.
అయోధ్య ట్రస్టు ముఖ్యుల చేతివాటం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి కదా… ప్రత్యేకించి ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ నిర్వాకం కోట్లాదిమంది రామభక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది… ట్రస్టును వెనుక నుంచి నడిపించే కీలక వ్యక్తులు చంపత్ రాయ్‌ను, తన టీమ్‌ను ఇన్నాళ్లు ఎందుకు ఉపేక్షించారనేది విస్మయకరం…
వరుసగా అనేక అక్రమాలు బయటికి వస్తున్నాయి కదా, అందులో తాజాగా ఓ ఉదాహరణ… ఎస్. లక్ష్మీనారాయణన్… ఈయన భారత ప్రభుత్వ యంత్రాంగంలో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన బ్యూరోక్రాట్… మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1970 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… దేశ అంతర్గత భద్రతను శాసించే కేంద్ర హోం కార్యదర్శి వంటి అత్యున్నత పదవిని నిర్వహించిన వ్యక్తి…
Ads
దేశ పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన, పదవీ విరమణ తర్వాత ఒక సామాన్య భక్తుడిగా మారి, తన జీవితకాల సంపాదనను అయోధ్య రామ్ లల్లాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు… అయోధ్య రామాలయంపై అపారమైన భక్తితో, తన తల్లి నగలను, తన సొంత పొదుపును కలిపి సుమారు 5 కోట్ల రూపాయల విలువైన, 151 కిలోల బరువున్న బంగారు పూత పూసిన ‘రామచరితమానస్’ను ఆయన అయోధ్య రాముడికి కానుకగా ఇచ్చాడు… అయోధ్య రాముడంటే అంత భక్తి తనకు…

కానీ, ఆ అద్భుతమైన కానుక ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది… రామ మందిరంలో ప్రతిష్ఠించిన కొద్ది నెలల పాటు నిత్యపూజలు అందుకున్న ఆ స్వర్ణ రామాయణం, ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయింది. ఇది ఎక్కడ ఉందో, ఏమైందో తెలుసుకోవడానికి లక్ష్మీనారాయణన్ ఏకంగా నాలుగుసార్లు స్వయంగా అక్కడికి వెళ్లాడు…
ఫలితం శూన్యం. రశీదు లేదు, సరైన సమాధానం అంతకన్నా లేదు. ఈ విషయమై ఆయన వందకు పైగా అయోధ్య ట్రస్ట్ కి , కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాడు… తన స్వంత కానుక ఏమైందనే ప్రశ్నకు సరైన సమాధానం కోసం చేతులు జోడించి వేచి చూశారు…
కానీ, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నుండి ఎదురైన సమాధానం… ‘‘ప్రతిసారి మళ్ళీ మళ్ళీ నన్ను విసిగించకండి… మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రతిసారి ఇక్కడికి రాకండి’’ అంటూ అవమానకరంగా వెళ్లగొట్టాడు…
పోనీలే, దేవుడి దగ్గర భద్రంగా ఉంటుంది కదా అని ఆయన వదిలేశాడు… కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విరాళాలు, కానుకల చోరీ విషయాలు మీడియాలో చూసి ఒక్కసారిగా ఆయనకు గుండె ఆగినంత పనయింది.. మీడియా ముందుకు వచ్చి తన బాధను వ్యక్తం చేశాడు… దొంగల మీద దుమ్మెత్తి పోశాడు…

ఇలాంటి అక్రమాలు బయటపడ్డాక యోగీ ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసి మొత్తం తవ్వుతోంది… దొంగలు బయటపడుతున్నారు… అంతా మంచికే, ప్రక్షాళన ప్రారంభమైంది… ఇన్నాళ్లూ అందరూ నమ్మిన ట్రస్టు పెద్దల బాగోతాలు బయటికొచ్చాయి… ఇకపై అక్రమాలు జరగకుండా కట్టుదిట్టాలు మొదలుపెట్టారు…
గుళ్లు, దోపిడీ, అక్రమాలు అన్నిచోట్లా ఉంటాయి… కానీ కోట్లాది మంది రామభక్తుల త్యాగాల్ని, భక్తిని, నమ్మకాన్ని దెబ్బతీసిన ట్రస్టు ముఖ్యులను సంఘ్, వీహెచ్పీ పెద్దలు అంత గుడ్డిగా ఎలా నమ్మారు, అంత పేలవమైన భద్రత వ్యవస్థ కొనసాగిన తీరు విస్మయకరమే!!
Share this Article