టం వచ్చినప్పుడల్లా దేవుడంటే భయాన్నీ, భక్తినీ, కోపాన్నీ తెచ్చేసుకుంటాం..! గుళ్లో అమ్మవారితో “ఏం చూశాడమ్మా మురారి..? చిన్నపిల్లవాడమ్మా..! తననేం చేయకు..! ఏం చేయొద్దంతే..!!” అంటూ ఏడ్చేసిన దీక్షిత్ గారితో కలిసి మనం కూడా ఏడ్చేస్తాం..!

కొంచెం డ్రామా ఎక్కువైన ఉమ్మడి కుటుంబాలు రెండున్నా కుటుంబ పెద్దలుగా కీర్తిశేషులు కైకాలా; గొల్లపూడి గార్ల నటన అద్భుతం. ప్రసాద్ బాబు గారు సటిల్ గా సెటిలైన తీరు నభూతో…!
“డుండుండుం నటరాజు “అంటూ కృష్ణ గారబ్బాయిని ఎలివేట్ చేయగలిగే పాట పాటూరే వేటూరి తప్ప ఎవర్రాయగలరు..? ఐతే, “ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా..! అలనాటి రామచంద్రునికన్నింటా సాటి..!” అనే రెండు అజరామర గీతాలూ శాస్త్రి గారివే..! మణిశర్మ గారి గేయసంగీతం; నేపథ్యసంగీతం రెండూ అద్భుతాలు..!
నటులు తారలైతే కథని మింగేస్తారు. మహేష్ జన్మరీత్యా తారే ఐనప్పటికీ, పరిపూర్ణత కోసం కృష్ణవంశీ గారు పెట్టిన సృజనాత్మక చిత్రహింస వల్ల తరువాతి సినిమాల్లో నటుడిగా చాలా రాటుదేలిపోయాడు.

మురారి కథాపరంగా, కథనపరంగా ఓ అద్భుతం..!
తప్పటడుగుల మహేష్ కి నటుడిగా సరైన అడుగులేయించిన స్కూలు…!
తెలుగింటి పెళ్లిళ్లకు “అలనాటి రామచంద్రుడి” పాట ఏనాటికైనా నాదస్వరం..! ఆ పాటలో జిక్కి గారి గొంతు గట్టిమేళం..!
స్వప్నసుందరులను వెదుక్కునే కుర్రకుంకలకు “ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో” వెదుక్కోవాల్సిన అవసరం లేని ఓ రిఫరెన్సు..!
ఆ సినిమా నేపథ్యాన్ని మేమిద్దరమే ఉన్నప్పుడు స్వయంగా కృష్ణవంశీ గారు చెబుతుంటే, నేను వినగలగడం ఓ నోస్టాల్జియా..!
****
నేడు మళ్లీ మురారి విడుదలౌతోంది. మేమందరం మళ్లీ చూసేస్తాం..!
మేం మురారిని మరిచిపోయేలా ఇంకో సినిమా మీరే తీయాలి కృష్ణవంశీ గారూ…!
నిజానికి ఇదే మహేష్ బాబు మొదటి సినిమా కావల్సిందట... కానీ కథ దగ్గరే బోలెడంత మీమాంస... చాన్నాళ్లకు ప్రాజెక్టు వోకే అయిందని అంటుంటారు... రెండు కుటుంబాల్లోనూ పిల్లలను, పెద్దలను పరస్పరం సంబోధించుకునే తీరు బాగా వచ్చింది...
Share this Article