.
వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని వరి సాగును గణనీయంగా డిస్కరేజ్ చేసిన బీఆర్ఎస్ క్యాంపు… ఇప్పుడు వరి ఉత్పత్తిలో తెలంగాణ ఘనంగా దూసుకుపోయి, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో… ఇదంతా మా ఘనతే అని భుజాలు చరుచుకుంటోంది…
వరి వద్దన్నవాడు, ఆ రికార్డు వరి క్రెడిట్ ఎలా తీసుకుంటాడు..? ప్రతి విషయంలోనూ కేసీయార్ బ్యాచ్ అంతే… నో, నో, కేసీయార్ వరి ఎప్పుడు వద్దన్నాడు..? అంతా అబద్ధం అంటారేమో… ఈ దిగువ క్లిప్ ఓసారి చూడండి…
Ads

ఎందుకు ఇలా డిస్కరేజ్ చేశాడు..? కేంద్రం ధాన్యం ఎక్కువగా కొనడం లేదని…! కానీ కేంద్రం కొనుగోళ్ల మీద ఆధారపడకుండా… స్వీయవాడకం (self consumption) అనే ఆలోచన చేతకాలేదు కేసీయార్‌కు ఆనాడు…
ఎఫ్‌సీఐ గోదాములన్నీ మత్తడి దూకుతూ… ఆహార నిల్వలు పరిమితి దాటిపోయి… ఎగుమతులూ లేక… ఇక బాయిల్డ్ రైస్ ఏమాత్రం కొనే చాన్స్ లేక కేంద్రం కొనుగోళ్లు- సేకరణ తగ్గించింది… అది అనివార్యత… కొని సముద్రంలో పారపోయలేదు కదా…
ఓ కేంద్ర మంత్రి మనల్ని నూకలు తిని బతకమంటున్నాడు అని అప్పట్లో బదనాం క్యాంపెయిన్ కూడా నడిపింది కేసీయార్ ప్రభుత్వం కొన్నాళ్లు…

కేసీయార్ మరిచిపోయిన సత్యం ఏమిటంటే..? వ్యవసాయం, అందులోనూ తిండిగింజలు, మరీ ముఖ్యంగా వరి సాగు అనేది రైతు జీవనవిధానంలో ఓ భాగం… వద్దంటే ఊరుకోడు… అందుకే రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తానని చెప్పి రైతుల్ని సన్నాల వైపు మరల్చాడు… సాగు పెరిగింది…
అదే ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, పేదలు కూడా సన్నబియ్యం తినే అవకాశం కల్పించాడు… దీంతో వరిని అడ్డుకోవాల్సిన పనీ లేదు, కేంద్రం మీద పడి రాజకీయంగా ఏడవాల్సిన పనీ లేదు… పైగా పేదలకు రుచికరమైన సన్నన్నం..!!

కానీ కేటీయార్ ఏమంటున్నాడు..? (ఆయన ట్వీట్ తెలుగు అనువాదం ఇదీ…)
నీటి కొరతతో, కరువుతో వ్యవసాయ సంక్షోభం సర్వసాధారణంగా ఉన్న దుస్థితి నుండి – కేవలం పదేళ్లలోపే భారతదేశంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ… అంటే ఇదే అసలైన కేసీయార్ నాయకత్వం –
“రైతే ముందు” అనేది కేవలం ఒక నినాదం కాదు, అది కేసీఆర్ ప్రభుత్వ విధానంగా మారింది… రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కింద చిన్న నీటిపారుదల చెరువులను పునరుద్ధరించడం వంటి రైతు స్నేహపూర్వక విప్లవాత్మక కార్యక్రమాలతో…. తెలంగాణ వ్యవసాయ విజయ గాథ భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శం అని నేను గర్వంగా చెప్పగలను…

వద్దూ, వద్దూ, వరి వేయొద్దూ అని నినదించిన రోజుల్ని మరిచిపోయినట్టున్నాడు... రైతు బంధు నిజమైన రైతులైన కౌలు రైతులకివ్వలేదు, కాళేశ్వరంతో అదనపు ఆయకట్టూ రాలేదు, ఉచిత విద్యుత్తు వైఎస్ పుణ్యం, రైతు బీమాతో ఉత్పత్తి పెరగదు, పంటల బీమా మీద దృష్టి పెట్టలేదు, మరి ఈ క్రెడిట్ చోరీ దేనికి..?! ఇది కేవలం తెలంగాణ రైతాంగం కాలరెగరేయాల్సిన రికార్డు, సొంత రిస్క్, సొంత శ్రమ, సొంత ఖర్చు, సొంత పెట్టుబడి, సొంత రికార్డు... సరే, మరో విషయం చెప్పుకుందాం... ఓసారి ఈ చార్ట్ చూడండి...

ఇది రాష్ట్రాలవారీగా వరి ఉత్పత్తి వివరాలు… కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కలే ఇవి… ఒకప్పుడు అన్నపూర్ణ అని ఆంధ్రప్రదేశ్‌కు పేరు… కృష్ణా, గోదావరి డెల్టాలకుతోడు ప్రాజెక్టుల కింద ఆయకట్టు… మరి ఇప్పుడు ఏమైంది అన్నపూర్ణకు..?
తెలంగాణలో 168.8 లక్షల టన్నులు పండితే… ఆంధ్రలో కేవలం 73.4 లక్షల టన్నులు… ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఎక్కడో వెనుకబడిపోయింది… దీనికి జగన్, చంద్రబాబుల్లో ఎవరు జవాబు చెప్పగలరో తెలియదు గానీ… కనీసం ఓ అధ్యయనమైనా చేయిస్తున్నదా ఏపీ ప్రభుత్వం..?

ఇదే చంద్రబాబు ప్లస్ తన బాలయ్య బాపతు బ్యాచ్ పదే పదే అంటుంటారు… ‘తెలంగాణకు తెల్లన్నం పెట్టింది మేం, వ్యవసాయం నేర్పింది మేం’ అని..! ఎన్టీయార్‌లు, చంద్రబాబులు కళ్లు తెరవకముందే బిర్యానీలు ఘుమఘుమలాడిన నేల ఇది…
2015లో ఆంధ్రప్రదేశ్ 74.9 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, తెలంగాణ 30.5 లక్షల టన్నులను ఉత్పత్తి చేసింది… పదేళ్ల తర్వాత, తెలంగాణ 168.8 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, ఆంధ్రప్రదేశ్ 73.4 లక్షల టన్నులను మాత్రమే ఉత్పత్తి చేసింది… అంటే ఆంధ్రప్రదేశ్ అక్కడే ఆగిపోయింది… పైగా కాస్త తగ్గింది కూడా…

కానీ తెలంగాణ..? ఏకంగా ఐదు రెట్లు అధికంగా పండించింది… ఈరోజు దేశానికి తిండి పెడుతున్నది ఒకప్పుడు ఈ బ్యాచులు వెక్కిరించిన తెలంగాణ రైతే… తెలంగాణలో 16 శాతంతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో వ్యవసాయ రంగం ఇప్పటికీ 30 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది… దాని శ్రామికశక్తిలో 50 శాతానికి పైగా ఉపాధి కల్పిస్తోంది…
మరెందుకు వెనకబడిపోయింది ఒకప్పటి అన్నం గిన్నె..? ఏమైంది అన్నపూర్ణకు..? తెలంగాణ నీళ్లను కూడా వాడేసుకుంటున్నా సరే మరి ఎందుకిలా చతికిలపడిపోయినట్టు..? ఎక్కడుంది లోపం..? జగన్, చంద్రబాబు ప్రభుత్వాల వైఫల్యాల మీద చర్చ ఎందుకు జరగదు..?!

Share this Article