.
సంక్రాంతి వాసనల్లేకుండా జీతెలుగు వాడు, స్టార్ మాటీవీ వాడు చేసిన సంక్రాంతి స్పెషల్ షోలు చూశాక… పైగా యాడ్ స్కిట్స్ పేర్చి తీసిన ఓ కమర్షియల్ యాడ్ సీరీస్ వంటి షోలు చూశాక… ఫాఫం, రియాలిటీ షోలు బాగానే తీస్తారు కదా, ఈటీవీ వాడు కాస్త పద్దతిగా, అలరించే స్పెషల్ షో తీసి ఉంటాడు అనుకుని చూడటమే పాపమైపోయింది…
పరమ పేలవమైన షో… ప్లస్ నాసిరకం… అదే జబర్దస్త్ టీమ్, వాళ్ల సీరియళ్ల నటీనటులు, సినిమా ప్రమోషన్లకు వచ్చే రవితేజ, అనిల్ రావిపూడి… సగటు రియాలిటీ షోలలో ఉండే అదే మ్యూజికల్ చెయిర్, ధనుంజయ్ కుటుంబం పాడిన ఐదారు పాటలు… ఇంకేముంది ఇందులో..? ఈటీవీ లేదా మల్లెమాల క్రియేటివ్ టీమ్‌లో క్రియేటివిటీ ఎప్పుడో అడుగంటిపోయినట్టుంది…
Ads
లేక ఆది చెప్పినట్టే నడవటానికి అలవాటు పడిపోయినట్టుంది… ఓ కొత్తదనం లేదు, అలరించే సృజన అస్సలు లేదు, సేమ్, ఆ రెండు వినోద చానెళ్లలాగే ఇందులోనూ సంక్రాంతి వాసనలే లేవు… ప్రతిచోటా కామన్‌గా కనిపించిన కేరక్టర్ ఒక్క కావ్య ఒక్కతే… జబర్దస్త్ బూతు స్కిట్లలాంటిదే ఇందులోనూ బుల్లెట్ భాస్కర్, ఫైమా, శాంతిస్వరూప్ తదితరులతో, ఈ పండుగ షోలో కూడా ఓ సేమ్ స్కిట్… పాపం ఈటీవీ..!
అదే నాగబాబు… ఆకాశానికెత్తేశారు… ఆర్టిస్టులు వచ్చిన తన కాళ్లు మొక్కడం, ఇక ఆది అయితే నాన్నగారు అంటూ మోత… ఆది అంటేనే పవన్ కల్యాణ్ కదా… ఓ మాస్ కంటెంట్ అంటూ అదేదో ఓజీ సినిమాలోని ఓ సీన్‌కు, అత్తారింటికి దారేదీ సినిమాలోన మరో సీన్‌కు పేరడీ చేశాడు… మూడు గంటల మొత్తం షోలో దాదాపు మొత్తం ఆది, నాగబాబుదే షో… ఢీ అంతే, శ్రీదేవి డ్రామా కంపెనీ అంతే…
చూసీ చూసీ సుమ యాంకరింగ్ మొనాటనీ వచ్చేస్తోంది… నిష్ఠురంగా ఉన్నా సరే, శ్రీముఖి కయ్ కయ్ అని అరుస్తుంది గానీ, అత్యంత సీనియర్ సుమను కూడా దాటిపోతోంది బెటర్ యాంకరింగులో… ఈ పండుగ షోకు సుమ యాంకరిణి…
టీవీ నటుడు మహేష్‌కు కొత్తగా పెళ్లయింది… వాళ్లను కూర్చోబెట్టి మళ్లీ పెళ్లి చేశారు, తాళి కట్టించారు… అందులో ఫన్ ఏముందో ఈటీవీ వాడికే తెలియాలి… మొత్తం మూడు తెలుగు వినోద చానెళ్లలోనూ సంక్రాంతి ఛాయలు వీసమెత్తు కనిపించకుండా స్పెషల్ యాడ్ షోలు నడిపించేశారు… అందరూ మూడేసి గంటలు బాదేసి వదిలారు..!!
మనుగుడుపులు అంటే పెళ్లి అయిన కొత్తలో, పెళ్లికూతురు తరఫువారు అల్లుడిని తమ ఇంటికి పిలిచి చేసే విందు, ఆతిథ్యం; లేదా పెళ్లి తర్వాత వధువు తొలిసారిగా అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఇచ్చే కానుకలు, సత్కారాలు అని అర్థం, ఇది సంప్రదాయంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం… సంక్రాంతికి వస్తే ఆ అల్లుడికి దక్కే మర్యాదలు వేరు…
కొత్తగా పెళ్లయిన మహేష్ దంపతులను కూర్చోబెట్టి రకరకాల వంటకాలు వడ్డించారు… ఈ సందర్భంగా ఎవరో ఆర్టిస్టు ‘మనుగుడుపులు’ అనే పదం వాడాడు… కరెక్టు పదం… కానీ వెంటనే ఆది అందుకుని తనదైన భాషలో — గుడు– అని ఏదో బూతు కూత… ఎడిటింగులో ఆ పదం సరిగ్గా వినిపించకుండా ఆడియో బ్లర్ చేశారు… అక్కడ ఏ పదం ఉందో మీరే ఊహించండి… ఈటీవీని చూసి జాలిపడండి..!!
Share this Article