.
1955వ సంవత్సరం…, ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం…. హాంగ్‌కాంగ్ ఆకాశంలో వెండి మేఘాల మధ్య ‘కాశ్మీర్ ప్రిన్సెస్’ అనే ఎయిర్ ఇండియా విమానం గంభీరంగా ప్రయాణిస్తోంది…. ఆ విమానంలో చైనా నుండి బాండుంగ్ సదస్సుకు వెళ్లే కీలక ప్రతినిధులు ఉన్నారు… అందరిలోనూ ఒకటే ఉత్కంఠ… ఆసియా దేశాల భవిష్యత్తును నిర్ణయించే సదస్సు అది…
కానీ, సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో, సరిగ్గా ప్రయాణం మొదలైన ఐదు గంటల తర్వాత… ఒక్కసారిగా విమానంలో భయంకరమైన పేలుడు సంభవించింది…
Ads
గాలిలో పెను ప్రమాదం
విమానం కుడి రెక్క (starboard side) నుంచి మంటలు చెలరేగాయి… క్యాబిన్ అంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది… ప్రయాణికుల హాహాకారాలు… పైలట్ కెప్టెన్ జతార్ తన సర్వశక్తులూ ఒడ్డి విమానాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు…
రేడియోలో చివరి సందేశం పంపారు… “విమానం కాలిపోతోంది.. నీటిపై ల్యాండింగ్ చేస్తున్నాం…” సెకన్ల వ్యవధిలో, కాశ్మీర్ ప్రిన్సెస్ దక్షిణ చైనా సముద్రంలో ముక్కలై కూలిపోయింది… ఆ మహా సముద్రంలో 16 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి…. కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే విధివశాత్తూ ప్రాణాలతో మిగిలారు….
రంగంలోకి ‘జెంటిల్మెన్ స్పై’
ఈ వార్త ప్రపంచాన్ని వణికించింది… చైనా మండిపడింది, ఇది అమెరికా కుట్ర అని ఆరోపించింది… విమానం మన దేశానిది కావడంతో భారత్‌పై కూడా అనుమానపు నీడలు పడ్డాయి… ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో నిజాన్ని వెలికితీయడానికి జవహర్‌లాల్ నెహ్రూ ఒక యువ అధికారిని ఎంచుకున్నాడు… ఆయనే రామేశ్వర్ నాథ్ కావ్ (R.N. Kao)…

37 ఏళ్ల కావ్ బీజింగ్ వెళ్లాడు… అక్కడ చైనా ప్రధాని చౌ ఎన్‌లై ఆయన కోసం ఎదురుచూస్తున్నాడు… నిజానికి ఆ పేలుడులో చౌ ఎన్‌లై చనిపోవాల్సింది, కానీ చివరి నిమిషంలో ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో బతికాడు… “నా ప్రతినిధులను చంపిన హంతకులెవరో నాకు తెలియాలి” అని చౌ ఎన్‌లై గంభీరంగా చెప్పాడు…
కావ్ దర్యాప్తు: పజిల్ ముక్కల వేట
కావ్ తన విచారణ మొదలుపెట్టాడు… ఆయన ముందున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు… భాష తెలియదు, ఎవరిని నమ్మాలో అర్థం కాదు, పైన దౌత్యపరమైన ఒత్తిళ్లు… ఆయన సముద్రం అడుగున ఉన్న విమాన శకలాలను పరిశీలించాడు… ప్రాణాలతో బయటపడిన ముగ్గురిని కలిశాడు…
నావిగేటర్ పాథక్ చెప్పిన ఒక మాట కావ్‌ను ఆలోచింపజేసింది…. “సార్, ఆ పేలుడు శబ్దం ఇంజిన్ నుండి రాలేదు, బయటి నుండి ఏదో తగిలినట్టు వినిపించింది….”
కావ్ ఆ శబ్ద తరంగాలను (sonic patterns) మళ్ళీ రీ-క్రియేట్ చేశాడు… ఒక మెకానికల్ ఇంజనీర్ మెదడుతో ఆలోచించాడు… విమానానికి సర్వీసింగ్ జరిగిన హాంగ్‌కాంగ్ విమానాశ్రయం కై టక్ (Kai Tak) వద్దకు వెళ్లాడు… అక్కడ పని చేసే వందలాది మంది గ్రౌండ్ స్టాఫ్ వివరాలు సేకరించాడు…

దొరికిన నిందితుడు.. బయటపడ్డ కుట్ర
ఆయన విచారణలో చౌ చూ అనే క్లీనర్ పేరు బయటకు వచ్చింది… ఆ వ్యక్తి విమానం హాంగ్‌కాంగ్‌లో ఉన్నప్పుడు టైమ్ బాంబును విమానంలో అమర్చాడని కావ్ కనిపెట్టాడు…
అదొక తెలివైన కుట్ర… తైవాన్ గూఢచారులు చౌ చూకి 6 లక్షల హాంగ్‌కాంగ్ డాలర్లు ఆశ చూపారు… బాంబు పెట్టి తైవాన్‌కు పారిపోతే అక్కడ లగ్జరీగా బతకొచ్చని నమ్మించారు… ఆ బాంబులో వాడింది అమెరికా తయారీకి చెందిన MK-7 డిటోనేటర్ అని కూడా కావ్ నిరూపించాడు…
కావ్ చైనా ప్రధాని చౌ ఎన్‌లై ముందు కూర్చుని, ఒక కాగితంపై బొమ్మ గీసి మరీ వివరించాడు… బాంబును ఎక్కడ పెట్టారు, అది ఎలా పేలింది, ఆ కుట్ర వెనుక తైవాన్ అధ్యక్షుడు చియాంగ్ కై-షెక్ ఎలా ఉన్నాడో పూసగుచ్చినట్టు చెప్పాడు…
ఒక చరిత్రకు పునాది
కావ్ దర్యాప్తుతో చైనా నోరు మూతపడింది… భారత్‌కు క్లీన్ చిట్ దొరికింది… ఒక యువ గూఢచారి ఒంటరిగా వెళ్లి అంతర్జాతీయ కుట్రను ఛేదించడం అప్పట్లో ఒక సంచలనం… ఈ విజయమే ఆర్.ఎన్.కావ్ ని భారత గూఢచార పితామహుడిగా మార్చింది… ఆ తర్వాత కొన్నేళ్లకే ఆయన నేతృత్వంలో R&AW ఏర్పడింది…
కాశ్మీర్ ప్రిన్సెస్ కేసు కేవలం ఒక విమాన ప్రమాదం కాదు... అది భారత గూఢచార సంస్థ పుట్టుకకు ఆరంభం... ఈ దేశ మొదటి అంతర్జాతీయ గూఢచార విజయం....
Share this Article