.
గంటెలు, రిబ్బన్లు, స్టిక్కర్ల శుష్క భాష నుంచి బయటికొచ్చి… హరీష్ రావు అర్జెంటుగా చదవాల్సిన ఓ సబ్జెక్టు ఏమిటంటే..? రాజ్యాంగబద్ధంగా, పరిపాలనా పరంగా “ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ” (Government is a continuous process)…
- ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేదా మంత్రులు మారవచ్చు… కానీ ‘ప్రభుత్వం’ అనే సంస్థ అలాగే ఉంటుంది… పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రారంభించిన ప్రాజెక్టులు కొత్త ప్రభుత్వం వచ్చినా చట్టబద్ధంగా కొనసాగుతాయి… కొనసాగాలి…
Ads

ఈ స్పూర్తిని కొనసాగించే ప్రభుత్వాలను, నాయకులను, పార్టీలను అభినందించాలి… ఆ గుణం తమకు లేకపోయినందుకు చింతించాలి కూడా… విషయం ఏమిటంటే..? హరీష్ రావు ఇన్నేళ్లు ప్రజాజీవితంలో, రాజకీయాల్లో ఉన్నాడు కదా… ఈ బేసిక్ తెలియకుండానో, తెలిసీ కావాలనో మాట్లాడుతున్నాడు…
మొన్నటి దాకా హరీష్ రావు కాస్త పద్దతిగా మాట్లాడతాడు అనుకునేవాళ్లు, కేటీయార్ అడ్డదిడ్డంగా వాదిస్తాడని అనుకునేవాళ్లు… ఇప్పుడు ఫుల్ రివర్స్ అయిపోయింది… హరీష్ రావు తనపై జరుగుతున్న ముప్పేట దాడితో సంయమనం కోల్పోతున్నట్టుంది…
రేవంత్ రెడ్డి రెండు చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించాడు… 1) చనాక కొరాట బరాజ్ 2) సదర్‌మాట్ బరాజ్… ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు మేలు… కేసీయార్ హయాంలో ప్రారంభమై, 90-95 శాతం పూర్తయిన ఆ నీటి ప్రాజెక్టులు కేసీయార్ ఘనతే, ఈరోజు అవి ప్రారంభింపబడటం సంతోషదాయకం అని కేటీయార్ ట్వీటాడు… హుందాగా ఉంది… క్రెడిట్ కేసీయార్‌కు ఇవ్వడంలోనూ తప్పులేదు, సహజమే…
కానీ హరీష్ రావు ఏమంటాడంటే..? ‘‘ఈ రేవంత్ రెడ్డి మేం కట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడానికి, రిబ్బన్లు కత్తిరించడానికి రెడీగా ఉంటాడు… కాంగ్రెస్ స్టిక్కర్లు వేస్తాడు… వంట మేం వండితే తన ఘనత అన్నట్టు గంటె (గరిట) పట్టుకుని ఫోజులిస్తాడు… మేం ఉద్యోగాలిస్తే ఈయన నియామక పత్రాలు ఇస్తాడు…’’
అంటే..? అంటే హరీషూ, కేసీయారూ… మీదే గ్రేట్‌నెస్, మీరే గ్రేట్, కమాన్ రిబ్బన్లు కత్తిరించండి మీరే, మీ స్టిక్కర్లే కొట్టుకొండి, మీ గంటెలతోనే మీ వంటను వడ్డించండి అని పిలవాలా..? తను తెర వెనక్కి వెళ్లిపోవాలా..? ఇదేం ‘కత్తెర భాష..?

ప్రాణహిత- చేవెళ్ల కడితే కాంగ్రెస్‌కు, వైఎస్‌కు పేరొస్తుందనే భావనతో… దాన్ని అడ్డగోలుగా మార్చి, కమీషన్ల ప్రాజెక్టుగా మార్చి, చివరకు మేడిగడ్డ కుంగడానికి కారణమైంది ఎవరు..? కేసీయార్… దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పండబెట్టి, కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాలకు నష్టం చేసింది ఎవరు..? కేసీయార్…
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీయార పాపాలను కూడా తనే మోస్తూ… ప్రభుత్వం అంటే ఓ నిరంతర ప్రక్రియ అనే స్పిరిట్ కనబరుస్తుంటే గంటెలు, రిబ్బన్లు భాషలో వెక్కిరిస్తున్నాడు హరీష్ రావు… ఎవరు కరెక్ట్..? కేసీయార్ తెలంగాణ నెత్తిన మోపిన రెండు వైట్ థర్మల్ ఎలిఫెంట్లను కూడా, ఆల్రెడీ ప్రజాధనం వెచ్చింపబడింది కాబట్టి కొనసాగిస్తున్నాడు…
హరీష్ రావు భాష ఎలా ఉందంటే..,? మేం ప్రారంభించినవన్నీ అలాగే పఢావు పెట్టేయాలి, మేమొచ్చాక మళ్లీ మా పింక్ రిబ్బన్లు మేం కత్తిరిస్తాం అన్నట్టుంది… అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు, మరి ఆ అయ్యవారే ఇక వచ్చే సూచనలు లేనప్పుడు ఏం చేయాలి..? ఉద్యోగుల నియామకపత్రాలు ఇవ్వకుండా, కేసీయార్ వచ్చాక ఇస్తాడులే అని వదిలేసి ఉండాల్సిందా..?
తెలంగాణ ప్రజలకు పరోక్షంగా ఏం చెబుతున్నట్టు..? మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్ వంటి రేవంత్ రెడ్డి భారీ ప్రాజెక్టులు మేమొస్తే ఆపేస్తాం, రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కనివ్వం, ఏ పార్టీ ప్రాజెక్టులు వాళ్లవే, అదే మా విధానం అని చెబుతున్నట్టా..? అవి పూర్తయ్యేవరకూ రేవంత్ రెడ్డినే గెలిపించండి అని పిలుపునిస్తున్నట్టా..?! అన్నట్టు, ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేయబడతాయి, పార్టీ నిధులో, సొంత డబ్బులో కాదు..!!
నిజమైన ప్రజా నాయకుడు తన హయాంలో మొదలైన పనిని ఇంకొకరు పూర్తి చేసినప్పుడు, “నేను వేసిన పునాది నేడు ఫలాలను ఇస్తోంది” అని గర్వపడాలి… అంతేకానీ “నా రిబ్బన్ కట్ చేశారు” అని బాధపడటం ఆ నాయకుడి స్థాయిని తగ్గిస్తుంది… హరీష్ రావు వాదన ఎలా ఉందంటే..? మేం స్టార్ట్ చేసిన వంట మేమే వడ్డించాలి, అంతే… ఇంకెవరూ వడ్డించకూడదు, అది పులిసిపోయినా సరే, పాచిపోయినా సరే..!!
“ప్రభుత్వ మార్పు అనేది కేవలం వ్యక్తుల మార్పు మాత్రమే కాదు, అది బాధ్యతల బదిలీ… పాత ప్రభుత్వం వేసిన పునాది మీద కొత్త ప్రభుత్వం గోడలు కడుతుంది… ఆ గోడలకు తమ రంగులు వేసుకోవడం రాజకీయంగా సహజమే కావచ్చు, కానీ అసలు గోడలే కట్టొద్దు అనడం లేదా మేమే వచ్చి సున్నం వేస్తాం అనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం…”
Share this Article