ఒక వార్త చిన్నగా అనిపించవచ్చుగాక… కానీ చదువుతుంటే రీడర్‌కు బాగా కనెక్టయిపోతుంది… ఈ ఏడాది తమ సమాజంలో 22 మంది పిల్లలు పుట్టారని ఓ మతం ఆనందపడిపోతోంది… అవును, జస్ట్ 22 మంది… కానీ అది వాళ్లకిప్పుడు పెద్ద సంఖ్యే… ఆ మతం పేరు పార్శి… అప్పుడెప్పుడో మధ్య ఆసియా నుంచి మతహింస కారణంగా ఇండియాకు వచ్చిన జొరాస్ట్రియన్లు… మన దేశంలో మైనారిటీ హోదా పొందిన మతస్తులు… కానీ ఆ సమూహం ఇప్పుడు ఉనికే కోల్పోయే దశలో ఉంది… ఆశ్చర్యంగా ఉందా..? నిజంగానే పార్శి సమాజం క్రమేపీ తన ఉనికినే కోల్పోతోంది… కొన్ని వివరాలు పైపైన చదివినా సరే, బోలెడంత విస్మయం… 2011 లెక్కల ప్రకారం ఇండియాలో వాళ్ల సంఖ్య 57 వేలు… పాకిస్థాన్‌లో మహా అయితే 1000 మంది ఉండేవారేమో, ఇప్పుడెంత మంది ఉన్నారో తెలియదు… ఇండియాలో కూడా ప్రస్తుతం 21 నుంచి 23 వేల వరకూ ఉండవచ్చునని ఓ రఫ్ అంచనా…
అనంతానంత కాలగమనంలో సంస్కృతులు, సమూహాలు, మతాలు, జాతులు, భాషలు అంతరించిపోవడం ఓ సహజ పరిణామమే… కానీ అవి తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నమైతే జరుగుతుంది… ఈ పార్శీల్లో ఆ తపన కూడా సరిగ్గా కనిపించదు… 10 శాతం మంది మహిళలు, 20 శాతం మంది పురుషులు అసలు పెళ్లే చేసుకోరు… దాంతో జాతిలో సంతానహీనత… దీనికితోడు ఎక్కడెక్కడికో కొందరు వలస వెళ్లిపోవడం… దాంతో క్రమేపీ వృద్ధులు మిగిలిపోతూ, పిల్లలు తగ్గిపోతూ… క్షీణదశకు చేరుకుంటోంది ఆ మతం… 2001లో లెక్కలు తీసినప్పుడు వీరిలో 30 శాతం మంది అరవయ్యేళ్లు దాటిన వృద్ధులే అని తేలింది… ఇప్పటి సంఖ్య తెలియదు… అందరూ పట్టణాల్లోనే ఉంటారు… ఎక్కువగా ముంబైలో… అందరూ చదువుకుంటారు… దాదాపు 98 శాతం అక్షరాస్యత… గుజరాతీ భాష మాట్లాడతారు… వ్యాపారాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటారు…
Ads
ఎంత సంపాదించినా సరే, ఒక దశ వచ్చాక అన్నీ వదిలేసి సన్యాసదీక్ష తీసుకుంటారు… ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబిస్తారు… వాళ్ల లోకమేదో వాళ్లది… వేరేవాళ్ల జోలికి పోరు సాధారణంగా… చివరకు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలూ భిన్నమే… పూడ్చడం, కాల్చడం కాదు… రాబందులకు అప్పగించేయడం… రాబందులు అంతరించిపోతుంటే అధికంగా బాధపడింది వీళ్లే… కానీ ఇప్పుడు వీళ్ల సంఖ్యే తగ్గిపోతోందిగా…! సమాధులకు ఖర్చుకన్నా ఆ డబ్బును చారిటీ కోసం ఖర్చుచేయడమే సమంజసం అని విశ్వసిస్తారు… ఇప్పుడు వార్త ఏమిటంటే..? కరోనా కారణంగా జనం వీలైనంతగా ఇళ్లకే పరిమితం అయ్యారు కదా… వర్క్ ఫ్రం హోం… కాదు, వర్క్ ఇన్ హోమ్, వర్క్ ఫర్ హోమ్… దాంతో 2020లో 61 మంది పిల్లలు పుట్టారట ఈ మతంలో… ఏమిటింత స్వల్ప సంఖ్య అనుకోకండి, ఇప్పుడున్న స్థితిలో ఇది మంచి సంఖ్యే అంటున్నారు వాళ్లు… గత ఏడెనిమిదేళ్లలో మొత్తం 320 మంది మాత్రమే పుట్టారని మైనారిటీ మంత్రిత్వ శాఖ చెబుతోంది… నిజానికి 2001 లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు పిల్లలు కేవలం 4.7 శాతం… ఇప్పుడు ఎంతకు తగ్గిపోయిందో లెక్కల్లేవు… ఈ స్థితిలో గత ఏడాది 60 మంది, ఈ ఏడాది ఇప్పటికి 22 మంది పుట్టారంటే అది పెద్ద సంఖ్యే మరి… ఐతే అసలు సంసారాలు, సంతానాలు, ఐహికాంశాల పట్ల వీళ్లలో చాలామందికి ఈ వైరాగ్యమేమిటనేది సామాజికవేత్తలకు ఇప్పటికీ ఓ పరిశీలనాంశమే…!!
Share this Article