వై దిస్ కొలవెరి పాటలో ఏముంది..? ఏమీలేదు… జనానికి విపరీతంగా కనెక్టయిపోయింది…. రౌడీబేబీ పాటలో ఏముంది..? ఏమీలేదు… కానీ వంద కోట్ల వ్యూస్ దాటి ఇంకా దున్నేస్తూనే ఉంది… ఇప్పటి రెండు తరాలకు పెద్దగా తెలియకపోవచ్చుగాక… 45 దాటినవాళ్లకు తెలుసు… అమితాబ్ నటించిన నమక్ హలాల్ సినిమా ఎంత భారీ హిట్టో… 1982… హైదరాబాద్ కాచిగూడ చౌరస్తాలో మహేశ్వరిలో నమక్ హలాల్, పరమేశ్వరిలో డిస్కో డాన్సర్… ఎన్ని నెలలు ఆడాయో కూడా ఎవరికీ లెక్కలేదు… అసలే అమితాబ్ ప్రభ దివ్యంగా వెలిగిపోతున్న కాలమది… ఆపై స్మితాపాటిల్, పర్వీన్ బాబీ… ఎహె, అది కాదు… సాంగ్స్… బప్పీలహరి, కిషోర్ కుమార్, ఆశా భోంస్లే… జనానికి బప్పీ మార్క్ కొత్త రుచి… యువత వెర్రెక్కిపోయారు… ఓ సాదాసీదా కథ… ఓ మామూలు కమర్షియల్ పోకడ… అయితేనేం… హిట్టెస్ట్ సినిమాల జాబితాలో ప్రముఖంగా కనిపించే పేరు… ఈరోజుకూ యూట్యూబ్‌లో ఆ పాటలు రన్నింగులో ఉంటయ్…
క్లాసిక్ వేషాలు వేసుకునే స్మితాపాటిల్‌ను కూడా వర్షంలో తడిపేసి, చూపించేసి, స్టెప్పులు వేయించేసి, అమితాబ్‌తో కిందామీదా పడేయించి… ఆ తరువాత ఆమెను ఏడ్పించిన ‘ఆజ్ రపట్ జాయేతో’ పాట అయితే అప్పట్లో ఏ ఇంట్లోనైనా సరే స్టీరియో మోత మోగిపోయేది… అప్పుడప్పుడే స్టీరియో టేప్ రికార్డర్లు వస్తున్నయ్… తక్కువ ధరలతో మిడిల్ క్లాసు ఇళ్లల్లోకీ వస్తున్నయ్… స్టీరియో సరిగ్గా పనిచేస్తుందా లేదా చూడటానికి ఈ సినిమాలోని ఓ పాట వేసేవాళ్లు… ‘తోడీ సి పీలీ హై’… సోడా మూతను టప్‌మని ఓపెన్ చేయడం, గ్లాసులో పోస్తున్న శబ్దం గట్రా ఏ స్పీకర్ నుంచి ఎలా వస్తుందో పరీక్షించేవాళ్లు… నిజానికి అదీ కొలవెరి, రౌడీ బేబీ వంటి పాటే… కానీ అక్కడక్కడా కొన్ని చమక్కులు… ప్రత్యేకించి అమితాబ్ ఈజ్ దాని ప్రాణం… దద్దూను ఉడికించడానికి ఓ తాగుడు ప్రహసనానికి దిగే హీరో తనే అనుకోకుండా లవర్ ఎదుట బుక్కయిపోవడం… పాటలో రొమాన్స్, కోపం, ఆటపట్టించడం, దాని వెనుక బాధ అన్నీ ఉంటయ్… సరదాగా ప్రజెంట్ చేసినా సరే అవన్నీ ఒకేపాటలో ఆవిష్కరించడంలో అమితాబ్ సక్సెస్…
Ads
నాకు తెలియదా తాగడం తప్పని… కానీ ఏం చేయను..? దప్పికగొన్న ఈ రాత్రికి ఇదే అవసరం… అంటూ మొదలుపెట్టేసి… నలుగురు గరల్స్‌తో ఆడుతూ, పాడుతూ, తాగుతూ, తూలుతూ, పడుతూ, లేస్తూ… అమితాబ్ అప్పట్లో యువతకు ఆ పాటతో భలే నచ్చేశాడు… ఆ ఎత్తు, ఆ జుత్తు, ఆ ఈజ్, ఆ స్టయిల్… యువకులంతా అదే అనుకరణ… అనుకోకుండా ప్రియురాలికి దొరికిపోయినా… అసలే యవ్వనం మత్తు, ఆపై నీ ప్రేమ మత్తు… అవి రెండూ కలిసి మత్తు… ఆ మత్తు ముందు ఈ మందు మత్తు ఎంత అంటూ ప్లీజ్ చేసుకునే ప్రయత్నం… చూస్తున్నంతసేపూ బాగుంటుంది… తీరా మొత్తం చూశాక ఏమీ ఉండదు… అంతేగా… కాస్త మందేస్తే జరిగేది అదేగా… అమితాబ్ ఈ పాటలో చెప్పిందీ అదేగా…!!
Share this Article