Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?

January 17, 2026 by M S R

.

Bhavanarayana Thota…. ఇంటి నుంచి పారిపోయి వార్తలో దొరికిన కుర్రాడు… 2006 లో ఒకరోజు…. అప్పట్లో మాటీవీ న్యూస్ హెడ్ గా పనిచేస్తున్నా… కర్నూల్ జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఫోన్. ఆ ఊరి సర్పంచ్ మాట్లాడాడు.

విషయమేంటంటే…. ఆ ఊరికి చెందిన ఒక కుర్రవాడు నాలుగేళ్ళక్రితం ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అతణ్ణి మా టీవీ వార్తల్లో చూశామని వాళ్ళకు తెలిసినవాళ్ళెవరో చెప్పారంట. అడ్రెస్ కావాలంట. ఏరోజు ఎప్పుడు చూపించిందీ వాళ్లకు కచ్చితంగా తెలియదు.

Ads

రోజుకు ఐదు బులిటెన్స్ ప్రసారమయ్యే రోజుల్లో సాధారణంగా ఒక బులిటెన్ లో వచ్చిన వార్త ఇంకో బులిటెన్ లో వచ్చే అవకాశం చాలా తక్కువ… మరీ ముఖ్యమైతే తప్ప. అప్పటికే న్యూస్ ఛాన్సల్ మొదలవటంతో ఎప్పటికప్పుడు కొత్త వార్తలు ఇవ్వాల్సిందే.

ఆ వార్త చూసిన వాళ్ళను అడిగి ఇంకేమైనా వివరాలు చెప్పగలరేమో కనుక్కోమని చెప్పా. కానీ ఏ రోజు అని గాని, ఏ టైమ్ లో చూశారని గాని చెప్పగలరేమోనని నా ఆశ. వాళ్ళు నా ఫోన్ నెంబర్ కనుక్కోవటానికి ఎంత కష్టపడ్డారో ఊహించుకుంటే ఆ కుర్రాడి కోసం ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతూనే ఉంది.

గంట తరువాత మళ్ళీ ఫోన్. మొత్తానికి మరికొన్ని వివరాలు చెప్పారు. ఇప్పుడు ఆ కుర్రాడి వయసు ఇరవయ్యేళ్ళని, వార్తల్లో చూసినప్పుడు ముదురు నీలం రంగు చొక్కా వేసుకున్నాడని వార్తలు చూసిన మనిషి చెప్పాడంట. ఏ రోజు, ఏ టైమ్ వార్తల్లో కనిపించాడో మాత్రం వాళ్లకు గుర్తు లేదని చెప్పారు. నాలుగైదు రోజుల కింద మాటీవీ వార్తల్లో చూశామని మాత్రం చెప్పారు. సరే, మేం చెక్ చేసి ఇదే నెంబర్ కి ఫోన్ చెబుతానని హామీ ఇచ్చా.

  • ఎందుకైనా మంచిదని మూడు రోజులకు వెనకటి ఐదు రోజుల వార్తల టేపులు తెప్పించుకున్నా. అంటే, మొత్తం 25 బులిటెన్లు. ఒక్కొక్కటి అరగంట. వరుసగా చూడటం మొదలుపెట్టా. ఎక్కడా అలాంటి వాడు మా వార్తల్లో కనబడలేదు.

ఆ సాయంత్రం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. దీంతో ఆ రాత్రికి ఆఫీసులోనే ఉండిపోయి ఒక్కో టేప్ చాలా జాగ్రత్తగా చూశా. ఒకచోట కాస్త అనుమానం వచ్చింది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర పనిచేసే కుర్రాడు వాళ్లు చెప్పిన పోలికలకు దగ్గరగా ఉన్నాడు.

missing son

అప్పటికి ఫోన్లో వీడియో పంపే సౌకర్యం లేదు. కానీ ఫోన్ చేసి, పెట్రోల్ బంక్ దగ్గర చూశారా అని అడిగితే, మళ్ళీ ఆ చూసిన మనిషికి చెప్పి గుర్తు చేస్తే అవునని చెప్పాడట. అదే విషయం నాకు ఫోన్ చేసి చెప్పగానే ఆ వీడియో పక్కనబెట్టి చూస్తే అది మేం పెట్రోల్ ధరలకు సంబంధించిన వార్త కోసం వాడుకున్న పాత వీడియో (ఆర్కైవల్ ఫుటేజ్).

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పాత వీడియోలు వాడుకోవటం అలవాటే. బంగారం ధరలు పెరిగాయనగానే బంగారం షాపులు, నగల వీడియోలు చూపించినట్టే ఇది కూడా. వార్త ప్రసారం చేసిన తేదీ తెలిసినా, అందులో వాడుకున్నది పాత వీడియో కాబట్టి అది ఎవరు, ఎప్పుడు తీసిందీ తెలిసే అవకాశం లేదు.

అందుకని కెమెరామెన్ అందరినీ పిలిచి ఆ వీడియో తీసింది ఎవరని అడిగితే శ్రీనివాస్ అనే కెమెరామన్ దాదాపు ఏడాది కిందట అది తీసింది తనేనని చెప్పాడు. అదెక్కడో చెప్పమంటే అతనికీ గుర్తు రాలేదు. ఇక అసైన్ మెంట్ రిజిస్టర్ తెప్పించి దాదాపు ఏడాది వెనక్కి వెళ్ళి చూస్తే అప్పట్లో పెట్రో ధరల వార్తకోసం వెళ్ళినట్టు ఉంది. అలా గుర్తు చేసుకున్న మీదట ఫలానా పెట్రోల్ పంప్ అని చెప్పాడు.

సరేనని నేనే అక్కడికెళ్లాం. ఆ పెట్రోల్ పంప్ మేనేజర్ ని కలిసి విషయం చెప్పా. అతని పేరు చెప్పగానే వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడని, వాళ్ళే అతనికి రూమ్ కూడా ఇచ్చారని చెప్పాడు. అలా మాట్లాడుతూ ఉండగానే అతను వచ్చాడు. కానీ అసలు విషయం చెబితే కనబడకుండా పోతాడేమోనని భయం. అందుకే రెండు రోజులపాటు అతను ఎటూ పోకుండా జాగ్రత్తలు తీసుకోమని ఆ మేనేజర్ కి చెప్పా.

మా కర్నూల్ రిపోర్టర్ కి ఆ ఊరి పేరు, సర్పంచ్ వివరాలు చెప్పా. అక్కడికి వెళ్ళి సర్పంచ్ ని కలిస్తే ఆయన ఆ కుర్రాడి ఇంటికి తీసుకెళ్ళాడు. మా రిపోర్టర్ ఇక్కడి విషయాలన్నీ ఆ సర్పంచ్ ద్వారా చెప్పించి ఆ కుర్రాడి అమ్మానాన్నలను తీసుకుని మా టీవీ ఆఫీసుకు వచ్చాడు. వాళ్ళు రాగానే భోజనం చేయించి ఆఫీసులోనే ఆ వీడియో చూపించా.

కొడుకును అందులో చూడగానే వాళ్ళ సంతోషం చెప్పనలవిగాదు. వాళ్ళ కొడుకేనని నిర్థారించారు. నేరుగా ఆ పెట్రోల్ పంప్ కి తీసుకెళ్ళి వాళ్ళ కొడుకును అప్పగించా. నాలుగు రోజులు ఇంటికి తీసుకువెళ్ళి, మళ్ళీ ఉద్యోగం చేస్తానంటే తీసుకురండి అని ఆ మేనేజర్ చాలా ఉదారంగా హామీ ఇచ్చాడు. మా రిపోర్టర్ స్వయంగా వాళ్ళందరినీ ఊళ్ళో దింపి వచ్చాడు.... - తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?
  • సినిమా ఇండస్ట్రీకి ప్రమాద ఘంటికలు… బాగా పడిపోయిన వసూళ్లు…
  • అరుణారుణ జ్ఞాపకం హరితీకరణ..! ఆ స్థూపం ఆకుపచ్చబడింది..!
  • కేటీయార్ హుందా స్పందన… హరీష్ రావు ‘గంటె భాష’లో అక్కసు…
  • కలాం కావల్ – మమ్ముట్టి ‘నట మాయాజాలం’… మరో భిన్నపాత్రలో…
  • ‘ఆమెను’ చంపేసి… రెండు వారాల తరువాత మళ్లీ బతికించారట…
  • మరాఠీల అసలు తీర్పు..! విద్వేషంపై విజయం సాధించిన విజ్ఞత..!
  • నవ్వుతూ, నవ్విస్తూనే… పాఠం చెప్పగలదు… ప్రతిభ చూపగలదు…
  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions