.
Subramanyam Dogiparthi… మనకు 56 అక్షరాలున్నా సరే, కొన్ని ఉచ్ఛారణలను తెలుగులో అక్షరబద్దం చేయలేం కదా… ఏదైనా రాస్తానని సవాల్ విసిరిన నరసరాజుకు తెనాలి రామకృష్ణ వృషభం అరుపును వినిపిస్తాడు… నరసరాజు ఘంటం ఎత్తేస్తాడు ఓడిపోయి…. తృవ్వట, ప్రువ్వట, పృవ్వట, ప్ర్‌ప్ర్‌వ్వట అని రకరకాలుగా రాశారు చాలామంది…
1989లో వచ్చిన సూత్రధారులులో ఓ పాట… జోలా జోలమ్మ జోలా పాట… ఈరోజుకూ హిట్టే… అందులో పాపకు లేదా బాబుకు పాడే లాలి… నడుమ లొలొలొలొ హాయీ అని వస్తుంది… నిజానికి దాన్ని సరిగ్గా రాయలేం, పలకాల్సిందే.,. సరే, ఈ సినిమాలోకి వెళ్దాం…
Ads
కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన మరో సంప్రదాయ సినిమా 1989 మే నెలలో విడుదలయిన ఈ సూత్రధారులు . సాధారణంగా ఆయన సినిమాలలో సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేయబడుతూ ఉంటాయి . కానీ ఈ సినిమాలో గ్రామీణ భారతంలో మమైకమైపోయిన గంగిరెద్దుల మేళం వారి జీవితాలు , అలాగే భజన బృందాల భక్తి ప్రచారం వంటి అంశాలపై ఫోకస్ పెట్టబడింది .
గోదావరి జిల్లా కడియపు లంక , తొర్రేడు ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో చాగల్లు గ్రామం , చింతలపూడి గ్రామం భజన బృందాలు పాల్గొన్నాయి . సినిమాలో వారి భజనలను కూడా అద్భుతంగా జొప్పించారు విశ్వనాధ్ .
సంప్రదాయాలను కాపాడుకోవటం అంటే కోట్లు కోట్లు తగలేసి రాజకీయులు , పోలీసులు , జూదరులు కుమ్మక్కై కోడిపందాలు , గుండాట జరిపించటం కాదు . దానినో ప్రభుత్వ కార్యక్రమం చేయటం కాదు . మన సంప్రదాయాలలో భాగమై ఆధునిక ప్రపంచంలో కనుమరుగై పోతున్న జీవన విధానాలను పరిరక్షించుకోవటం , పునరుధ్ధరించుకోవటం .
ఒక సినీ కళాకారుడిగా విశ్వనాధ్ సంప్రదాయ పరిరక్షణకు , ప్రచారానికి న్యాయం చేసారు ఈ సినిమా ద్వారా . ఈతరం యువత తప్పనిసరిగా చూడవలసిన సినిమా . చాలా స్లోగా , పాసింజర్ రైలులాగా సాగుతుంది . అయితే ఈ కళా ప్రయాణం పచ్చటి పొలాల మధ్య , చల్లని సెలయేర్ల మధ్య ఆహ్లాదకరంగా సాగుతుంది . దొరకునా ఇటువంటి అనుభూతి !!
గంగిరెద్దుల మేళంతో పొట్టపోసుకునే బావాబావమరదులు అక్కినేని , మురళీమోహన్లు . అక్కినేని భార్యగా సుజాత , మురళీమోహన్ కూతురిగా రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు . ఆ గ్రామంలో ఒక కీచక బకాసురుడు నీలకంఠం . ఈ పాత్రలో సత్యనారాయణ కూడా గొప్ప cruel villainy ని చూపాడు .
గ్రామంలో నివసించే అందరినీ హింసించటమే కాకుండా వారి ఆస్తిపాస్తులను కబ్జా చేసి వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉంటాడు . మంచం పాలైన అతని భార్య హరికధ చెప్పించుకోవటానికి యశోద అనే హరికధా విద్వాంసురాలిని , ఆమెతో పాటు ఫిడేలు విద్వాంసుడైన ఆమె భర్త వస్తారు .
ఆమె మీద దుష్ట కన్ను వేసిన కీచకుడు గ్రామంలోనే ఉండిపోయేలా అర్ధిస్తాడు . ఆమె భర్తను వేరే గ్రామానికి పంపించి యశోదమ్మను మలినం చేస్తాడు . భర్తగా అశోక్ కుమార్ , యశోదమ్మగా కె ఆర్ విజయ అసాధారణంగా , అద్భుతంగా నటించారు . హేట్సాఫ్ .
ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతుంది యశోదమ్మ . ఆమెతో పాటు అక్కినేని కొడుకు పట్నం వెళ్ళి బాగా చదువుకుని ఆ జిల్లాకే కలెక్టర్ అవుతాడు . కలెక్టర్ అయి నీలకంఠానికి బుధ్ధి చెప్పి అమాయక గ్రామ ప్రజలకు న్యాయం చేస్తాడు . ప్రజలు నీలకంఠంపై చంపేందుకు తిరగపడతారు .
ఆ జనాన్ని ఆపి దుర్మార్గుడు నీలకంఠాన్ని చంపకుండా అతనిలోని దుర్మార్గాన్ని చంపిస్తారు తండ్రీకొడుకులు . అహింసా పరమో ధర్మః అనే సందేశాన్ని అందించే ఈ సినిమా టైటిల్సులోనే అహింసను బోధించిన బుధ్ధుడు , మహాత్మాగాంధీ సందేశాలను పంచుకుంటారు విశ్వనాధ్ .
ఈ సినిమాలో అన్ని పాత్రలను గొప్పగా మలిచారు విశ్వనాధ్ . ముఖ్యంగా సత్యనారాయణ భార్య పాత్ర . భర్త అన్యాయాలు చేస్తూ ఉంటే పరిహారార్ధం మంచి పనులు చేస్తూ ఉంటుంది . చనిపోయే ముందు భర్తకు ఉత్తరం వ్రాస్తుంది . తనకు ఎవరయినా ఉత్తముడి చేత అంత్యక్రియలు చేయించమని .
- ఇలా అన్ని పాత్రలను గొప్పగా మలిచిన విశ్వనాధ్ రమ్యకృష్ణ పాత్రను unconvincing గా మలిచారు . కలెక్టర్ బావ మీద కోపమొచ్చి ఊళ్ళో అయ్యవారి కొడుకుని లేపుకుపోతుంది . మార్గమధ్యంలో మళ్ళా బుధ్ధొచ్చి వెనక్కు వచ్చేస్తుంది . ఆ పాత్రను అలా ఎందుకు మలిచారో !!
కొన్ని గుర్తుకు తెచ్చుకోవలసిన పాత్రలు . ముప్పై రోజుల్లో నేర్చుకునే పిచ్చి పాత్రలో శ్రీలక్ష్మి . సరదాగా ఉంటుంది . నీలకంఠాన్ని ప్రతిఘటించే పాత్రలో కోట శంకరరావు , అతని తండ్రి పాత్ర . బుర్రకధ జంట జిత్ మోహన్ మిత్రా , పొట్టి ప్రసాద్ . నీలకంఠం గుమస్తా బడి తాతాజీ .
ఇంక మరచిపోలేనివి కె వి మహదేవన్ సంగీతంలో సి నారాయణరెడ్డి , సిరివెన్నెల వారు , మాడుగుల నాగ ఫణి శర్మ పాటలను పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజ , మనో , కళ్యాణిలను . అత్యంత శ్రావ్యమైన పాటలను , భజనలను అందించారు విశ్వనాధ్ .
బాపు , విశ్వనాధులు రామయ్య మీద , కృష్ణుడి మీద పాటలు , భజనలు లేకుండా సినిమాలు తీసే ప్రసక్తే లేదు . కొలిచినందుకు నిన్ను కోదండరామా పాటలో రామాయణం మొత్తాన్ని జొప్పించారు నారాయణరెడ్డి . అలాగే ఆయనే వ్రాసిన యదుకుల వాడనందు కృష్ణమూర్తి భజన అద్భుతం .
నాగ ఫణి శర్మ విరచిత శ్రీరస్తు శుభమస్తు అంటూ సాగే హరికధ , ఆ హరికధ మధ్యలో పిల్లల నృత్యాలు , కె ఆర్ విజయ హరికధా ప్రదర్శన అద్భుతం . నృత్య దర్శకుడు కె వి సత్యనారాయణను మెచ్చుకోవలసిందే .
మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు అనే పాటలో అక్కినేని , మురళీమోహన్ల నటనను రస హృదయం ఉన్న ఏ ప్రేక్షకుడూ మరవలేడు .
- ఇంక భానుచందర్ , రమ్యకృష్ణల డ్యూయెట్ల పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఈ రమ్యకృష్ణేనా శివగామి అని అనిపిస్తుంది ఇప్పుడు చూసే వారికి . అప్పటికి లేత వయసు అందాలు… కానీ వరుసగా ఏడేళ్ల ఫ్లాపుల తరువాత ఈ సినిమాతో ఓ సక్సెస్ రుచిచూసింది ఆమె…
ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరించకపోయినా అవార్డులు , ప్రశంసలు బాగానే వచ్చాయి . జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ; రాష్ట్ర స్థాయిలో మూడు నంది అవార్డులు వచ్చాయి . మూడో ఉత్తమ చిత్రంగా నిర్మాతలు సుధాకర్ , కరుణాకర్లకు , ఉత్తమ ఆడియోగ్రాఫరుగా స్వామినాధనుకు , ప్రత్యేక జ్యూరీ అవార్డు కె ఆర్ విజయకు వచ్తాయి . ఆమెకు ఉత్తమ నటి అవార్డు రావాలి . అంత గొప్పగా నటించింది .
ఇంతకుముందు చూడని వారికి నా విన్నపం . స్లోగా ఉన్నా తప్పక చూడండి . చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . ముఖ్యంగా ఈ తరం సినిమా సాంకేతిక నిపుణులు చూడాలి . నేను పరిచయం చేస్తున్న 1228 వ సినిమా. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article