Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్‌… తెలంగాణ బాలికలకు భలే చాన్స్…

November 29, 2026 by Rishi

.

( Bolgam Srinivas )…. జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్‌… ఖేలో ఇండియాలో తొలిసారి అవకాశం… గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలో పోటీలు… జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలంగాణ బాలికలు… 2028 ఒలింపిక్స్‌లోనూ సాఫ్ట్‌బాల్‌కు చోటు…

తెలంగాణ వేదికగా జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో మరో క్రీడకు ఈసారి కొత్తగా అవకాశం దొరికింది. ఖేలో ఇండియా చరిత్రలో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌ను ఈ పోటీల్లో చేర్చారు. ఇప్పటివరకు జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లు, పాఠశాలల క్రీడల్లో ప్రతిభ చాటుతున్న యువ క్రీడాకారులకు ఖేలో ఇండియా మరో వేదిక కానుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలో ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు విజయాలు సాధించిన తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు సొంతగడ్డపై ప్రతిభను చాటుకునే అవకాశం లభించింది.

Ads

బేస్‌బాల్‌ను పోలిన ఆట

సాఫ్ట్‌బాల్‌ క్రీడ బేస్‌బాల్‌ను పోలి ఉంటుంది. క్రికెట్‌ మాదిరిగానే బ్యాట్‌, బంతితో ఆడతారు. ఫీల్డింగ్‌ చేసే జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లు ఫీల్డ్ లో ఉంటారు. ఒక జట్టు బ్యాటింగ్‌ చేస్తే మరో జట్టు ఫీల్డింగ్‌ చేస్తుంది. మైదానంలో వజ్రాకారంలో నాలుగు బేస్‌లు ఉంటాయి. బ్యాటర్‌ బంతిని కొట్టిన తర్వాత వరుసగా బేస్‌లను దాటుతూ తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటే ఒక పరుగు లభిస్తుంది. సాధారణంగా ఏడు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ జరుగుతుంది. బేస్‌బాల్‌తో పోలిస్తే సాఫ్ట్‌బాల్‌ గ్రౌండ్‌ చిన్నది. బంతి సైజ్‌ పెద్దది. చేతిని కింది నుంచి ఊపుతూ బంతిని విసరటం ఈ క్రీడ ప్రత్యేకత.

ఒలింపిక్స్‌లో మళ్లీ చోటు

1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో తొలిసారిగా మహిళల సాఫ్ట్‌బాల్‌ను చేర్చారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఈ క్రీడకు కొంతకాలం విరామం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో తిరిగి అవకాశం కల్పించారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ క్రీడకు చోటు దక్కలేదు. 2028లో అమెరికాలో జరిగే లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లోనూ సాఫ్ట్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఆరు దేశాల మహిళల జట్లు ఈ పోటీల్లో తలపడతాయి. ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్‌కు తిరిగి చోటు దక్కిన నేపథ్యంలో భారత్‌లోనూ ఈ క్రీడకు ప్రాధాన్యం పెరుగుతోంది.

జాతీయ పోటీల్లో తెలంగాణ సత్తా

సాఫ్ట్‌బాల్‌లో తెలంగాణ బాలికలు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. 2024 అక్టోబరులో ఏపీలోని నంద్యాలలో జరిగిన 42వ జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది డిసెంబరులో జమ్మూలో జరిగిన 37వ జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లోనూ తెలంగాణ బాలికలు విజేతలుగా నిలిచారు. ఫైనల్లో ఏపీ జట్టును 5–2 తేడాతో ఓడించారు. ఈ ఏడాది గోవాలోని వాస్కోడగామాలో జరిగిన 22వ సీనియర్‌ దక్షిణ మండల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ను 5–3 తేడాతో ఓడించింది.

జిల్లాల్లోనూ ప్రతిభావంతులు

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు రాణిస్తున్నారు. ఈ నెలలో నిర్మల్‌లోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జరిగింది. ఫైనల్లో మహబూబ్‌నగర్‌ జట్టును 6–4 తేడాతో ఓడించి నిజామాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 18 నుంచి 22 వరకు చండీగఢ్‌లో జరిగిన 70వ జాతీయ పాఠశాలల అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ పోటీల్లోనూ తెలంగాణ ప్రాతినిధ్యం వహించింది.

ఖేలో ఇండియాలో సాఫ్ట్‌బాల్‌ పోటీల నిర్వహణకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) 40 మంది సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్‌బాల్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల్లోనూ సాఫ్ట్‌బాల్‌కు చోటు కల్పించింది. జాతీయ స్థాయిలో ఇప్పటికే సత్తా చాటుతున్న తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు ఖేలో ఇండియా పోటీలు మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం కల్పించనున్నాయి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్‌… తెలంగాణ బాలికలకు భలే చాన్స్…
  • డేటా సెంటర్లలో దేశంలోనే రెండో స్థానం… కొత్త జీసీసీల్లో హైదరాబాద్ అగ్రస్థానం…
  • వాయుసేన విన్యాసాలు … ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్‌పో…
  • లోకేష్ & పవన్.., అన్నమయ్యను తెలుగు ప్రతీకగా ప్రకటించండి…
  • ఓ క్షుద్ర మోసం ! బిడ్డ మనసు మార్చడానికి ‘క్షుద్ర పూజలు’..!
  • కత్తులు లేవు… రక్తపాతం లేదు… అయినా గుండెను తాకే ‘ఓ అమ్మ కథ..!
  • డీలిమిటేషన్‌తో మారిపోనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!!
  • ఓహో… జగన్ యలహంక ప్యాలెస్ అసలు లీగల్ కథ ఇదన్నమాట!!
  • రియల్ మాటల మాంత్రికుడు- గురూజీ ఈయనే… పేరు పింగళి !!
  • రాజకీయం వీథి నాటకమైతే…. కనిపించేవి ‘బావర్చి బిర్యానీ’ సీన్లే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions