ఏమని చెప్పేది..? ఆమె జీవితం మనకు నేర్పించే ఎన్ని పాఠాలను ఒక్కచోట పేర్చేది..? అందుకే సూటిగా కథే చెప్పుకుందాం… ఆ కథే పట్టుదల, సంకల్పం, ఆరోగ్యం, నిరీక్షణ, పిచ్చిప్రేమ, పాజిటివ్ దృక్పథం వంటి ఎన్నో పదాలకు అర్థాలను చెబుతుంది… ఆమె పేరు వాలీ ఫంక్… వయస్సు 82 ఏళ్లు… అమెరికన్… ఈ వయసులో ఆమె అంతరిక్షంలోకి ప్రయాణించే ఓ స్పేస్ క్యాప్సూల్‌కు పైలట్ కాబోతోంది… ఆమెను ఆస్ట్రో టూరిస్ట్ అనకూడదేమో… పోనీ, ఆస్ట్రో పైలట్ అందాం… ఈ వయసులో ఒక స్పేస్ క్రాఫ్ట్‌కు పైలట్ కావడం అనేది ఓ చిన్న రికార్డు… ఈ రికార్డు దిశగా ఆమె సాగించిన ప్రయాణమే అసలు రికార్డు… 1961 నుంచి 1963… అమెరికా కొందరు మగవాళ్లతోపాటు 19 మంది మహిళలకు కఠోరశిక్షణను ఇచ్చింది… మూన్ నుంచి మెర్క్యూరీ వరకు… ఏ గ్రహానికి వెళ్లాలన్నా, అంతరిక్షంలోని పోయిరావాలన్నా వీరే… అదీ ఉద్దేశం… వారిలో 21 ఏళ్ల వాలీ ఫంక్ కూడా ఉంది… ఆ శిక్షణ పొందినవాళ్లలో అందరికన్నా తక్కువ వయస్సు ఆమెకు అప్పట్లో… 13 మంది పాసయ్యారు, వీళ్లను మెర్క్యూరీ 13 అనేవాళ్లు… సరే, ఇక్కడి వరకూ బాగుంది…
ఎంపిక చేసుకున్నప్పుడు, మహిళల్ని శిక్షణకు తీసుకున్నప్పుడు, తీసుకోవాలని అనుకున్నప్పుడు తెలియదా..? మొత్తం శిక్షణ పూర్తయ్యాక వాళ్లు ఆడవాళ్లు అని గుర్తొచ్చిందట ఆ ప్రభుత్వానికి… 1960 కాలం అది… అమెరికా అయితేనేం, దాని తాత అయితేనేం… అంతటా మగవివక్షే కదా… శిక్షణ తరువాత వీళ్లను విస్మరించి, ఆడవాళ్లకు స్పేస్ ట్రావెల్ ఏమిటీ అంటూ పురుషపుంగవులకే పట్టం కట్టారు… ఆమె హతాశురాలైంది… ఎందుకంటే..? ఆమెకు అంతరిక్షం అంటే ఓ పిచ్చి… మన వాతావరణం అంచుల్ని దాటేసి, ఖగోళంలో ఓ వాహనంలో అలా అలా తిరిగి రావాలి… వీలయితే ఏ గ్రహం మీదో అడుగుమోపాలి… ఎంతటి భారీ స్వప్నం కదా… కానీ కుదరలేదుగా…
Ads
లాస్ వేగాస్‌లో పుట్టి, న్యూమెక్సికోలో పెరిగిన ఫంక్ పేరెంట్స్ చిన్న జనరల్ స్టోర్స్ నడిపించేవాళ్లు… ఈమె పట్టుదలతో 16 ఏళ్లకే పైలట్ లైసెన్స్ సంపాదించింది… అప్పట్లో చదువులోనూ మహిళలపై వివక్షే… మెకానిక్స్ చదవకూడదట… దాంతో ఆమెకే చిరాకెత్తి స్కూల్ నుంచి డ్రాపవుట్… కానీ మరోవైపు ప్రొఫెషనల్ ఏవియేటర్‌గా తన అభ్యాసాన్ని కొనసాగించి, ఇదుగో ఈ మెర్క్యూరీ బ్యాచుకు కూడా ఎంపికైంది… ఓసారి శిక్షణ సమయంలో సౌండ్ ప్రూఫ్ వాటర్ ట్యాంకులో పడేశారు ఆమెను… చీకటి, నో సౌండ్, ఒంటరితనం… మానసిక, దైహిక దృఢత్వాన్ని పరీక్షించడానికి అన్నమాట… ఆమె అలా ఉండిపోయింది… చివరకు పదిన్నర గంటల తరువాత డాక్టర్లే ఆమెను బయటికి లాగారు… అదీ ఫంక్ అంటే… ఎప్పుడైతే అమెరికా ప్రభుత్వం ఆడవాళ్లు స్పేస్ ట్రావెల్‌కు అనర్హులు అని ప్రకటించిందో… ఆమె ఇక ప్రొఫెషనల్ ఏవియేటర్‌గా ఫెడరల్ ఏవియేటర్ అడ్మినిస్ట్రేషన్‌లో చేరింది… అదేసమయంలో వాలెంతినా తెరిష్కోవా అనే రష్యన్ మహిళ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది… ఫంక్ అంతరిక్షం వైపు చూస్తూ నిట్టూర్చేది…
60 ఏళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది… ఈలోపు దాదాపు 20 వేల ఫ్లయింగ్ అవర్స్ పూర్తయ్యాయి ఆమెకు… 3 వేల మందికి పైలట్ శిక్షణనిచ్చింది… మధ్యలో నాసాకు మూడుసార్లు దరఖాస్తు చేసుకుంది… తనకు ఆస్ట్రోనాట్‌గా అవకాశం ఇవ్వాలంటూ… నో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితేనే తీసుకుంటాం అన్నారు ఓసారి… కనీసం సైన్స్ గ్రాడ్యుయేట్ కావాలన్నారు మరోసారి… ఏజ్ బార్ అన్నారు ఇంకోసారి… ఈలోపు వర్జిన్ గ్రూపు బ్రాన్సన్ ప్రకటన చూసింది… ఫస్ట్ స్పేస్ టూరిస్టు జాబితాలో చేరడం కోసం రెండు లక్షల డాలర్లు కట్టింది… తను పొదుపు చేసుకున్న సొమ్ము, తను రాసిన పుస్తకాల మీద వచ్చిన రాయల్టీ గట్రా జమచేసింది… ఇలాగైనా అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కోరికను నిజం చేసుకోవాలనుకుంది… అదీ ఆమె పిచ్చి…
ఇదేసమయంలో జెఫ్ బోజెస్ కూడా ఓ టూరిస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఆలోచనలో పడ్డాడు కదా… ఈమె గురించి తెలిసింది… ఎక్కడో చదివాడు… తమ తొలి స్పేస్ టూరిస్ట్ కేప్స్యూల్లో నేను, నా బ్రదర్, మరొకరు లాటరీ ద్వారా ఎంపికయ్యే వ్యక్తి ప్రయాణిస్తాం, దానికి పైలట్‌గా రాగలవా అనడిగాడు ఆమెను… ముందు నమ్మలేదు, తరువాత ఎగిరి గంతేసింది… నేను రెడీ అన్నది… ఎస్, నాలుగైదు రోజుల్లో న్యూ షెపర్డ్‌గా పిలిచే వాహనంలో ఆమె అంతరిక్షంలోకి వెళ్లబోతోంది… 82 ఏళ్ల వయస్సులో స్పేస్‌లోకి వెళ్లే తొలి మహిళ… కాదు, కాదు, తొలి వ్యక్తి… గతంలో 1998లో 77 ఏళ్ల వయస్సులో జాన్ గ్లెన్ అనే ఒకాయన వెళ్లాడు… ఆయన కూడా ఆడవాళ్లకు స్పేస్ ట్రావెల్ ఏమిటీ అని తేలికగా తీసిపడేసిన వ్యక్తే గతంలో… వివక్ష కారణంగా 60 ఏళ్ల నిరీక్షణ ఏమిటి..? ఈ వయస్సులో ఆమెను బెజోస్ ఎంపిక చేసుకోవడం ఏమిటి..? కనీసం టూరిస్టుగానైనా వెళ్లాలి అనుకుంటున్న ఆమె ఏకంగా పైలట్ కావడం ఏమిటి..? యాభై, అరవై దాటగానే ఇక లైఫ్ అయిపోయింది అనుకునే నిరాశావాదులకు నీ లైఫే ఓ పాఠం బామ్మా… ఆల్ ది బెస్ట్…!! ( ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే దిగువన ఉన్న కోడ్ స్కాన్ చేసి ‘ముచ్చట’కు అండగా నిలవండి )
Share this Article