.
Subramanyam Dogiparthi …… ఏదో రోజు అందరూ పోవాల్సిందే . ఉన్నన్నాళ్ళు ఇష్టంగా మన కోసం , మన కోసమే బతకాలి , బతకాలి కదా ! ఇదో థియరీ . ఇదో జీవన రహస్యం . చాలామంది పోతామేమో పోతామేమో అనుకుంటూ ప్రతి క్షణం చస్తూ బతుకుతూ ఉంటారు .
చాలా కొద్దిమంది మాత్రమే అదుగో మీద పడుతుంది పడుతుంది అంటున్నా పడనీయ్ చూద్దాం అంటూ ఉంటారు . ఈ బేచే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు . ఉన్నన్నాళ్ళు ఇష్టంగా , తమకిష్టమయినట్లుగా జీవిస్తారు . వీళ్ళకు రేపు అనేది అనవసరం . ఈరోజు ఈ గంట ఈ నిమిషం ముఖ్యం , వాస్తవం .
Ads
ఈ ఫిలాసఫీ మీద తీయబడిందే ఈ cult classic mass musical splendour సినిమా గీతాంజలి . కనక వర్షంతో పాటు అవార్డుల వర్షం కురిసింది . నాగార్జున కెరీర్లో 1989 ఓ పెద్ద మైలురాయి . గీతాంజలి , శివ రెండు బ్లాక్ బస్టర్లు అతని ఎకౌంట్లో పడ్డాయి . రెండూ రెండే . రెండూ యూతుని ఊపేసాయి . రోడ్ల మీద డాన్సింపచేసాయి .
- అలాగే గిరిజ షెట్టర్ . 1969 లో ఇంగ్లాండులో పుట్టిన ఈ అమ్మాయి భరతనాట్యంలో కూడా నిష్ణాతురాలు . అల్లరి పిల్లగా అల్లరల్లరి చేసేస్తుంది . కనపడ్డ ప్రతి వారితో లేచిపోదామా అని అల్లరి చేసేస్తుంది . మరు క్షణంలో అయినా చచ్చిపోవచ్చనే అనుమానం ఉన్నా ఈ క్షణం అల్లరి చేయటమో , ప్రేమించిన వాడి కౌగిలిలో ఒదిగిపోవటమో చేసేస్తుంది పసిపిల్లగా .
ఇద్దరు అల్పాయుష్కుల ప్రేమ గాధ . హీరోకి లుకేమియా , హీరోయినుకి గుండె జబ్బు . Congenital Heart Defect . రెండూ ప్రాణాంతకమైన అరుదైన జబ్బులే . అడ్వాన్సుడు స్టేజిలో ఉన్నా ఎలా జీవించి ఉన్నారనేది డాక్టర్లకూ ఆశ్చర్యమే . బతకాలనే ఆశే బతికిస్తూ ఉంటుంది .
డిగ్రీ పట్టా ఇచ్చే లేడీ వైస్ చాన్సలరుకే ఐ లవ్ యు , చికిత్స చేసే లేడీ డాక్టరునే నన్ను పెళ్ళి చేసుకుంటారా అని సరసమాడే ఈజీ గోయింగ్ ఫెలో సినిమాలో హీరో నాగార్జున . అలాంటి హీరోకి లుకేమియా వ్యాధి రావటం , చుట్టూ ఉండేవారి సానుభూతిని భరించలేక ఒంటరిగా బతికేసేందుకు ఊటీ వెళ్ళిపోతాడు .
ఊటీలో తనలాగే అల్పాయుష్కురాలు తారసపడటం , ఆమె కూడా అచ్చు తనలాగే ఈజీ గోయింగ్ కావటం , ఒకరిని ఒకరు అల్లరి పెట్టుకోవటం , ఆ అల్లరి ఇష్టమై ప్రేమై వరదవుతుంది . సినిమా అంతా అల్లరి , పాటలు . అయితే వాటిని ఓ దృశ్య కావ్యంగా చూపారు మణిరత్నం ,
సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాం . తెలుగులో మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా కూడా ఇదే . ఆయన తమిళంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి . కాని డైరెక్ట్ తెలుగు సినిమా ఇదొక్కటే .
జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ సినిమా అవార్డు వచ్చింది . మణిరత్నానికి ఉత్తమ దర్శకునిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . ఉత్తమ చిత్రంగా , ఉత్తమ కధా రచయితగా మణిరత్నానికి , ఉత్తమ సినిమాటోగ్రాఫరుగా పిసి శ్రీరాంకు , ఉత్తమ కమేడియనుగా వేలుకు , బెస్ట్ కొరియోగ్రాఫరుగా సుందరానికి , ఉత్తమ కళాదర్శకుడిగా తోట తరణికి నంది అవార్డులు వచ్చాయి .
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటానికి ముఖ్య కారణాలు ఇళయరాజా సంగీతం , వేటూరి వారి పాటలు , బాలసుబ్రమణ్యం , చిత్ర , జానకమ్మ కంఠం . ప్రతీ పాట సూపర్ హిట్టే . జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం అంటూ సాగే కుర్రాళ్ళ పాట థియేటర్లో , కాలేజీ స్టేజీల మీద ఓ ఊపు ఊపేసింది . ముఖ్యంగా పాట మధ్యలో అందాల భామ సిల్క్ స్మిత దిగి వాళ్ళతో డాన్సించటం అద్భుతంగా చిత్రీకరించారు మణిరత్నం . Wonderful creativity .
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాని నీడలు రాలు పూలదండలు అంటూ సాగే ఈ అందమైన పాట రాజస్థాన్ ఎడారిలో షూట్ చేయబడింది . నందికొండ వాగుల్లోనా నల్ల తుమ్మ నీడల్లోన చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లోన అంటూ సాగే భయపెట్టే పాట కూడా గొప్పగా చిత్రీకరించారు .
ఓం నమః నయన శృతుల ఓం నమః హృదయ లయలకు ఓం నమః పాట చిత్రీకరణ, నాగార్జు, గిరిజ ముద్దు సీన్… హృదయాత్మకం… నభూతో…
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ ; కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ; ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తియ్యగా అంటూ సాగుతాయి మిగిలిన అత్యంత శ్రావ్యమైన పాటలు . Once again hats off to Ilaya Raja , Balu , Chitra , S Janaki and Veturi for making the movie an audio-visual splendour .
అనువాద చిత్రాల డైలాగులను వ్రాయటానికి పెట్టింది పేరయిన రాజశ్రీ ఈ స్ట్రైట్ సినిమాకు డైలాగులను చాలా గొప్పగా వ్రాసారు . ఇతర ప్రధాన పాత్రల్లో సుమిత్ర , విజయచందర్ , విజయకుమార్ , రాధాబాయి , డిస్కో శాంతి , సుత్తి వేలు , డబ్బింగ్ జానకి , ప్రదీప్ శక్తి , ముచ్చెర్ల అరుణ , చంద్రమోహన్ తదితరులు నటించారు .
ఇంత రిస్కుతో కూడుకున్న సినిమాను మణిరత్నాన్ని నమ్మి నిర్మించిన నిర్మాత నరసారెడ్డిని అభినందించాలి . ఢిల్లీలో 11 ఏళ్ళ బాలిక ఇలాంటి వ్యాధితో బాధపడుతూ వ్రాసిన కవితలు మణిరత్నానికి స్ఫూర్తిని ఇచ్చాయి . ఈ దృశ్య శ్రవణ కావ్యం యూట్యూబులో ఉంది . ఎన్ని సార్లయినా చూడవచ్చు . An unmissable movie .
నేను పరిచయం చేస్తున్న 1211 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
- వాస్తవానికి ఈ సినిమాకు “యంగ్ డై ఫస్ట్ “అనే సినిమా ప్రేరణ. గీతాంజలి కథ ఢిల్లీకి చెందిన గీతాంజలి అనే 12 ఏళ్ళ అమ్మాయికి చెందింది. 12 యేండ్లకే క్యాన్సర్ సోకిన ఆ అమ్మాయి తన మనసులోని భావాలను, బ్రతకాలనే కోరికలను ఒక వార్తాపత్రికలో ఉత్తరాలు రాయడంతో అది చదివిన మణిరత్నం “ఆమే పేరు మీదనే గీతాంజలి సినిమాను తీసారు…”
Share this Article